AP Politics: కొడాలి నాని, వంశీ ఎండ్ కార్డ్ వేసినట్టేనా?
2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీ నేతల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో తమ దూకుడుతో సుపరిచితులైన కీలక నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ కొంతకాలం నిశబ్దంగా ఉన్నారు.
2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీ నేతల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో తమ దూకుడుతో సుపరిచితులైన కీలక నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ కొంతకాలం నిశబ్దంగా ఉన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత సహజంగానే కనిపించే ఈ రాజకీయ సైలెంట్ మోడ్ ఇప్పుడు ముగుస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఇద్దరు సీనియర్లు తమ పాత ప్రభావాన్ని, దూకుడును తిరిగి పొందడానికి మెల్లగా ప్రజా క్షేత్రంలోకి అడుగుపెడుతున్నట్లు తాజా పరిణామాలతో అర్థమవుతోంది. ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో తమ పార్టీ తరఫున ప్రత్యర్థులపై అత్యంత ఘాటైన, వ్యక్తిగత విమర్శలు చేసి ఈ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. అయితే, ఎన్నికల ఫలితాలు ఆశించిన విధంగా లేకపోవడంతో, ఆ దూకుడు కొంతవరకు తగ్గింది.
అడుగులు ఎటువైపు?
గత కొన్ని నెలలుగా వీరు మీడియా ప్రకటనలకు, సోషల్ మీడియా వ్యాఖ్యలకు దూరంగా ఉన్నారు. ఈ నిశబ్దం వెనుక ప్రధానంగా ఎన్నికల వైఫల్యంపై సమీక్ష, భవిష్యత్ కార్యాచరణపై అంతర్గత చర్చలు, తమ నియోజకవర్గాల్లోని కార్యకర్తలకు ధైర్యం చెప్పడం వంటి అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి చూస్తే ఇన్నాళ్లు ఉన్న నిశ్శబ్ధానికి నాని, వంశీ ఇద్దరూ ఎండ్ కార్డ్ వేసినట్లే అన్నమాట. అందుకే ఇప్పుడు, నాని, వంశీ తమ సొంత నియోజకవర్గాలైన గుడివాడ, గన్నవరం పరిధిలో తిరిగి పర్యటనలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలలో వీరు ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు, అయితే ఆ విమర్శలు గతంలో మాదిరిగా వ్యక్తిగత దూషణలకు తావు ఇవ్వకుండా, మరింత వ్యూహాత్మకంగా, విధానపరమైన అంశాలపై దృష్టి సారించేలా జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తోంది. ఇది పార్టీలో రాబోయే కాలంలో ఈ ఇద్దరు నేతలు కేవలం దూకుడు నేతలుగానే కాకుండా, వ్యూహకర్తలుగా లేదా కీలక విధాన నిర్ణయాలలో భాగస్వాములుగా తమ పాత్రను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారనడానికి నిదర్శనం.
భవిష్యత్ కార్యాచరణ
ఎన్నికల ఫలితాల తర్వాత వీరిద్దరూ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పలుమార్లు సమావేశమయ్యారు. ఈ సమావేశాలలో కేవలం తమ నియోజకవర్గ భవిష్యత్తుపైనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా పార్టీని తిరిగి బలోపేతం చేయాల్సిన అవసరంపై కూడా చర్చించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొడాలి నాని మళ్లీ త్వరలోనే బహిరంగ వేదికలెక్కి, కొత్త ప్రభుత్వ విధానాలపై గట్టిగా గళమెత్తే అవకాశం ఉంది. ఈ ఇద్దరు నేతల రాజకీయ పునరాగమనం రాష్ట్ర రాజకీయాలకు కొత్త వేడిని తీసుకురావడంతో పాటు, ప్రతిపక్షంలో ఉన్న తమ పార్టీలో కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నాయకత్వానికి భరోసా ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. నాని, వంశీ మెల్లగా కదులుతున్న అడుగులు, రాబోయే రోజుల్లో పెద్ద రాజకీయ ప్రకంపనలకు దారి తీయవచ్చని చెప్పవచ్చు. వారి పాత దూకుడు, కొత్త వ్యూహాల కలయిక ఏ విధంగా పనిచేస్తుందో చూడాలి మరి.
ప్రజావాణి చీదిరాల