Politics

AP and Telangana Elections: ఆ ఒక్కటీ జరిగితే 2027లోనే..

నవంబర్ 6, 11వ తేదీల్లో బిహార్ అసెంబ్లీకి రెండు దశల్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు కేవలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకునే ప్రక్రియ కాదు..

AP and Telangana Elections: ఆ ఒక్కటీ జరిగితే 2027లోనే..

అవును... మీరు వింటున్నది అక్షరాలా నిజమే. ఆ ఒక్క పరిణామం జరిగితే 2027లోనే తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) జమిలి ఎన్నికలు జరుగుతాయని రాజకీయ విశ్లేషకులు, నిపుణులు భావిస్తున్నారు. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఆలోచన కూడా అదేనని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. పూర్తి వివరాల్లోకెళితే.. నవంబర్ 6, 11వ తేదీల్లో బిహార్ అసెంబ్లీకి రెండు దశల్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు కేవలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకునే ప్రక్రియ కాదు, ఇది దేశ రాజకీయాల గమనాన్ని, ముఖ్యంగా ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ (జమిలి) వంటి కేంద్ర ప్రభుత్వ అజెండాల భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టంగా మారుతోంది. ఈ బిహార్ తీర్పు ఫలితాలు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh), తెలంగాణ (Telangana) సహా దక్షిణాది రాష్ట్రాల ఎన్నికలను కూడా 2027 నాటికే ముందస్తుగా తీసుకురావడానికి దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు.

హోరాహోరీ యుద్ధం..

ఎన్డీఏ కూటమిలో జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీష్ కుమార్, భారతీయ జనతా పార్టీ (BJP), లోక్ జనశక్తి పార్టీ (Ram Vilas) వంటి భాగస్వాములున్నారు. 'సుశీల్ పాలన'తో అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నితీష్‌కి ‘ఇవే చివరి ఎన్నికలు’ కావచ్చనే ప్రచారం ఎన్డీఏ (NDA)కు సెంటిమెంట్ అడ్వాంటేజ్‌గా మారుతోంది. మరోవైపు, ప్రధాని మోదీ (PM Modi) చరిష్మా, బీజేపీ బలంగా అమలు చేస్తున్న హిందుత్వ అజెండా ఎన్డీఏకు అదనపు బలం. ప్రధాన ప్రతిపక్ష కూటమి మహా గఠ్‌బంధన్ (INDIA కూటమిలో భాగం) నాయకుడు, యువ సంచలనం తేజస్వీ యాదవ్, ప్రభుత్వ ఏర్పాటు అనంతరం లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామనే హామీలతో యువతను ఆకర్షిస్తున్నారు. ఆర్‌జేడీ, కాంగ్రెస్, వామపక్షాల కలయిక అయిన ఈ కూటమి గతంలో ముస్లిం-యాదవ్ సమీకరణంపై ఆధారపడితే, ఈసారి మాత్రం ఎన్నికల చర్చ మహిళ, యువత చుట్టూ తిరగడం గమనార్హం.

మోదీ భవిష్యత్తు, ఈవీఎంలపై చర్చ!

రాజకీయ విశ్లేషణల ప్రకారం, బిహార్‌లో ఇండియా కూటమి విజయం సాధిస్తే, అది ‘మోదీ కోరలు పీకేసినట్లే’ అవుతుందని రాజకీయ పండితులు బల్లగుద్ది చెబుతున్నారు. తద్వారా కేంద్రంలో మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి, జమిలి ఎన్నికల నిర్ణయం త్వరగా కార్యరూపం దాల్చే అవకాశాలు పెరుగుతాయి. కేంద్రంలో మోదీ సర్కార్ నిలదొక్కుకోవడానికి నితీష్, చంద్రబాబు నాయుడు వంటి నేతల మద్దతే ముఖ్యమనే చర్చ నేపథ్యంలో, బిహార్ వైఫల్యం కేంద్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అయితే, మరోవైపు, ‘ఈవీఎంలు ఉన్నంత కాలం మోదీని ఆపేదెవరు?’ అంటూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నాయి. ఇటీవల ఎన్నికల కమిషన్‌పై ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఈ ఎన్నికలకు మరింత ప్రాధాన్యతను పెంచాయి. ఈ రెండు ప్రధాన కూటములతో పాటు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సూరజ్ పార్టీ ప్రభావం కూడా కొన్ని కీలక నియోజకవర్గాలపై పడే అవకాశం ఉంది.

ఓటరు ఎటువైపు..!

మొదటి దశ పోలింగ్ (నవంబర్ 6) ముగిసి, రెండవ దశ పోలింగ్ (నవంబర్ 11) కోసం ఉత్కంఠ పెరుగుతున్న ఈ తరుణంలో, బిహార్ ప్రజల తీర్పు దేశ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందోనని యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. నితీష్ 'సుశీల్ పాలన' వారసత్వం, తేజస్వీ 'ఉద్యోగాల హామీ' పదును, మోదీ 'జమిలి' వ్యూహం.. ఈ త్రిముఖ పోరాటంలో నవంబర్ 14న వచ్చే ఫలితం కేవలం బిహార్‌కే కాదు, 2027 నాటి దక్షిణాది ముందస్తు ఎన్నికలకు సైతం దారి తీసే 'కౌంట్‌డౌన్' అవుతుందనడంలో సందేహం లేదు. ఎన్నికల కమిషన్‌పై ప్రతిపక్షాల ఈవీఎం విమర్శల మధ్య సాగుతున్న ఈ ఎన్నికల సమరం, దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక అగ్నిపరీక్షగా నిలవనుంది. బిహార్ ప్రజల మౌనం చెక్కుచెదరలేదు. మరి వారి తీర్పు కేంద్రంలోని అధికార పక్షానికి అభయం ఇస్తుందా? లేక పెద్ద షాక్ ఇస్తుందా? ఈ చారిత్రక ఘట్టం ఫలితం కోసం వేచి చూద్దాం!

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
November 8, 2025 3:01 AM