Politics

YSRCP: వైసీపీ హయాంలో ఇంత పాపానికి ఒడిగట్టారా?

గుడిని.. గుడిలో లింగాన్ని మింగేవారున్నారని వింటూనే ఉన్నాం.. పెద్దలు ఊరికే ఈ మాటను అనరు. ఎంతో అనుభవించి చెబుతారు. అయితే ఈ సామెత కొన్ని సందర్భాల్లో నిజమవుతుంది కూడా.

YSRCP: వైసీపీ హయాంలో ఇంత పాపానికి ఒడిగట్టారా?

గుడిని.. గుడిలో లింగాన్ని మింగేవారున్నారని వింటూనే ఉన్నాం.. పెద్దలు ఊరికే ఈ మాటను అనరు. ఎంతో అనుభవించి చెబుతారు. అయితే ఈ సామెత కొన్ని సందర్భాల్లో నిజమవుతుంది కూడా. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చూస్తే అదే అనిపిస్తోంది. ఏకంగా కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి పరకామణినే కొందరు దోచుకున్నారనేది ప్రధాన అభియోగం. దీనిని వెలుగులోకి తెచ్చేందుకు రంగం సిద్ధమైంది.

తిరుమల (Tirumala)కు వెళ్లామంటే ఎవరిమైనా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాం. ఎక్కడ ఎలా ఉన్నా కూడా తిరుమలలో మాత్రం ఎలాంటి తప్పూ చేయమనేది అక్షర సత్యం. అలాంటి ఏకంగా శ్రీ మలయప్పస్వామి (Sri Malayappa Swamy) పరకామణికే ఎసరు పెట్టారంటే.. వారిది ఎంత పెద్ద గుండె..? ఇదంతా వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది. శ్రీ వేంకటేశ్వర స్వామి (Sri Venkateswara Swamy)వారికి నిత్యం పెద్ద ఎత్తున భక్తులు కానుకలు సమర్పిస్తూ ఉంటారు. అవి డబ్బు రూపంలో కావొచ్చు.. బంగారం, వెండి ఇతర రూపాల్లోనూ అయి ఉండొచ్చు. వైసీపీ (YSRCP) హయాంలో దీనికి సంబంధించి కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని తెలుస్తోంది. దీనికి వెనుక ఉన్న వాళ్లను త్వరలోనే వెలుగులోకి తీసుకు వచ్చేందుకు సీఐడీ (CID) రంగంలోకి దిగింది.

పంచ పాండవులు ఎంతమంది అంటే..

రవికుమార్ అనే వ్యక్తి తిరుమల (Tirumala) పరకామణిలో పని చేసేవాడు. ఇతను ఓ మఠం తరుఫున పరకామణిలో గుమస్తాగా ఉంటూ విదేశీ కరెన్సీ (Foreign currency)ని లెక్కించేవాడు. చాలా ఏళ్లుగా పని చేస్తున్న ఈ వ్యక్తి విదేశీ కరెన్సీని పక్కదారి పట్టించాడని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. వైసీపీ హయాంలో అంటే కచ్చితంగా చెప్పాలంటే.. 2023 ఏప్రిల్‌ 29న విదేశీ కరెన్సీని లెక్కించే క్రమంలో కొన్ని నోట్లను పంచెలో ప్రత్యేకంగా కుట్టించుకున్న అరల్లో దాచుకున్నాడు. రవి కుమార్.. వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన సిబ్బంది అతన్ని తనిఖీ చేయగా అడ్డంగా దొరికిపోయాడు. వెంటనే దీనిపై పోలీసులకు టీటీడీ ఫిర్యాదు చేయగా రవికుమార్‌పై ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది. ఇంతటితో కథ అయిపోలేదు. పంచ పాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ల మాదిరిగా ముగ్గురు అని రెండు వేళ్లు చూపించాడట వెనుకటికొకడు.. ఇది కూడా అలాగే జరిగింది. రవికుమార్ ఆ రోజు 900 డాలర్లు అపహరించగా.. వాటి విలువను నాటి డాలర్ లెక్క ప్రకారం రూ.72 వేలుగా తేల్చారు. ఆ తరువాత దొరికింది 112 నోట్లని చెప్పి రికార్డుల్లో తొమ్మిది నోట్లే చూపించినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఇదీ అసలు కథ.

ఈ పాపంలో పాలు పంచుకున్నదెవరు?

మనం పైన చూసింది ఒక్కరోజు కథే.. ఆ తరువాత ఎంక్వైరీ చేసి రవికుమార్ చాలా కాలంగా పరకామణిలో చేతివాటం చూపిస్తున్నాడని అలా కాజేసిన సొమ్ముతో రూ.కోట్లకు పడగలెత్తాడని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారమంతా వైసీపీలోని పెద్దల దృష్టికి వెళ్లగా ఈ కేసును లోక్‌అదాలత్‌లో రాజీ చేయించారు. ఆ తరువాత రవికుమార్ ఆస్తులను సదరు గద్దలు అదేనండి పెద్దలు కొట్టేశారని టాక్. రవికుమార్‌కు చెందిన కొంతమేర ఆస్తులను ముందుగా చాలా జాగ్రత్తగా టీటీడీకి విరాళంగా రాయించేసినట్టు సమాచారం. ఆ తరువాత అతని మిగిలిన ఆస్తిని ఆ సమయంలో టీటీడీ (TTD)లో పని చేసిన కొందరు ఉన్నతాధికారులు సహా పోలీసులు, రాజకీయ ప్రముఖులు గుట్టు చప్పుడు కాకుండా వాటాలు వేసుకుని మరీ పంచేసుకున్నారట. ఆయా ఆస్తులను వారంతా తమ బినామీల పేరిట రాయించుకున్నారట. మొత్తానికి దేవుడి సొమ్మును ఆయనకు కొంత రాయించేసి.. మిగిలిందంతా తలా పాపం తిలా పిడెకడని పంచేసుకున్నారట. ఇంతకీ ఈ పాపంలో పాలు పంచుకున్నదెవరు? అనేది సీఐడీ విచారణలో తేలే అవకాశం ఉంది.

ప్రజావాణి చీదిరాల

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 21, 2025 9:00 AM