Politics

Harish Rao: హరీశ్ ‘పవర్ ప్లే’.. గులాబీ బాస్ బాధ్యతలిచ్చాక తగ్గేదేలే!

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. అది ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి హరీశ్ రావు వేగం! గత కొంతకాలంగా మౌనంగా ఉన్నట్లు కనిపించినా, గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్.. మరిన్ని బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి కట్టప్ప తన పూర్తిగా మార్చేశారు

Harish Rao: హరీశ్ ‘పవర్ ప్లే’.. గులాబీ బాస్ బాధ్యతలిచ్చాక తగ్గేదేలే!

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. అది ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి హరీశ్ రావు వేగం! గత కొంతకాలంగా మౌనంగా ఉన్నట్లు కనిపించినా, గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్.. ఫ్లోర్ లీడర్‌తో మరిన్ని బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి కట్టప్ప తన రాజకీయ శైలిని పూర్తిగా మార్చేశారు. ఒకవైపు పదునైన ప్రెస్ మీట్లు, మరోవైపు క్షేత్రస్థాయిలో కేడర్‌ను ఏకం చేయడం.. మొత్తానికి బడా గులాబీ నేత మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశారు.

శాసనసభ ఎన్నికల తర్వాత పార్టీ కొంత స్తబ్దుగా ఉన్న సమయంలో, కేసీఆర్ మళ్లీ హరీశ్ రావుకు కీలక బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూడటం లేదు. కేవలం సిద్ధపేటకే పరిమితం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఆయన ముందు వరుసలో ఉంటున్నారు. ముఖ్యంగా కృష్ణ, గోదావరి జలాల విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డిలపై ఆయన సంధిస్తున్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి.

కాంగ్రెస్ నేతల నుంచే కితాబులు!

హరీశ్ రావు చేస్తున్న రాజకీయాల్లో మరో విశేషం ఏంటంటే.. ప్రత్యర్థి పార్టీ నేతల నుంచి కూడా ఆయన ప్రశంసలు అందుకోవడం. అసెంబ్లీలో ఆయన సబ్జెక్ట్ నాలెడ్జ్ చూసి అధికార పక్ష నేతలు సైతం అవాక్కవుతున్నారు. హరీష్ రావు తన జిల్లాలో చేస్తున్న అభివృద్ధి పనులకు కాంగ్రెస్ నేతల నుంచి కూడా అప్పుడప్పుడు కితాబులు అందుతుండటం ఆయన పొలిటికల్ డిప్లొమసీకి అద్దం పడుతోంది. ఇటీవల పార్టీలో అంతర్గతంగా జరిగిన కొన్ని పరిణామాలు, ముఖ్యంగా కవిత చేసిన కొన్ని వ్యాఖ్యలు కట్టప్పకు నెగిటివ్ కాకుండా, ప్లస్ అయ్యాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి చూపించిన నిబద్ధత చూసి, సామాన్య గులాబీ కార్యకర్తలు ఆయనకు మరింత దగ్గరయ్యారు. ‘హరీశ్ ఉంటేనే పార్టీ సేఫ్’ అనే భావన కేడర్‌లో బలంగా నాటుకుపోయింది. బావ-బామ్మర్దుల మధ్య విబేధాలు సృష్టించాలని ప్రత్యర్థులు చూస్తున్నా, హరీశ్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారు.

శాపమా.. వరమా?

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు అందడం, దాదాపు 7-8 గంటల పాటు విచారణ ఎదుర్కోవడం హరీశ్ రావు రాజకీయ జీవితంలో మరో కీలక మలుపు. సాధారణంగా ఇలాంటి నోటీసులు వస్తే నేతలు డిఫెన్స్‌లో పడతారు. కానీ, హరీశ్ మాత్రం దీనిని ఒక అవకాశంగా మార్చుకున్నారు. ఇది కక్ష సాధింపు చర్య అని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన సక్సెస్ అయ్యారు. జనవరి 20, 2026న ఆయన విచారణకు హాజరైన తీరు, ఆ తర్వాత మీడియా ముందు మాట్లాడిన విధానం చూస్తుంటే.. ప్రజల్లో ఆయనపై సానుభూతితో పాటు క్రేజ్ కూడా పెరిగేలా కనిపిస్తోంది. ప్రస్తుత రాజకీయ వాతావరణం ట్రబుల్ షూటర్‌కు అనుకూలంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేకతను వాడుకోవడం, మరోవైపు పార్టీలో తన పట్టును నిరూపించుకోవడం.. ఇలా రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు. తన చిరకాల ప్రత్యర్థి రేవంత్ రెడ్డి అధికారంలో ఉండటం హరీశ్‌కు మరింత కసిని ఇస్తోంది. సింగరేణి టెండర్లలో అవినీతిని బయటపెట్టడం నుంచి, రైతు రుణమాఫీ వరకు ప్రతి అంశంలోనూ హరీశ్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.

మొత్తానికి చూస్తే.. ప్రజా నాడిని పట్టుకోవడంలో ట్రబుల్ షూటర్ హరీశ్ మళ్లీ సిద్ధహస్తుడని నిరూపించుకుంటున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా ఆయన వేస్తున్న అడుగులు బీఆర్ఎస్‌కు మళ్లీ పూర్వ వైభవం తెస్తాయా? లేక ఈ వివాదాలు ఆయనను మరింత ఇబ్బందుల్లోకి నెడతాయా? అనేది వేచి చూడాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం.. గులాబీ పార్టీలో ఇప్పుడు హరీశ్ రావు మాత్రం అన్ స్టాపబుల్ అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు!

ప్రజావాణి చీదిరాల

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
January 22, 2026 9:14 AM