Politics

BRS: కేసీఆర్ బయటకు రాకుంటే జాకీలేసినా బీఆర్ఎస్ లేవదా?

‘బలవంతుడ నాకేమని పలువురిలో నిగ్రహించి పలుకటమేలా? బలవంతమైన సర్పము చలి చీమల చేతచిక్కి చావదె సుమతి’ అన్నారు బద్దెన. నిజమే.. దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. దానిని దాటి ప్రవర్తిస్తే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది.

BRS: కేసీఆర్ బయటకు రాకుంటే జాకీలేసినా బీఆర్ఎస్ లేవదా?

‘బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకటమేలా? బలవంతమైన సర్పము చలి చీమల చేతచిక్కి చావదె సుమతి’ అన్నారు బద్దెన. నిజమే.. దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. దానిని దాటి ప్రవర్తిస్తే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. కేసీఆర్ (KCR).. టీఆర్ఎస్‌ (TRS)ను స్థాపించి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేశారు. ఆయన ఆ సమయంలో ఏం చేసినా చెల్లింది. పలుమార్లు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లినా కూడా టీఆర్ఎస్‌కు ప్రజలు అండగా నిలిచారు. ఆ పార్టీ ధాటికి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ (Congress), మద్దతు తెలిపిన బీఆర్ఎస్ (BRS) పత్తా లేకుండా పోయాయి. ఇంత సాధించాక సైలెంట్‌గా ఉంటారా? అహంకారం నెత్తికెక్కింది ఆ పార్టీ నేతలకు... కనీసం మండల స్థాయిలో ముందుండి నడిపిస్తున్న నేతలెవరు? వంటి అంశాలను పట్టించుకున్న పాపాన పోలేదు. అదే ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక మీదట నిలదొక్కుకుంటుందా?

మండల స్థాయిలో అసలైన నేతలెవరు? షో చేస్తున్నదెవరు? తెలుసుకోకపోవడం కూడా ఆ పార్టీ పరిస్థితి దిగజారేందుకు ఒక కారణమైంది. క్షేత్ర స్థాయిలో పార్టీ గట్టిగా ఉంటేనే.. ఏ పార్టీ అయినా మనుగడ సాగిస్తుంది. అదే లేకుంటే పరిస్థితి బీఆర్ఎస్ మాదిరిగా తయారవుతుంది. ప్రస్తుతం తలెత్తుతున్న ప్రశ్నలు చాలా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితేంటి? ఇక మీదట నిలదొక్కుకుంటుందా? ఏ ఎన్నికలు జరిగినా ఎందుకు విజయం సాధించలేకపోతోంది? వంటి ప్రశ్నలెన్నో జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో (Jubleehills Bypoll) చర్చనీయాంశమవుతున్నాయి. ఒక్క జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు మాత్రమే కాదు.. 2023 నుంచి ఆ పార్టీకి గడ్డుకాలమే నడుస్తోంది. 2023 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) అధికారాన్ని కోల్పోయింది. అక్కడి నుంచి పార్టీకి ఎదురు దెబ్బలు సర్వసాధారణంగా మారిపోయాయి. కేటీఆర్ (KTR) సర్వశక్తులు ఒడ్డినా కూడా ఫలితం దక్కడం లేదు.

బీఆర్ఎస్ సాధించిందేమైనా ఉందా?

పదేళ్ల పాటు తెలంగాణ (Telangana)ను పాలించిన పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో (Loksabha Elections) ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు కూడా రాకపోవడం గమనార్హం. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఇలా జరగడం తొలిసారి. ఆ తరువాత ఆ పార్టీకి సిట్టింగ్ స్థానమైన కంటోన్మెంట్‌ను ఉప ఎన్నికల్లో కోల్పోయింది. ఇది మాత్రమేనా? ఆ తరువాత జరిగిన వరంగల్‌-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలో (Graduate MLC Elections)నూ పరాజయం పాలైంది. ఇక ఇప్పుడు జూబ్లీహిల్స్‌ స్థానాన్ని సైతం చేజార్చుకుంది. ఇక్కడ కనీసం సింపతీ కూడా వర్కవుట్ కాలేదు. అసలు ఇంత దయనీయ స్థితికి బీఆర్ఎస్(BRS) రావడానికి కారణమేంటి? అప్పట్లో వెన్నుదన్నుగా నిలిచిన ప్రజలు ఇప్పుడెందుకు ఆ పార్టీని దూరం పెడుతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా ఇదంతా స్వయంకృతమేనని చెప్పాలి. పార్టీ అధినేత సహా ముఖ్య నేతల అహంకార ధోరణి పార్టీని ఈ స్థితికి తీసుకొచ్చిందనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. గత రెండేళ్ల కాలంలో బీఆర్ఎస్ సాధించిందేమైనా ఉందా? అంటే కేవలం మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానమే.

కేసీఆర్ రాజకీయాలకు స్వస్తి చెప్పినట్టేనా?

2023 డిసెంబర్ నుంచి పరిస్థితులను విశ్లేషిస్తే.. ఇప్పటి వరకూ బీఆర్ఎస్‌ను కేవలం కేసీఆర్‌ను చూసి జనాలు గెలిపించారేమో అనిపిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైన తర్వాత ఆయన బయటకు వచ్చిందే లేదు. పెద్దగా ఎక్కడా కనిపించింది కూడా లేదు. ఇక మీదట కనిపిస్తారని కూడా అనిపించడం లేదు. ఇటీవల హరీష్‌రావు (Harish rao)కి పితృవియోగం కలిగిన సమయంలో కేసీఆర్ కనిపించారు. బక్క చిక్కిపోయి చాలా బలహీనంగా కనిపించారు. ఆయన వీడియోలు, ఫోటోలు చూసిన వారంతా కేసీఆర్ (KCR) అనారోగ్యంతో బాధపడుతున్నారేమోనని భావిస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. అందుకే కేసీఆర్ బయటకు రావడం లేదమోనని టాక్ పెద్ద ఎత్తున నడిచింది. దాదాపుగా కేసీఆర్ రాజకీయాలకు స్వస్తి చెప్పేశారన్న టాక్ కూడా నడుస్తోంది. కేసీఆర్ బయటకు రాకుంటే మాత్రం జాకీలేసినా బీఆర్ఎస్ లేవడం కష్టమేనని టాక్ నడుస్తోంది. నిజంగానే కేసీఆర్‌ను చూసే బీఆర్ఎస్‌కు ప్రజలు అండగా నిలిస్తే మాత్రం ఇక మీదట కూడా ఆ పార్టీ కోలుకునే అవకాశాలు ఉండకపోవచ్చని అంతా చెప్పుకుంటున్నారు. చూడాలి మరి మున్ముందు ఏం జరుగుతుందో.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
November 15, 2025 10:35 AM