Politics

Bandi Sanjay: గంగుల ఇక మూట ముల్లె సర్దుకో..

కేంద్ర మంత్రి కాక ముందు.. అయ్యాక బండి సంజయ్‌కి ఎంత తేడా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవకముందు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఎక్కడ ఏం జరిగినా అక్కడ క్షణాల్లో ఆయన వెలిసేవారు. అధికార పార్టీని విమర్శిస్తూ తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకునేవారు.

Bandi Sanjay: గంగుల ఇక మూట ముల్లె సర్దుకో..

కేంద్ర మంత్రి కాక ముందు.. అయ్యాక బండి సంజయ్‌కి ఎంత తేడా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవకముందు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఎక్కడ ఏం జరిగినా అక్కడ క్షణాల్లో ఆయన వెలిసేవారు. అధికార పార్టీని విమర్శిస్తూ తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఎన్నికలొస్తే కానీ పెద్దగా ఆయన వాయిస్ వినిపించడం లేదు. ప్రస్తుతం మునిసిపల్ ఎన్నికలు తెలంగాణలో జరుగనున్నాయి. ఈ క్రమంలోనే బండి సంజయ్ గళం విప్పారు. కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్‌ను వాయించేశారు.

విస్మరించిన కాంగ్రెస్..

మునిసిపల్ ఎన్నికలు అవగానే ఇంటిపన్నుపెంపునకు కాంగ్రెస్ ప్లాన్ చేసిందని బండి సంజయ్ జోస్యం చెప్పారు. ఈ మేరకు ప్రతిపాదనలు సైతం పూర్తైనట్టుగా వెల్లడించారు. 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టో పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీలను సైతం కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని.. అలాంటి కాంగ్రెస్‌కు ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు. అలాగే రెండేళ్లలో మున్సిపాలిటీలతో పాటు కరీంనగర్ కార్పొరేషన్‌కు నయాపైసా కూడా ఇవ్వని కాంగ్రెస్.. ఎన్నికలొచ్చేసరికి ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతోందని బండి సంజయ్ ప్రశ్నించారు.

పొరపాటున బీఆర్ఎస్ గెలిస్తే...

ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే పదేళ్ల పాలనలో అవినీతి, అరాచకాలు, కబ్జాలతో ప్రజలను అరిగోస పెట్టిందన్నారు. అలాంటి బీఆర్ఎస్ నేతలకు ఎందుకు ఓటేయాలని నిలదీశారు. బీఆర్ఎస్ ఒక ప్రాంతీయ పార్టీ.. పైగా తెలంగాణలోనూ అధికారంలో లేదు. అలాంటి బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం నిధులు ఎక్కడి నుంచి తెస్తుందని బండి సంజయ్ ప్రశ్నించారు. పొరపాటున బీఆర్ఎస్ గెలిస్తే... కమీషన్ల కోసం కేంద్ర నిధులను దారి మళ్లిస్తుందని.. కరీంనగర్ అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే జరిగిందని స్పష్టం చేశారు. తాను కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తే.. బీఆర్ఎస్ నేతలు సిగ్గు లేకుండా ఆ క్రెడిట్‌ను కొబ్బరికాయ కొట్టి మరీ తమ ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే మరిన్ని నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానన్నారు.

ఆ ప్రశ్నలకు సమాధానాలుంటాయ్..

ఈ క్రమంలోనే మాజీ మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలను ధీటైన రీతిలో తిప్పికొట్టారు. కరీంనగర్‌కు బండి సంజయ్ నయాపైసా తీసుకువచ్చినట్లు రుజువు చేస్తే ... కరీంనగర్ వదిలి వెళ్లిపోతానన్న గంగుల వ్యాఖ్యలపై ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ కోసం తాను తెచ్చిన నిధుల వివరాలన్నీ బుక్‌లెట్‌లో ఉన్నాయన్నారు. 5 లక్షల కాపీలను ప్రింట్ చేసి ఇంటింటికీ పంపిస్తున్నానన్నారు. ఆ బుక్‌లో తాను ఎన్ని నిధులు తెచ్చానన్న వివరాలతో పాటు ఏయే అభివృద్ధి పనులు చేశానన్న ప్రశ్నలకు సమాధానాలుంటాయని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం గంగుల కమలాకర్ మూట ముల్లె సర్దుకుని కరీంనగర్ వదిలి వెళ్లిపోవాలన్నారు. తాను మొదటి నుంచి కరీంనగర్ ప్రజల కోసం పోరాడానని.. అనేక సార్లు జైలుకు సైతం పోయానన్నారు. కరీంనగర్ ప్రజల దయవల్ల ఎంపీగా గెలిచాక పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చానన్నారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
February 2, 2026 3:45 PM