Future City: గురు శిష్యుల మేధోమథనం.. రేవంత్ ‘ఫ్యూచర్ సిటీ’ వెనుక చంద్రబాబు!
ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu).. ఈ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది ‘ఐటీ ఐకాన్’, ‘అభివృద్ధికి పర్యాయపదం’, ‘విజన్ డాక్యుమెంట్ల పితామహుడు’. మూడు దశాబ్దాల క్రితమే హైదరాబాద్‌ను హైటెక్ సిటీ, సైబరాబాద్‌గా తీర్చిదిద్దిన ఘనుడు..
ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu).. ఈ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది ‘ఐటీ ఐకాన్’, ‘అభివృద్ధికి పర్యాయపదం’, ‘విజన్ డాక్యుమెంట్ల పితామహుడు’. మూడు దశాబ్దాల క్రితమే హైదరాబాద్‌ను హైటెక్ సిటీ, సైబరాబాద్‌గా తీర్చిదిద్ది, భారతదేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన (Most Livable) నగరంగా మార్చడానికి ఆయన వేసిన పటిష్టమైన పునాదులే నేటికీ హైదరాబాద్‌కు బలమైన వెన్నెముక. నాటికీ నేటికీ, అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ విషయంలో ఆయన విజన్ ముందు ఎవరైనా దిగదుడుపే అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి విజనరీ నాయకుడి శిష్యుడైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడవాలని నిర్ణయించుకున్నారు.
గురువు చంద్రబాబు (Chandrababu) సలహా మేరకు.. రేపొద్దున్న తాము ఉన్నా లేకున్నా, తరతరాలు గుర్తుండిపోయేలా, తెలంగాణకు కీర్తిని తెచ్చే ఒక ‘ఫ్యూచర్ సిటీ’ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గతంలో అప్పులు, జీతాలకే డబ్బుల్లేవని చెప్పిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఈ ‘ఫ్యూచర్ సిటీ’ని తన ప్రభుత్వ ఏకైక ఎజెండాగా మార్చారు. పెట్టుబడులు మొదలుకుని అన్ని వ్యవహారాలు ఈ నగరంలోనే ఉంటాయని స్పష్టం చేస్తూ, శంకుస్థాపనల నుంచి గ్లోబల్ సమ్మిట్ల వరకు అన్నీ అక్కడే నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే, డిసెంబర్ 8, 9 తేదీల్లో ఈ ఫ్యూచర్ సిటీలోనే ‘తెలంగాణ రైజింగ్ సమ్మిట్’ (Telangana Rising Summit) గ్రాండ్‌గా నిర్వహించాలని నిర్ణయించారు.
30 వేల ఎకరాల్లో నిర్మాణం
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రణాళికల మేరకు, ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం 30 వేల ఎకరాలను సిద్ధం చేస్తున్నారు. ఈ భూమి సేకరణలో రైతుల నుంచి వ్యతిరేకత తలెత్తకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్రభుత్వం వద్ద 14 వేల ఎకరాలు అందుబాటులో ఉండగా, మిగిలిన 15 వేల ఎకరాలకు పైగా భూమిని ల్యాండ్ పూలింగ్ విధానంలో సేకరిస్తున్నారు. దీనిలో భాగంగా, అభివృద్ధి చేసిన ప్లాట్లలో రైతులకు ఏకంగా సగం వాటా ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు, విస్తృతాధికారాలతో కూడిన ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ అథారిటీలో పాలకవర్గంతో పాటు కార్యనిర్వాహక మండలి కూడా ఉంటుంది. ప్రస్తుతం 300 అడుగుల గ్రీన్ ఫీల్డ్ రోడ్డు పనులను ప్రారంభించిన ప్రభుత్వం, వారంలోనే రెండో విడత భూసేకరణ నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
విద్య, పెట్టుబడులకు కేంద్రంగా..
ఈ నగరంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న స్కిల్ యూనివర్సిటీ (Skill University) పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ ప్రాజెక్టుకు కార్పొరేట్ సంస్థల నుంచి భారీగా ఆర్థిక సహాయం అందుతోంది. అదాని కంపెనీ రూ.100 కోట్ల విరాళం ఇవ్వగా, మేఘా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) కంపెనీ రూ.200 కోట్లతో భవన నిర్మాణాన్ని ప్రారంభించింది. వచ్చే ఏడాది తెలంగాణ అవతరణ దినోత్సవం నాటికి తొలి విడత భవనాన్ని పూర్తిచేస్తామని మేఘా ప్రకటించింది. అంతర్జాతీయ నగరాలకు దీటుగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని ప్రకటించిన ప్రభుత్వం (Telangana Government), ఇందులో అన్ని వనరులు, సౌకర్యాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. నగరంలో అన్ని వర్గాల వారు నివసించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే మలక్‌పేటలో ఉన్న హైదరాబాద్ రేస్ క్లబ్‌ను 150 ఎకరాల్లో ఇక్కడకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనితో పాటు, ప్రపంచ స్థాయి గోల్ఫ్ క్లబ్ నిర్మించడానికి 250 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. ఇక్కడ పనిచేసే ఉన్నతశ్రేణి ఉద్యోగులు, వ్యాపారవేత్తల అభిరుచులకు అనుగుణంగా బిలియనీర్ల క్లబ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. బీసీసీఐ (BCCI) కూడా ఇక్కడ అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు ముందుకు రావడం, నగర ప్రాధాన్యతను పెంచుతోంది.
హెల్త్ సైన్స్, వాణిజ్య కేంద్రాలు
పలు అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలను ప్రారంభించడానికి ఆసక్తి చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ (World Trade Centre) తరహాలో వాణిజ్య కేంద్రాన్ని నిర్మించేందుకు ప్రతినిధులు ముందుకు వచ్చి, 70 ఎకరాలు కేటాయించాలని కోరినట్లు సమాచారం. ఫ్యూచర్ సిటీలో హెల్త్ సైన్స్ పేరుతో 5 వేల ఎకరాల్లో గ్రీన్ ఫార్మాసిటీ (Green Pharma City)ని నిర్మించనున్నారు. ఇప్పటికే భూమి కోసం దాదాపు 300 ఫార్మా కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో రాష్ట్రంలోని ప్రధాన ఫార్మా కంపెనీలకు తొలి విడత భూ కేటాయింపులు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. మొదటగా, ఐదు ఫార్మా కంపెనీలకు 50 ఎకరాల చొప్పున 500 ఎకరాలను మేడిపల్లి గ్రామ పరిధిలో కేటాయించాలని నిర్ణయించారు. ఇక్కడ ఎలాంటి కాలుష్యం లేకుండా, పరిశోధన చేసే సంస్థలకు, బయటి నుంచి ముడిసరుకు తీసుకొచ్చి ఔషధాలు తయారు చేసే సంస్థలకే భూములు ఇవ్వనున్నారు. అంతేకాదు, ఫ్యూచర్ సిటీకి అవసరమైన తాగునీటిని కృష్ణా నది నుంచి తరలించనున్నారు. అలాగే, ఇక్కడ వేల ఎకరాల్లోని పార్కులు, రోడ్లకు ఇరువైపులా ఉండే మొక్కల కోసం మూసీ నీటిని శుద్ధి చేసి వినియోగించాలని నిర్ణయించారు. మూసీ నీటిని తరలించేందుకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు పక్క నుంచే ప్రత్యేక పైపులైన్ ఏర్పాటు చేయడం, పర్యావరణ అనుకూలతకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది.
ఆ కిక్కే వేరు కదా!
చంద్రబాబు దూరదృష్టి, రేవంత్ రెడ్డి కార్యాచరణ కలిస్తే.. రాబోయే తరాలకు తెలంగాణ గడ్డపై మరొక అద్భుతమైన ఫ్యూచర్ సిటీ ఖాయమనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. చంద్రబాబు విజన్, ఆయన శిష్యులను ఇంకెలా తయారు చేస్తారో చెప్పడానికి ఈ ‘ఫ్యూచర్ సిటీ’ ప్రణాళికే గొప్ప ఉదాహరణ అని విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి ఈ ఫ్యూచర్ సిటీ ఆలోచనకు, రూపకల్పనకు బీజం వేసింది గత ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) కావొచ్చు. అయినప్పటికీ, దానికి ఊపిరి పోసి, అమలు చేసి, పూర్తి చేస్తే దక్కే కీర్తి, చరిత్ర మాత్రం రేవంత్ రెడ్డికే సొంతం అవుతుంది. ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయగలిగితే, ఇప్పుడు హైదరాబాద్ విషయంలో చంద్రబాబు పేరు ఎలాగైతే కొన్ని జనరేషన్లకు గుర్తుండిపోయి, మార్మోగుతుందో, రేపొద్దున ఈ ఫ్యూచర్ సిటీ విషయంలో రేవంత్ రెడ్డి పేరు కీర్తి ప్రతిష్టలు కూడా అంతేస్థాయిలో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం. ఆ కిక్కే వేరుగా ఉంటుంది!
ప్రజావాణి చీదిరాల