Telangana Politics: మున్సిపల్ ఎన్నికల వేదికగా తెలంగాణలో శవ రాజకీయం..
శవ రాజకీయాలనేవి సర్వసాధారణంగా పేరెందుకులే కానీ వేరే రాష్ట్రాల్లో చూస్తూ ఉంటాం. కానీ మున్సిపల్ ఎన్నికల మహిమో.. మరొకటో కానీ తెలంగాణలో ఇప్పుడు చూడాల్సి వస్తోంది. మక్తల్ బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడ్డారు.
శవ రాజకీయాలనేవి సర్వసాధారణంగా పేరెందుకులే కానీ వేరే రాష్ట్రాల్లో చూస్తూ ఉంటాం. కానీ మున్సిపల్ ఎన్నికల మహిమో.. మరొకటో కానీ తెలంగాణలో ఇప్పుడు చూడాల్సి వస్తోంది. మక్తల్ బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన ఆత్మహత్యకు కారణాలైతే తెలిసి రాలేదు కానీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మాత్రం పెద్ద యుద్ధమే జరుగుతోంది. మహదేవప్ప చావుకు మీరు కారణమంటే.. మీరు కారణమంటూ ఇరు పార్టీల నేతలు కొట్టుకున్నంత పని చేస్తున్నారు.
సొంత పార్టీ నేతల ఒత్తిడే కారణం
కాంగ్రెస్ నేతలు వచ్చేసి మహదేవప్ప ఆత్మహత్యకు రాంచందర్ రావు, డీకే అరుణ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అధికార పార్టీ ఒత్తిడి చేస్తే బీజేపీ నేతల దగ్గరికి వెళతారు. కానీ అలా రాకుండా బలవన్మరణానికి పాల్పడ్డారంటే.. సొంత పార్టీ నేతలు ఒత్తిడే కారణమని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాజకీయ పబ్బం గడుపూకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాజకీయం కోసం బీజేపీ నేతలు ఇంతగా దిగజారుతారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రత్యర్థులు సోషల్ మీడియాలో తీవ్రంగా వేధింపులకు పాల్పడటంతోనే మహదేవప్ప మంగళవారం తెల్లవారుజామున ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆయన భార్య ఆరోపిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది.
ఏ శిక్షకైనా సిద్ధం..
ఈ వ్యవహారంపై అధికార, విపక్షాల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరుగుతోంది. ఈ వ్యవహారంలోకి బీజేపీ అగ్రనేతలైన కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామ్‌చందర్‌రావులు దిగడంతో వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలోనే మంత్రి వాకిటి శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. మహదేవప్ప మృతి బాధాకరమని.. అయితే ఆయనను కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు బెదిరించారని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈ విషయంలో వాస్తవాలను వెలికి తీయాలని పోలీసులను ఆదేశించినట్టుగా వెల్లడించారు. నిజం నిప్పులాంటిదని.. దానిని ఎవరూ ఆపలేరన్నారు. అయితే తన వల్లే మహదేవప్ప బలవన్మరణానికి పాల్పడ్డాడని చెప్పడం బాధాకరమని వాకిటి శ్రీహరి అన్నారు. బలవన్మరణానికి పాల్పడిన మహదేవప్పకు తాను ఒక్కసారైనా ఫోన్ చేసినట్టు ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. మొత్తానికి ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతోంది.
ప్రజావాణి చీదిరాల