ఢిల్లీ ముఖ్యమంత్రిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి.. ఇంతకీ ఎవరా వ్యక్తి?
సీఎం రేఖా గుప్తా చేతిలో పేపర్లను పెట్టీ పెట్టగానే గట్టిగా అరుస్తూ ఆమెపై దాడి చేశాడు. అక్కడే ఉన్న వ్యక్తిగత సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిని..

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Rekha Gupta)పై దాడి జరిగింది. దాడి చేసిన వ్యక్తి ఎవరనేది తెలియలేదు. 35 ఏళ్లున్న వ్యక్తి రేఖా గుప్తా వద్దకు వచ్చి ఆమెకు కొన్ని పేపర్లును అందించినట్టుగా తెలుస్తోంది. ఆమె వాటిని అందుకునే లోపే దాడికి పాల్పడినట్టు సమాచారం. సివిల్ లైన్స్‌లోని అధికారిక నివాసంలో ‘జన్ సున్‌వాయ్ (Jan Sunwai) నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారానికి ఒక రోజు ఢిల్లీ సీఎం (Delhi CM) రేఖా గుప్తా తన అధికారిక నివాసంలో‘జన్ సున్‌వాయ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. తద్వారా ప్రజా సమస్యలను తెలుసుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ యువకుడు కొన్ని పేపర్లను రేఖా గుప్తాకు అందించేందుకు వచ్చాడు.
ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వ్యక్తి సీఎం రేఖా గుప్తా చేతిలో పేపర్లను పెట్టీ పెట్టగానే గట్టిగా అరుస్తూ ఆమెపై దాడి చేశాడు. అక్కడే ఉన్న వ్యక్తిగత సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిని రాజ్‌కోట్‌కు చెందినవాడుగా గుర్తించారు. ఊహించని పరిణామానికి రేఖా గుప్తా షాక్‌కు గురవడంతో ఆమెను వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా.. ముఖ్యమంత్రిపై దాడిని రాజకీయ పక్షాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనలో రాజకీయ కోణం (Political Angle) ఏమైనా ఉందా? ప్రత్యర్థుల కుట్ర అనే విషయమై పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. ఢిల్లీ మంత్రి మంజీందర్ సింగ్ సిస్రా (Manjinder Singh)తో పాటు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఆతిశీ (Athisi) తదితరులు ఈ ఘటనను ఖండిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) సైతం ఈ ఘటనను దురదృష్టకర సంఘటనగా అభివర్ణించింది. సాక్షాత్తు ముఖ్యమంత్రికే రక్షణ లేకుండా సామాన్యుల పరిస్థితేంటని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ (Devender Yadav) ప్రశ్నించారు. ఘటనపై దేవేందర్ ఆందోళన వ్యక్తం చేశారు.