Cyclone Montha: ఏపీని వణికిస్తున్న మొంథా.. 127 రైళ్ల రద్దు.. రంగంలోకి చంద్రబాబు, పవన్
ఏపీని మొంథా తుపాను (Cyclone Montha) వణికిస్తోంది. తీవ్ర వాయుగుండంగా బలహీనపడటంతో దీని ప్రభావం ఆంధ్ర (Andhra), తెలంగాణ (Telangana), ఛత్తీస్‌గడ్ (Chattisgarh)లపై ఉంది. ఆంధ్రాను వర్షాలు ముంచెత్తుతున్నాయి.
ఏపీని మొంథా తుపాను (Cyclone Montha) వణికిస్తోంది. తీవ్ర వాయుగుండంగా బలహీనపడటంతో దీని ప్రభావం ఆంధ్ర (Andhra), తెలంగాణ (Telangana), ఛత్తీస్‌గడ్ (Chattisgarh)లపై ఉంది. ఆంధ్రాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. తుపాను కారణంగా తీరం వెంట 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తుపాను కారణంగా ఏపీ (AP)లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మొంథా తుపాను నరసాపురం వద్ద మంగళవారం రాత్రి 11.30 - 12.30 గంటల మధ్య తీరం దాటింది. దీంతో ఏపీలోని చాలా జిల్లాలు వర్షాలతో అల్లాడుతున్నాయి.
నంద్యాల జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కుందూ నది, మద్దిలేరు చామకాలువ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కుందూ నది (River Kundu) ఉద్ధృతి కారణంగా బోయరేవుల వంతెనపై నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవహిస్తుందటంతో రాకపోకలన్నీ నిలిచిపోయాయి. మరోవైపు నంద్యాలలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరోవైపు ఒడిశాలోని భగలటి నుంచి వరద పోటెత్తింది. దీంతో బాహుదా నది (River Bahuda) ఉగ్రరూపం దాల్చి ఇచ్చాపురాన్ని ముంచెత్తుతోంది.
అరక భద్ర వంతెన వద్ద మెట్టు కూలి గండి పడటంతో జగన్నాథపురంలో ఇళ్లను వరద నీరు చుట్టుముట్టింది. డొంకూరు వద్ద కాజ్ వే పై నీరు చేరి రాకపోకలన్నీ నిలిచిపోయాయి. ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ, నెల్లూరు జిల్లాలో పెన్నా నది, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మొంథా తుపాను కారణంగా దక్షిణ మధ్య రైల్వే (Souch Central Railway) మొత్తంగా 127 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. మరో 14 రైళ్లను దారి మళ్లించింది. ఫలక్‌నుమా, ఈస్ట్‌కోస్ట్, గోదావరి, విశాఖ, నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లు రద్దవగా.. పలు రైళ్లు.. తెలంగాణలో కొన్ని రైళ్లు, ఏపీలో 12 గూడ్స్ రైళ్లు రైల్వేస్టేషన్లలో ఎక్కడికక్కడే రైళ్లు నిలిచిపోయాయి.
తుపాను సహాయక చర్యల్లో భాగంగా సీఎం చంద్రబాబు (CM Chandrababu) సహా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan), మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఇతర మంత్రులు రంగంలోకి దిగారు. హెలికాప్టర్ ద్వారా సీఎం చంద్రబాబు బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో ఏరియల్ వ్యూ చేయనున్నారు. ఇక పవన్ కల్యాణ్ మొంథా ప్రభావంతో విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తక్షణమే తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆయన పలు జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. మొంథా ప్రభావంపై క్షేత్ర స్థాయి నుంచి సమాచారం తెలుసుకుని వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.