Phone Tapping: హరీశ్ పాయే.. కేటీఆర్ వచ్చే.. ఇక కేసీఆర్ వంతేనా?
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఏ ఇద్దరు నేతలు కలిసినా వినిపిస్తున్న ఒకే ఒక్క మాట.. ‘నీ ఫోన్ ట్యాప్ అయిందా?’ అన్నదే. అప్పుడు అధికారంలో ఉండి ఫోన్లు విన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేతలకు, ఇప్పుడు అదే ఫోన్ ట్యాపింగ్ కేసు నిద్ర లేకుండా చేస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఏ ఇద్దరు నేతలు కలిసినా వినిపిస్తున్న ఒకే ఒక్క మాట.. ‘నీ ఫోన్ ట్యాప్ అయిందా?’ అన్నదే. అప్పుడు అధికారంలో ఉండి ఫోన్లు విన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేతలకు, ఇప్పుడు అదే ఫోన్ ట్యాపింగ్ కేసు నిద్ర లేకుండా చేస్తోంది. ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) అధికారులు గులాబీ అగ్రనేతలను వరుస కట్టి పిలుస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్ రావు విచారణ ముగియగా.. ఇప్పుడు వంతు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గరికి చేరింది. అయితే అసలు క్లైమాక్స్ మాత్రం ‘పెద్దాయన’ కేసీఆర్ నోటీసుల దగ్గరే ఉంటుందని పొలిటికల్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
సిట్ పిలుపు.. కేటీఆర్ కుదుపు!
హైదరాబాద్ నందినగర్‌లోని కేటీఆర్ నివాసానికి గురువారం ఉదయం సిట్ అధికారులు 160 సీఆర్పీసీ కింద నోటీసులు పట్టుకుని వెళ్లడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని డెడ్ లైన్ విధించారు. మొత్తానికి కేటీఆర్‌ను నిన్న 7 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. రాధాకిషన్ రావుతో కలిపి ఒక గంట పాటు విచారించిన మీదట విడిగా మరో 7 గంటల పాటు విచారించారు. ముఖ్యంగా రాధాకిషన్ రావుకు కేటీఆర్ షేర్ చేసిన నంబర్లపై సిట్ అధికారులు ఆరా తీసినట్టుగా సమాచారం. కొందరు ముఖ్యమైన రాజకీయ నేతలతో పాటు వ్యాపారవేత్తల ఫోన్ ట్యాపింగ్‌పై సైతం కేటీఆర్‌ను సిట్ అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ‘అప్పట్లో మీ భార్య ఫోన్ కూడా ట్యాప్ అయిందని మీరే అన్నారు కదా.. మరి ఆ ట్యాపింగ్‌కు ఆదేశించిన ఆ 'పెద్దాయన' ఎవరో మీకు తెలిసే ఉంటుంది కదా!’ అనే కోణంలో సైతం అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించినట్టు సమాచారం. గత పదేళ్ల ప్రభుత్వంలో ‘నెంబర్-02’గా చక్రం తిప్పిన కేటీఆర్‌కు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు సూత్రధారులెవరో తెలియకుండా ఉంటుందా? అనేది పోలీసుల అనుమానం. అంతకు ముందు అంటే నోటీసులు అందుకున్న అనంతరం... హరీశ్ రావును సాక్షిగా పిలిచినట్లే తనను కూడా పిలిచారని, విచారణకు సహకరిస్తానని చెబుతూనే.. బీజేపీ-కాంగ్రెస్ కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. మరోవైపు.. దొంగే.. దొంగ అని అరిచినట్లు ఉందట కాంగ్రెస్ వ్యవహారం అని బీఆర్ఎస్ శ్రేణులు అంటుంటే.. గోడలకు కూడా చెవులు ఉంటాయి అనుకున్నాం కానీ.. ఇక్కడ గోడల లోపల రికార్డర్లు ఉన్నాయని ఇప్పుడు అర్థమవుతోందని కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు.
కేసీఆర్ ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు?
ఇప్పుడు అందరి కళ్లూ గజ్వేల్ వైపు ఉన్నాయి. హరీశ్ పాయే.. కేటీఆర్ కూడా విచారణకు వచ్చే.. ఇక త్వరలోనే గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్‌కు కూడా నోటీసులు అందుతాయా? అనే చర్చ జోరందుకుంది. సిట్ దూకుడు చూస్తుంటే కేవలం కేటీఆర్‌తో ఆగేలా లేదు. కేసీఆర్ కుటుంబంలోని కీలక వ్యక్తులైన సంతోష్ కుమార్, కవిత, ఆమె భర్త అనిల్.. ఇలా అందరినీ లైన్లోకి తెచ్చేలా స్కెచ్ వేసినట్లు కనిపిస్తోంది. కవిత స్వయంగా తన ఫోన్ ట్యాప్ అయిందని గతంలో చేసిన వ్యాఖ్యలనే సిట్ అధికారులు ఆయుధంగా మలుచుకుంటున్నారు. ఆమెను సాక్షిగా పిలిచి, ఆమె చెప్పే వివరాల ఆధారంగా పార్టీలోని అగ్రనేతలపై ఉచ్చు బిగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ‘ముందు వెనుక చూసుకోకుండా మాట్లాడితే.. మూతి పగిలే ప్రమాదం ఉంటుంది’ అన్నట్లుగా, ఇప్పుడు తమ పాత వ్యాఖ్యలే తమకు ఉరితాడుగా మారుతున్నాయని గులాబీ నేతలు లోలోపల మదనపడుతున్నారు. సిట్ విచారణల పరంపర చూస్తుంటే బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నేతల్లో వణుకు మొదలైంది. ‘పిట్ట కొంచెం.. కూత ఘనం’ అన్నట్లుగా చిన్న చిన్న ఆరోపణలు కాస్తా ఇప్పుడు కొండంత కేసై కూర్చున్నాయి. పార్టీలో ఉంటే కేసులు చుట్టుముడతాయా? కాంగ్రెస్ గూటికి చేరితే రక్షణ దొరుకుతుందా? అని చాలామంది నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఒకవేళ కేసీఆర్‌కు కూడా నోటీసులు వస్తే, పార్టీ క్యాడర్ చెల్లాచెదురయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఇదొక ‘సెల్ ఫోన్’ కురుక్షేత్రం!
మున్సిపల్ ఎన్నికల ముందే బీఆర్ఎస్ అగ్రనేతలను టార్గెట్ చేయడం వెనుక రేవంత్ రెడ్డి పక్కా వ్యూహం ఉందన్నది కాదనలేని సత్యమని రాజకీయ విశ్లేషకులు, మేథావులు చెబుతున్న మాటలు. ‘చెయ్యి దాటిన వేళ.. చెయ్యగలిగేది ఏమీ లేదు’ అన్న సామెత చందంగా.. అప్పట్లో అధికార గర్వంతో చేసిన పనులు ఇప్పుడు శాపాలుగా మారుతున్నాయి. జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద 300 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు, రోప్ పార్టీల మోహరింపు.. ఇవన్నీ చూస్తుంటే కేటీఆర్ విచారణ కేవలం ఒక ఫార్మాలిటీ మాత్రమే కాదు, లోతైన కుట్రలను వెలికితీసే ప్రయత్నం అని అర్థమవుతోంది. మరి ఈ ‘సెల్ ఫోన్’ కురుక్షేత్రంలో సిట్ అధికారులు ఏయే రహస్యాలను బయటపెడతారో.. గులాబీ బాస్‌కు నోటీసులు ఎప్పుడు అందుతాయో చూడాలి!
ప్రజావాణి చీదిరాల