Politics

Vallabhaneni Vamsi: అరెస్ట్ చేస్తారన్న భయంతో అజ్ఞాతంలోకి వంశీ..

నోరా తేకే వీపునకు చేటు అంటారు పెద్దలు. సామెతలేవీ ఊరికే పుట్టలేదు. అన్నీ ఏదో ఒక సందర్భంలో మనకు నిత్య జీవితంలో ఉపయోగపడుతూనే ఉంటాయి. ప్రస్తుతం గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ విషయంలో ఈ సామెత అక్షరాలా నిజమైంది.

Vallabhaneni Vamsi: అరెస్ట్ చేస్తారన్న భయంతో అజ్ఞాతంలోకి వంశీ..

నోరా తేకే వీపునకు చేటు అంటారు పెద్దలు. సామెతలేవీ ఊరికే పుట్టలేదు. అన్నీ ఏదో ఒక సందర్భంలో మనకు నిత్య జీవితంలో ఉపయోగపడుతూనే ఉంటాయి. ప్రస్తుతం గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ విషయంలో ఈ సామెత అక్షరాలా నిజమైంది. టీడీపీలో ఎదిగి.. అధికారం మారగానే వైసీపీలోకి జంప్ అయ్యారు. అయితే అయ్యారు.. చాలా మంది నేతలు చేసే పని అదే.. కానీ ఓడ దిగిన తర్వాత ఓడ మల్లన్న కాస్తా బోడి మల్లన్న అయినట్టు టీడీపీ కూడా ఆయనకు అలాగే అనిపించింది.

టీడీపీపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు వల్లభనేని వంశీ.. అది చేసినా కూడా ఓకే. కానీ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరిని ఆయన నిండు అసెంబ్లీలో అవమానించారు. అక్కడి నుంచే ఆయన పతనం ప్రారంభమైందనేది టీడీపీ నేతలు అంటున్న మాట. ఆ తరువాత ఇటీవలి కాలంలో ఓ హత్యాయత్నం కేసులోనూ వంశీ ఇరుక్కున్నారు. ఈ నెల 17న విజయవాడలోని మాచవరం స్టేషన్‌లో వల్లభనేని వంశీపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఆ తరువాత ఆయన ఏమయ్యారో తెలియదు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తనను పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లినట్టు సమాచారం.

అసలు కొన్ని రోజులుగా వంశీ అడ్రస్ లేకుండా పోయారు. 2024 జూన్‌ 7న సునీల్‌పై దాడి చేయమని వంశీ తన అనుచరులను రెచ్చగొట్టారట. దీంతో ఆయన అనుచరులు కర్రలు, మారణాయుధాలతో సునీల్‌ను తీవ్రంగా గాయపర్చారట. ఈ కేసులోనే వంశీతో పాటు యతీంద్ర రామకృష్ణ, కొమ్మా కోట్లు, ఓలుపల్లి రంగా, కాట్రు శేషు, ఎం.బాబు, ముల్పూరి ప్రభుకాంత్, అనగాని రవి తదితరులను మాచవరం పోలీసులు నిందితులుగా చేర్చారు. వారం కిందట సమన్లు ఇచ్చేందుకుగానూ వంశీ నివాసానికి పోలీసులు వెళ్లారు.

ఆయన అప్పటికే అందుబాటులో లేకుండా పోయారు ముందస్తు బెయిల్ కోసం వంశీ హైకోర్టును ఆశ్రయించినా కూడా ఫలితం లేకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా వంశీ.. విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణలో ఉన్న సత్యవర్ధన్‌ కేసు వాయిదాకు సోమవారం హాజరుకావాల్సి ఉంది. దీనికి కూడా హాజరుకాలేదు. సునీల్‌ కేసుతో సంబంధం ఉన్న ఆయన అనుచరులంతా కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసులు వంశీ సహా ఆయన అనుచరుల కోసం గాలిస్తున్నారు.

 

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
December 30, 2025 6:17 AM