Gali Janardhan Reddy: ఎట్టెట్టా బతికినోళ్లం వెంకన్నా.. కుక్కలు చింపిన విస్తరిలా ‘గాలి’ జీవితం!
నాడు ఇనుప గనులను ఏలిన రారాజు.. నేడు తన ఇంటిని, వంటిని కాపాడుకోలేక తలలు పట్టుకుంటున్నారు. కాలం ఎంతటి వాడినైనా కిందకు దించుతుందన్న సామెతకు గాలి జీవితమే ఒక సజీవ సాక్ష్యం.
‘ఎట్టెట్టా బతికినోళ్లం వెంకన్న.. ఇట్లెట్ల ఐతిమిరో వెంకన్న..’ ఈ తెలంగాణ జానపదం ఇప్పుడు అచ్చంగా బళ్లారి మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డికి సరిగ్గా సరిపోతుంది. నాడు ఇనుప గనులను ఏలిన రారాజు.. నేడు తన ఇంటిని, వంటిని కాపాడుకోలేక తలలు పట్టుకుంటున్నారు. కాలం ఎంతటి వాడినైనా కిందకు దించుతుందన్న సామెతకు గాలి జీవితమే ఒక సజీవ సాక్ష్యం. ఒకప్పుడు కింగ్ మేకర్‌గా, కర్ణాటక రాజకీయాల దిశను మార్చిన చక్రవర్తిగా వెలిగిన గాలి పరిస్థితి.. ఇప్పుడు కుక్కలు చించిన విస్తరిలా తయారైందని రాజకీయ వర్గాల్లో సెటైర్లు పేలుతున్నాయి.
హెలికాప్టర్ల హవా.. బంగారు వైభవం!
ఒకప్పుడు గాలి జనార్ధన్ రెడ్డి పేరు వింటే ప్రత్యర్థులకు వెన్నులో వణుకు పుట్టేది. ఆయన రేంజ్ ఎలా ఉండేదంటే కనీసం పక్క వీధికి వెళ్లాలన్నా కారు ఎక్కేవారు కాదు, నేరుగా హెలికాప్టర్ రెక్కలు విదిలించాల్సిందే! సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కొడుకుగా ప్రస్థానం మొదలుపెట్టి, చిట్‌ఫండ్ నుంచి మైనింగ్ వరకు ఆయన ఎదిగిన తీరు ఒక అద్భుతం. సుష్మా స్వరాజ్ వంటి హేమాహేమీల ఆశీస్సులతో బీజేపీలో తిరుగులేని శక్తిగా ఎదిగారు. 2008లో యడ్యూరప్పను ముఖ్యమంత్రిని చేయడంలో ‘ఆపరేషన్ కమల’ సక్సెస్ వెనుక ఉన్న అసలైన మాస్టర్ మైండ్ ఆయనే. సంపద విషయంలో గాలి కన్న కలలు ఏ బిజినెస్ మ్యాన్‌కు కూడా రావు. ఆయన ఇంట్లో రూ. 5 కోట్లతో చేయించుకున్న బంగారు సింహాసనం మీద కూర్చుని చక్రవర్తిలా ఉండేవారు. తినే ప్లేట్ నుంచి తాగే గ్లాసు వరకు అన్నీ అచ్చమైన బంగారమే! ఇక 2016లో.. అందులోనూ పెద్ద నోట్ల రద్దు సమయంలో కూతురు బ్రాహ్మణి పెళ్లి కోసం ఆయన పెట్టిన ఖర్చు చూసి దేశమే నివ్వెరపోయింది. దాదాపు రూ. 500 కోట్ల వ్యయంతో జరిగిన ఆ పెళ్లిలో కార్డులోనే ఎల్‌సీడీ స్క్రీన్లు పెట్టడం, రూ. 17 కోట్ల చీర, రూ. 90 కోట్ల నగలు.. ఇవన్నీ చూసి ‘ఈయన మనిషా? లేక కుబేరుడి అవతారమా?’ అని ప్రపంచం ముక్కున వేలేసుకుంది.
అంత బతుకు బతికి.. ఇప్పుడేమో?
అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. 2011లో సీబీఐ ఎంట్రీతో గాలి కోటలు కూలిపోయాయి. మైనింగ్ కేసులో మూడేళ్ల జైలు జీవితం, కిలోల కొద్దీ బంగారం జప్తు ఆయన ఆర్థిక వెన్నుముకను విరిచేశాయి. రాజకీయంగా బీజేపీ దూరం పెట్టినా, మళ్ళీ సొంత పార్టీ ‘కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష’ పెట్టి ఎమ్మెల్యేగా గెలిచి తన పట్టు నిలుపుకునే ప్రయత్నం చేశారు. కానీ, ప్రస్తుత సీన్ చూస్తుంటే ఆయన పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతోంది. మొన్నటికి మొన్న ఆయనపై కాల్పుల ఘటన కలకలం రేపగా.. ఇప్పుడు ఏకంగా కోట్లు విలువ చేసే మోడల్ నివాసాన్ని తగలబెట్టిన పరిస్థితి. ఈ రెండింటి వెనుక స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఉన్నారనే పుకార్లు బళ్లారి గల్లీల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఇక్కడే అసలైన వ్యంగ్యం దాగుంది. ఒకప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తన గుప్పిట్లో పెట్టుకున్న గాలి.. ఇప్పుడు ఒక స్థానిక ఎమ్మెల్యే చేతిలో చుక్కలు చూడటం అంటే ఆయన రేంజ్ ఎంతలా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. మరీ విచిత్రం ఏమిటంటే.. భరత్ రెడ్డి కూడా గాలి సామాజిక వర్గానికే చెందిన నేత కావడం. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది గనుక గాలి ఏం చేసినా చెల్లుతుంది కానీ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని భయపడుతున్నారేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి.
కింగ్.. ఇప్పుడు కాపలాదారుని కంటే హీనం!
ఒకప్పుడు ‘బళ్లారి నా సామ్రాజ్యం.. ఇక్కడ కాకి కూడా నా అనుమతి లేకుండా ఎగరదు’ అని గర్జించిన సింహం.. ఇప్పుడు తన ఇంటికి తల కొరివి పెడుతుంటే అడ్డుకోలేకపోవడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఒకప్పుడు ప్రత్యర్థులు ఆయన పేరు వింటేనే వణికిపోయేవారు.. ఇప్పుడు అదే ప్రత్యర్థులు ఆయన ఇంటికి చిచ్చు పెడుతున్నారు. సినిమా కష్టాల కంటే దారుణంగా ఆయన జీవితం ఇప్పుడు ‘రోలర్ కోస్టర్ రైడ్’ లో పాతాళానికి పడిపోయింది. ఆస్తుల జప్తు, రాజకీయ ఒంటరితనం, ప్రాణాపాయ స్థితి.. ఇవన్నీ చూస్తుంటే ‘అధికారం ఉంటే అరిటాకులో భోజనం.. అధికారం పోతే ఆకులే ఏరుకోవాలి’ అన్న చందంగా ఉంది గాలి పరిస్థితి. గాలి జనార్ధన్ రెడ్డి జీవితం నేటి రాజకీయ నేతలకు ఒక గుణపాఠం. అపారమైన సంపద, అపరిమితమైన అధికారం శాశ్వతం కాదని.. ప్రజల మనసు గెలవకుండా కేవలం ‘బంగారు సింహాసనాల’ మీద కూర్చుంటే చివరికి ‘కొంప’ కూడా మిగలదని ఆయన పరిస్థితి నిరూపిస్తోంది. నాడు కింగ్ మేకర్‌గా చక్రం తిప్పిన గాలి.. నేడు కాలం విసిరిన గాలికి దీపంలా కొట్టుమిట్టాడుతున్నారు. అప్పుడు ఆయనలా బతకాలని కలలు కన్న లీడర్లు.. ఇప్పుడు ఆయన దుస్థితి చూసి ‘బాబోయ్.. మాకు ఈ బతుకు వద్దు’ అని దండం పెడుతున్నారు. మున్ముందు గాలికి ఇంకెన్ని షాకులు తగులుతాయో.. ఆఖరికి ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహకే అందట్లేదు..!
ప్రజావాణి చీదిరాల