Politics

హైడ్రాకు ఏడాది.. పెద్దోళ్లను కొట్టలేకున్నదేం?

హైడ్రా ఏర్పాటై ఏడాది దాటింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయాలలో హైడ్రా ఒకటి. హైడ్రాను 2024 జూలై 19న ఏర్పాటు చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

హైడ్రాకు ఏడాది.. పెద్దోళ్లను కొట్టలేకున్నదేం?

హైడ్రా ఏర్పాటై ఏడాది దాటింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయాలలో హైడ్రా ఒకటి. హైడ్రాను 2024 జూలై 19న ఏర్పాటు చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో విపత్తు నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదొక స్వతంత్ర సంస్థ. దీనికి కమిషనర్‌‌గా ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్‌ వ్యవహరిస్తున్నారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. ఈ స్వతంత్ర సంస్థను రేవంత్ ఏ లక్ష్యంతో ఏర్పాటు చేశారు? ఆ లక్ష్యం కొంతైనా నెరవేరిందా? తెలుసుకుందాం.

తొలి విడతలో భాగంగా.. ఆరు చెరువులను బాగు చేసి వాటిని ఒక మోడల్‌గా తీర్చిదిద్దనున్నట్టు హైడ్రా (Hyderabad Disaster Response and Asset Protection Agency) అప్పట్లో వెల్లడించింది. ఆ తర్వాత మిగిలిన చెరువులను ప్రభుత్వం తరఫున, ఎన్జీవోల సహకారంతో బాగు చేయాలనేది ప్రణాళిక. ఇవాళ ( వాటిలో మొదటిది బతుకమ్మకుంట. ఇంకా పనులు అయితే పూర్తి కాలేదు. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. బతుకమ్మ పండుగ అయితే సరిగ్గా నెల రోజుల్లో రానుంది. అప్పటి వరకూ పనులు పూర్తవుతాయా? అంటే సందేహమే. అయితే కొంత మేర పూర్తైంది కాబట్టి ఈ ఏడాది కాకున్నా వచ్చే ఏడాది నాటికి పూర్తవ్వొచ్చు.

ఆ తరువాత ఏం చేశారు?

రెండోది తుమ్మిడికుంట. ఇక్కడ సినీ నటుడు నాగార్జున (Nagarjuna)కు చెందిన ‘ఎన్ కన్వెన్షన్’ ఉంటే కూల్చేశారు. అప్పట్లో ఇదొక సంచలనం. ఎన్ కన్వెన్షన్‌ను తుమ్మిడికుంట ఎఫ్‌టీఎల్ (FTL) పరిధిలో నిర్మించడంతో కూల్చివేశారు. అది సరే కానీ.. ఆ తరువాత ఏం చేశారు? వాస్తవానికి తుమ్మిడికుంట (Tummidikunta) చెరువు దాదాపుగా 30 ఎకరాల ఎఫ్‌టీఎల్ విస్తీర్ణంలో ఉండేది. ఆక్రమణల కారణంగా అది కుంచించుకుపోయి దానిలో సగం కూడా మిగల్లేదు. అంటే 13-14 ఎకరాలకు తగ్గిపోయింది. మొత్తానికి అయితే కూల్చివేతలతో దానిపి మునపటి స్థితికి తీసుకొచ్చారనే చెప్పాలి. కానీ తుమ్మిడికుంట వివాదం తెలంగాణ హైకోర్టుకు చేరడంతో పనులు నిలిపివేయాలని స్టే జారీ చేసింది. కాబట్టి దీనితోనూ ఒరింగిందేమీ లేదు.

ఎప్పుడు క్లియర్ చేయాలి?

ఇదంతా ఒక్కరోజులోనో.. లేదంటే ఒక్కపూటలోనో పూర్తయ్యే వ్యవహారం కాదు.. బతుకమ్మకుంట, తమ్మిడికుంటతోపాటు సున్నంచెరువు, ఉప్పల్ నల్లచెరువు సహా ఆరు చెరువులలో అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయి. ఆరు చెరువుల పరిస్థితే ఇలా ఉంటే.. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ లెక్కల ప్రకారం ఔటర్ రింగు రోడ్డు పరిధిలో ఎన్ని చెరువులున్నాయో తెలిస్తే షాక్ అవుతారు. హెచ్ఎండీఏ (HMDA) పరిధిలో దాదాపు 600, జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో 185 చెరువులు కలుపుకొని మొత్తం 785 చెరువులున్నాయి. మరి వీటన్నింటినీ ఎప్పుడు పునరుద్ధరించాలి? వీటిలో అక్రమ నిర్మాణాలుంటే ఎప్పుడు క్లియర్ చేయాలి? సీఎం కేసీఆర్ మూసీ ప్రక్షాళన చేస్తానని పదేళ్ల క్రితం ప్రకటించారు. కానీ జరిగిందా? ప్రస్తుతం రేవంత్ చెబుతున్నది కూడా అంతేనా? ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సమయంలో అంతా ఇంకేముంది..రేవంత్ (CM Revanth Reddy) ఎవ్వర్నీ లెక్క చేయరు.. పక్కాగా చెరువుల పునరుద్ధరణ ఖాయం అనుకున్నారంతా. కానీ అది నెరవేరుతుందా?

ఎన్ కన్వెన్షన్‌తో ముగింపేనా?

ఇవాళ (ఆగస్ట్ 21) రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం మాదాపూర్ ప్రాంతంలోని జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో హైడ్రా కూల్చేవేతలను కొనసాగించింది. అక్కడ కొన్ని పార్కుల‌తో పాటు ర‌హ‌దారులను ఆక్రమించి 22.20 ఎక‌రాల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా (HYDRA) కూల్చివేసింది. ఈ లే అవుట్‌లో రెండు పార్కులకు చెందిన దాదాపు 8,500 గజాల స్థలం.. 5 వేల గజాల మేర రోడ్డు కూడా క‌బ్జాకు గురైంది. దీనికి తోడు.. 300ల గ‌జాల ప్రభుత్వ స్థలంలో అక్రమంగా వెలిసిన హోట‌ల్ షెడ్డును తొలగించి మొత్తంగా రూ.400 కోట్ల విలువైన 16000 గజాల స్థలాన్ని హైడ్రా కాపాడింది. అంతా బాగానే ఉంది కానీ చిన్నోళ్లనేనా? హైడ్రా పెద్దోళ్లను కొట్టదా? ఎన్ కన్వెన్షన్‌తో ముగింపేనా? రాజకీయ నాయకులు ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క స్థలాన్ని కబ్జా చేయలేదా? చేస్తే హైడ్రా దాని జోలికి వెళ్లడం లేదా? అన్నీ సమాధానం లేని ప్రశ్నలే..

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
August 21, 2025 2:58 PM