Rammohan Naidu: రైల్వే మంత్రికి క్లీన్ చిట్.. రామ్మోహన్‌కు అవమానం!
దేశంలో ఇటీవలి కాలంలో విమాన ప్రయాణీకులకు నరకం చూపించిన ఇండిగో విమానయాన సంస్థ సంక్షోభం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కంటే..
దేశంలో ఇటీవలి కాలంలో విమాన ప్రయాణీకులకు నరకం చూపించిన ఇండిగో విమానయాన సంస్థ సంక్షోభం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కంటే, నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగడం అనేక సందేహాలకు తావిస్తోంది. విమానయాన శాఖ అధికారులతో మోదీ నేరుగా సమీక్ష నిర్వహించడం, ఈ సమీక్షకు రామ్మోహన్‌ను పీఎంవో పిలవకపోవడం వంటి పరిణామాలు కేంద్రమంత్రి పనితీరుపై మోదీ అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారానికి బలం చేకూర్చుతున్నాయి. మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు, తెర వెనుక ఏదో ‘తొక్కేయడానికి, బద్నామ్ చెయ్యడానికి’ ఢిల్లీ పెద్దలు వేసిన స్కెచ్‌లా కనిపిస్తుందని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
అసలేం జరుగుతోంది..?
వందల సంఖ్యలో రైలు ప్రమాదాలు జరిగి, అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినా సరే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఒక్క మాట అనని బీజేపీ నాయకత్వం, ఆయనను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్న పరిస్థితిని ఇక్కడ మనమంతా గమనించాల్సి ఉంది. కష్టపడి పనిచేస్తున్న యువ మంత్రి రామ్మోహన్ విషయానికి వచ్చేసరికి మాత్రం, రాజీనామా చేయాలా? అనే స్థాయికి విమర్శలు గుప్పించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రామ్మోహన్ బీజేపీ వాడు కాదనా? లేక పార్టీ మారమనా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. దీని వల్ల టీడీపీకి దేశం మొత్తం మీద పరువు పోయిందని, ఇది కడుక్కోలేని మరక అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎందుకీ అత్యుత్సాహం!
ఈ ఇండిగో సంక్షోభంపై టీడీపీ నాయకులు ప్రదర్శించిన అత్యుత్సాహం జాతీయ స్థాయిలో లోకేశ్, రామ్మోహన్ నాయుడు పరువు తీసింది. టీడీపీ సీనియర్ నాయకుడు దీపక్‌రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శిస్తూ జాతీయ మీడియాలో అభాసుపాలు కావడం గమనార్హం. క్రెడిట్‌ను యువ నాయకుడు నారా లోకేశ్ ఖాతాలో వేసే ప్రయత్నంలో, దీపక్‌రెడ్డి ఓ జాతీయ టీవీ చానెల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ ఇండిగో సర్వీస్‌లపై మానిటరింగ్ చేస్తున్నారని, వార్ రూమ్‌లో ఉన్నారంటూ కామెంట్స్ చేశారు. ఇది జాతీయ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామికి ఆయుధం ఇచ్చినట్లైంది. అది విమానయాన సంస్థనా లేక టీడీపీ మంత్రిత్వ శాఖా? అంటూ దీపక్‌రెడ్డిని అర్నబ్ నిలదీశారు.
అవసరమా ఇదంతా?
ఏపీ మంత్రి లోకేశ్‌కు ఏం సంబంధం ఉందని వార్ రూమ్‌లో వుంటూ మానిటరింగ్ చేస్తున్నారని ప్రశ్నించడంతో దీపక్‌కు ఏం సమాధానం చెప్పాలో దిక్కుతోచలేదు. రామ్మోహన్ కేంద్రమంత్రిగా ఉండగా, పార్టీ పరంగా లోకేశ్ సంక్షోభం నుంచి బయట పడేసేందుకు ప్రయత్నిస్తున్నారనే బిల్డప్‌ను దీపక్ ఇవ్వజూపడం బెడిసికొట్టింది. క్రెడిట్‌ను లోకేశ్ ఖాతాలో వేసే ప్రయత్నంలో, ఆయన్ను జాతీయ మీడియాలో నవ్వులపాలు చేశారనే చర్చ తీవ్రంగా జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే టీడీపీ అధికార ప్రతినిధిపై సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు, వీరాభిమానుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజావాణి చీదిరాల