Politics

Chandrababu Vs Lokesh: తండ్రీకొడుకుల మధ్యే గట్టి పోటీ.. ఇద్దరూ తగ్గట్లే..!

తండ్రీకొడుకుల మధ్యే గట్టి పోటీ నెలకొని ఉన్నట్లనిపిస్తుంది. పెట్టుబడుల విషయంలో ఇద్దరూ తగ్గేదేలే అన్నట్టుగా పట్టువిడవకుండా ముందుకు సాగుతున్నారు. ఈ పోటీలో ఇద్దరిలో ఎవరు నెగ్గినా..

Chandrababu Vs Lokesh: తండ్రీకొడుకుల మధ్యే గట్టి పోటీ.. ఇద్దరూ తగ్గట్లే..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం మంత్రి నారా లోకేశ్ చుట్టూ తిరుగుతున్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇంకా చెప్పాలంటే సీఎం చంద్రబాబు కంటే కూడా ఆయన తనయుడే అత్యంత కీలకమైన కార్యకలాపాల్లో పాల్గొంటూ, క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నారు. ఇది ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అక్షరాలా నిజమే. యువనేత వేస్తున్న ప్రతి అడుగు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించడమే కాకుండా, ఆయన ‘ఇక కాబోయే సీఎం’ అనే ముద్రను బలంగా వేస్తున్నాయి. ఆయన షెడ్యూల్ పరిశీలిస్తే, గల్లీలో పాలన, ఢిల్లీలో లాబీయింగ్, అటు నుంచి డల్లాస్‌ వరకు పెట్టుబడుల వేట.. ఇలా అన్నీ తానై చూసుకుంటున్న తీరు చర్చనీయాంశంగా మారింది.

విమానం ఎక్కడం, దిగడమే!

ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రిగా నారా లోకేశ్ ఎంత బిజీగా ఉన్నారో ఆయన పర్యటనలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల కాలంలో విమానం ఎక్కడం, దిగడం ఆయనకు సర్వసాధారణమైంది. రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో, కేవలం ఒకట్రెండు నెలల వ్యవధిలోనే ఆయన రెండు దఫాలు విదేశీ పర్యటనలు చేపట్టడం గమనార్హం. విశాఖ పారిశ్రామిక సదస్సులో పెట్టుబడులు వెల్లువెత్తాయని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఆ సదస్సు ముగిసిన కొద్ది రోజులకే లోకేశ్ అమెరికా, కెనడా వంటి దేశాల్లో మళ్లీ పర్యటించారు. ఇంత తక్కువ సమయంలో పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడానికి వెళ్లడం వెనుక ఉన్న వ్యూహం, రాష్ట్రానికి మరింత పెట్టుబడిని ఆకర్షించాలనే ఆయన పట్టుదలను సూచిస్తోంది. దీనిపై ‘మా చంద్రబాబు కంటే ఆయ‌న‌ బాబే (కుమారుడు) బిజీ’ అని టీడీపీ నేతలు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

ఢిల్లీ పర్యటనల ప్రాధాన్యం

విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆయన నేరుగా విశాఖ చేరుకున్నారు. కాగ్నిజెంట్‌తో సహా మరికొన్ని కంపెనీల విస్తరణకు సీఎంతో కలిసి శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాజాగా మరోసారి లోకేశ్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకున్నది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా తమ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లతో సహా పలువురు కేంద్ర మంత్రుల్ని ఆయన కలవనున్నారు. రాష్ట్ర సమస్యలపై కేంద్ర మంత్రులకు విన్నవించనున్నారు. ఈ విధంగా, కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించడంలోనూ లోకేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

కాగ్నిజెంట్‌కు డెడ్‌లైన్!

లోకేశ్ పనితీరు, పారిశ్రామిక వేత్తలను ఒప్పించడంలో ఆయన పట్టుదలకు కాగ్నిజెంట్ సంస్థ విశాఖకు రావడం నిదర్శనం. కాగ్నిజెంట్ ప్రెసిడెంట్ సూర్య గుమ్మడి చెప్పిన వివరాలు లోకేశ్ అంకితభావాన్ని స్పష్టం చేస్తాయి. 2025 దావోస్ సదస్సు జరిగే సమయంలో, మైనస్ 15 డిగ్రీల చలిలో, ఉదయం 7 గంటలకు లోకేశ్ వారితో సమావేశమయ్యారు. విశాఖలో కాగ్నిజెంట్ పెట్టాల్సిందేనని పట్టుబట్టి, ఇక్కడే కూర్చుని ఆలోచించుకోమని చెప్పి ఆయనా అక్కడే కూర్చుండిపోయారు. రాజకీయ స్థిరత్వం, విద్యుత్ వంటి అనేక అంశాలపై సంతృప్తికరమైన సమాధానాలు చెప్పి, వారికి కాదనడానికి అవకాశం లేకుండా చేశారు. అంతేకాదు, వచ్చే ఏడాది దావోస్ సదస్సు జరిగేలోగా విశాఖలో ఆపరేషన్స్ మొదలుపెట్టాలని డెడ్‌లైన్ పెట్టేశారు. ఇంత తక్కువ సమయంలో ఎలా సాధ్యం? అని వారు ప్రశ్నిస్తే, ఎలా సాధ్యమో చూపిస్తాను, ముందు మీరు ఏపీకి రండి అని బదులిచ్చి వెళ్లిపోయారు. నిజంగానే కాగ్నిజెంట్ ఏడాది కాదు, 11 నెలల్లోనే 8వేల మందితో కార్యకలాపాలు ప్రారంభించింది. 2026 జనవరిలో మళ్లీ దావోస్ సదస్సు జరిగే నెల రోజుల ముందే కాగ్నిజెంట్ ఆపరేషన్స్ మొదలుపెట్టడం లోకేశ్ పనితీరుకు తిరుగులేని నిదర్శనం.

తండ్రీకొడుకుల మధ్యే పోటీ

చంద్రబాబు కూడా పెట్టుబడుల విషయంలో తన స్థాయిని ఏమాత్రం తగ్గించుకోలేదు. కాగ్నిజెంట్ భూమిపూజ సందర్భంగా సీఈవో రవి కుమార్ మాట్లాడుతూ, 8వేల మందితో కార్యకలాపాలు ప్రారంభించామని, త్వరలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ద్వారా మరో 17వేల మందికి ఉద్యోగాలు (మొత్తం 25,000) ఇస్తామని చెప్పారు. దానికి చంద్రబాబు స్పందిస్తూ, ఏంటి మొత్తం 25వేల మందా? ఏమాత్రం సరిపోదు. కనీసం లక్షకు పెంచండి అంటూ మొహమాటం లేకుండా డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేష్ తీరు చూస్తే పరిశ్రమలు, పెట్టుబడుల విషయంలో తండ్రీకొడుకుల మధ్యే గట్టి పోటీ నెలకొని ఉన్నట్లనిపిస్తుంది. పెట్టుబడుల విషయంలో ఇద్దరూ తగ్గేదేలే అన్నట్టుగా పట్టువిడవకుండా ముందుకు సాగుతున్నారు. ఈ పోటీలో ఇద్దరిలో ఎవరు నెగ్గినా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకే మేలు జరగడం చాలా సంతోషకరం.

కాబోయే సీఎం అనడంలో తప్పేంటి..?

కేవలం 18 నెలల కాలంలోనే గల్లీ నుంచి ఢిల్లీ, అటు నుంచి డల్లాస్ వరకు అహర్నిశలు కష్టపడుతున్న తీరు.. పెట్టుబడుల వేటలో, పారిశ్రామికవేత్తలను ఒప్పించడంలో ఆయన చూపుతున్న అంకితభావం అసాధారణమైనది. మైనస్ 15 డిగ్రీల చలిలో, వేకువజామున 7 గంటలకు కూడా దావోస్‌లో కూర్చుండిపోయి, కాదనడానికి అవకాశం లేకుండా డెడ్‌లైన్లు పెట్టి మరీ పరిశ్రమలను తీసుకురావడం అనేది సాధారణ విషయం కాదు. రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచేందుకు, అన్ని వ్యవహారాలను అన్నీ తానై చక్కబెడుతున్న ఈయనను ‘ఇక కాబోయే ముఖ్యమంత్రి’ అనడంలో ఎటువంటి తప్పు లేదు కదా? ఈ తండ్రీకొడుకుల ఆరోగ్యకరమైన పోటీ రాష్ట్రానికి మరింత మేలు చేకూర్చాలని ఆశిద్దాం.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
December 17, 2025 4:09 AM