BJP: ఏపీలో టీడీపీతో స్నేహం.. ఢిల్లీలో వైసీపీ నేతలకు గౌరవం! బీజేపీ రహస్య అజెండా ఏంటి?
వైసీపీ లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి (Mithun Reddy)కి ఇప్పుడు అరుదైన, అనూహ్యమైన గౌరవం దక్కింది. టీడీపీ (TDP) కూటమి ప్రభుత్వం కేవలం రాజకీయ కుట్రలతో ఆయన్ను ఒక అక్రమ మద్యం కేసులో ఇరికించి జైలు గదిని చూపించిన చేదు అనుభవం ఒకవైపు
వైసీపీ లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి (Mithun Reddy)కి ఇప్పుడు అరుదైన, అనూహ్యమైన గౌరవం దక్కింది. టీడీపీ (TDP) కూటమి ప్రభుత్వం కేవలం రాజకీయ కుట్రలతో ఆయన్ను ఒక అక్రమ మద్యం కేసులో ఇరికించి జైలు గదిని చూపించిన చేదు అనుభవం ఒకవైపు ఉంటే, ఇప్పుడు అదే మిథున్ రెడ్డికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) నేతృత్వంలో ఏ రాజకీయ నాయకుడికి దక్కనటువంటి ప్రపంచ వేదికలో చోటు దక్కడం యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. మిథున్ రెడ్డిని రాజకీయ కక్ష సాధింపులతో బందీ చేసినవాళ్లు.. ఈరోజు అదే వ్యక్తిని అమెరికా (America)లో మోదీతో పాటు నిలబడ్డాడని చూస్తే, నిజం ఏంటో, ఎవరి స్థాయి ఏంటో అర్థమవుతుంది. ఆ అరుదైన ఫోటోనే దీనికి బలమైన సాక్ష్యం. ఎవరిపైనైనా కేసులు పెట్టడం సులభం. కానీ దేశ నాయకుడితో కలిసి అంతర్జాతీయ వేదికపై నిలబడి ఫోటో దిగడం అనేది అరుదైన గౌరవం. ఇది కేవలం రాజకీయ కుట్రలతో కాదు, నమ్మకం, సామర్థ్యం, జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నందునే మిథున్ రెడ్డికి చెందినది.
ఆ కిక్కే వేరు కదా!
ఈ గౌరవంలో భాగంగా, మిథున్ రెడ్డి భారత్ తరఫున ఏకంగా ఐక్యరాజ్యసమితి (United Nations) వేదికపై ప్రసంగించారు. అంతర్జాతీయ లా కమిషన్ (International Law Commission) ఆరవ కమిటీ పని నివేదికపై ఆయన తన అభిప్రాయాలను బలంగా వినిపించారు. పరస్పర సంప్రదింపులు, చర్చల ద్వారానే వివాదాలకు పరిష్కారం దొరుకుతుందని, అదే భారత్ విశ్వసిస్తుందని మిథున్ ప్రపంచ దేశాలకు వెల్లడించారు. అంతేకాకుండా, పైరసీ, సముద్ర ఆయుధ దోపిడీ వంటి అంతర్జాతీయ నేరాలను అరికట్టడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ అధికారుల ఇమ్యునిటీ ముసాయిదాలపై భారత్‌కు ఉన్న అభ్యంతరాలను స్పష్టంగా ఐరాసా వేదికపై వివరించిన మిథున్ రెడ్డి, భారత్ ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశం అని, ఐరాసా విధి విధానాలకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టాలను, ఒప్పందాలను సమగ్రంగా నమోదు చేయాలన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రత్యర్థులు కుట్రలతో జైలు గది చూపించిన ఒక నాయకుడికి.. ఈ రోజు దేశ నాయకుడితో కలిసి ప్రపంచ వేదికపై భారత్ తరఫున గళం వినిపించే అవకాశం దక్కడం అనేది.. రాజకీయ కక్ష సాధింపులు, కుట్రల కంటే నిజాయితీ, గుర్తింపు, జాతీయ స్థాయి నమ్మకం ఎంత గొప్పవో చాటి చెబుతోంది.
వాళ్ల ముఖచిత్రం ఏమిటో..?
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటో (మిథున్ రెడ్డి, మోదీతో కలిసి ఉన్న చిత్రం) వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ‘దొంగ కేసులు పెట్టిన వాళ్ళ ముఖచిత్రం ఏమిటో..’ అంటూ నెట్టింట్లో కామెంట్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. రాజకీయ కక్ష సాధింపులు, అక్రమ కేసులు పెట్టి వేధించిన వారికి, ఈ రోజు మోదీ పక్కన ప్రపంచ వేదికపై నిలబడిన మిథున్ రెడ్డి ఫోటోనే గట్టి సమాధానమని వైసీపీ మద్దతుదారులు బలంగా చెబుతున్నారు. ఎవరికి నచ్చినట్లు వాళ్లు పొగడ్తలు, విమర్శలు చేస్తూ ఈ ఫోటోను ట్రెండింగ్‌లో ఉంచుతున్నారు. నిజాయితీ, నిబద్ధత ఉంటే ఎంతటి రాజకీయ కుట్రల నుంచైనా తిరిగి బలంగా నిలబడవచ్చునని ఈ చిత్రం నిరూపించిందని కొందరు పొగుడుతుంటే, మరికొందరు దీనిపై రాజకీయ విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి ఈ అరుదైన గౌరవం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది.
ఎందుకిలా..?
మిథున్ రెడ్డికి ప్రధాని మోదీతో కలిసి ప్రపంచ వేదికపై దక్కిన అరుదైన గౌరవం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర చర్చకు, గందరగోళానికి దారితీసింది. కూటమి ప్రభుత్వంలో రూ.3,200 కోట్ల ఆరోపణలున్న మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డిని అరెస్టు చేయడం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆయన్ను కీలక కుట్రదారుగా పేర్కొనడం, సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించడం వంటి తీవ్ర పరిణామాలు జరిగాయి. అంతటి తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొన్న ఒక నాయకుడికి, మోదీతో కలిసి ఐక్యరాజ్యసమితి వంటి ప్రపంచ వేదికపై ప్రాధాన్యత దక్కడంపై బీజేపీ పంపాలనుకుంటున్న సందేశం ఏమిటనే ప్రశ్న ఉదయిస్తోంది. ‘ఇది నిజంగా నమ్మశక్యం కానిది. భారతీయ రాజకీయాల్లో మాత్రమే ఇలాంటి విడ్డూరాలు చూస్తాం’ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు బీజేపీ వైఖరిపై తమ ఆశ్చర్యాన్ని, ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ పరిణామం రాష్ట్రంలోని టీడీపీ-బీజేపీ కూటమికి ఇబ్బందికరంగా మారవచ్చు. జాతీయ స్థాయిలో మిథున్ రెడ్డిని పార్లమెంటరీ ప్రోటోకాల్ ప్రకారం గౌరవించినప్పటికీ, రాష్ట్రంలో టీడీపీ నేతలు ఇదే మద్యం కుంభకోణంపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీని ద్వారా బీజేపీ కేంద్ర నాయకత్వం రాజకీయ సమతుల్యత పాటించడానికి ప్రయత్నిస్తోందని, అంటే రాష్ట్రంలో కూటమికి మద్దతు ఇస్తూనే, జాతీయ స్థాయిలో ప్రతిపక్షంతో కూడా సత్సంబంధాలు కొనసాగించాలనే సందేశాన్ని ఇస్తుందని కొందరు భావిస్తున్నారు. ఏదేమైనా, కేసుల సుడిగుండంలో ఉన్న ఒక వ్యక్తికి ఇంతటి అంతర్జాతీయ గౌరవం దక్కడంపై బీజేపీ వైఖరి రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.
ప్రజావాణి చీదిరాల