CM Chandrababu: ‘అరుంధతి’ మూవీ డైలాగ్‌తో అదరగొట్టిన చంద్రబాబు..
గతంలో ఏమో కానీ ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడే స్టైల్ మారింది. మధ్యమధ్యలో చణుకులు వదులుతూ సరదాగా తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. నవ్వుతూ నవ్విస్తూ..

గతంలో ఏమో కానీ ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడే స్టైల్ మారింది. మధ్యమధ్యలో చణుకులు వదులుతూ సరదాగా తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. నవ్వుతూ నవ్విస్తూ.. సినిమా డైలాగ్‌లు చెబుతూ ప్రసంగిస్తున్నారు. తాజాగా ‘అరుంధతి’ సినిమాలోని డైలాగ్‌ను చెప్పి మరీ అదరగొట్టారు. తనపై ఆరోపణలు గుప్పిస్తున్న ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించిన తీరు ఆసక్తికరం.
వైసీపీ ప్రభుత్వ (YCP Government) హయాంలో జరిగిన 10 ఘటనలను ఇవాళ (శనివారం) ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ప్రజలకు గుర్తు చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ సభలో సీఎం మాట్లాడుతూ.. తొలి ఘటనగా వైఎస్ వివేకా (YS Viveka) హత్యను పేర్కొన్నారు. రాత్రికి రాత్రి వివేకాను హత్య చేసి తెల్లవారేపాటికి గుండెపోటు అన్నారని.. దానిని తాను కూడా నమ్మానని పేర్కొన్నారు. ఆ తరువాత సాక్షి టీవీ (Sakshi TV)లో తన చేతిలోనే కత్తి పెట్టి తనే హత్య చేసినట్టుగా జనాలను నమ్మించే ప్రయత్నం చేశారన్నారు. నమ్మినవారు ఆ పార్టీకే ఓటు వేశారంటూ చెప్పుకొచ్చారు. రెండవది.. విశాఖలో కోడికత్తి డ్రామా. అది కూడా తానే చేయించినట్టుగా మాట్లాడారన్నారు. అదొక మిస్టరీ, డ్రామా అని పేర్కొన్నారు.
15 మందిని చంపేసి..
మూడవది ఎన్నికల సమయంలో గులకరాయి డ్రామా ఆడారని చెప్పారు. దానిపై హాస్పిటల్‌కి వెళ్లి టెస్ట్ చేయించుకుని.. ఈ డ్రామాలో అమాయకుడిని బలి చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం.. కాంట్రాక్టర్, ఇంజినీరుని మార్చి గోదావరి నుంచి దాదాపు 40 లక్షల క్యూసెక్కుల నీరు ఉధృతంగా వస్తున్న సమయంలో పైన కట్టాల్సిన కాపర్ డ్యామ్ కట్టకుండా నిర్లక్ష్యం చేస్తే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. దీనిని కూడా తన నెత్తిపైనే వేశారన్నారు. దానిని రెక్టిఫై చేసి ఇప్పుడు కట్టుకుంటూ వస్తున్నట్టు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇంటింటికీ వెళ్లి వాలంటీర్లు ప్రచారం చేస్తుంటే.. వాళ్లు లేకుండా పింఛన్లు ఇవ్వమని చెప్పినట్టు చంద్రబాబు (Chandrababu) తెలిపారు. అయితే మే నెలలో పింఛన్లు ఇవ్వకుండా ముసలివాళ్లను అటు ఇటు తిప్పి 15 మందిని చంపేసి ఆ నెపం కూడా తనపైనే వేశారన్నారు. ఇప్పుడు వాలంటీర్లు లేకున్నా మూడు గంటల్లో పింఛన్లు ఇస్తున్నామన్నారు.
భూతం లేవదని గ్యారెంటీ ఏంటి?
తానెక్కడికెళ్లినా మీతో బీజేపీ ఉంది.. పవన్ కల్యాణ్ ఉన్నారని అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది అది లేవదని గ్యారెంటీ ఏంటని అడుగుతున్నారన్నారు. అది లేవదని చెప్పినట్టు తెలిపారు. కానీ ఆ భూతం ‘అరుంధతి’ సినిమాలో మాదిరిగా లేచి ‘నిన్ను వదల బొమ్మాళి.. వదలా..’ అని అంటోందని అన్నారు. అమరావతి (Amaravathi) మునిగిపోయిందంటూ ప్రచారం చేశారన్నారు. అమరావతికి నిధులు ఇవ్వొద్దంటూ లేఖలు రాశారన్నారు. అమరావతి మునిగిపోదని.. ప్రపంచంలోనే బ్రహ్మాండమైన నగరంగా మారుస్తానన్నారు. అమరావతినే కాకుండా విశాఖ, తిరుపతి నగరాలను అద్భుతమైన నగరాలుగా తీర్చిదిద్దుతానని చంద్రబాబు స్పష్టం చేశారు. పెట్టుబడులను పెట్టడానికి వస్తే వారిని బెదిరిస్తున్నారన్నారు. అనర్హులకు పింఛన్లు ఇచ్చారని చంద్రబాబు తెలిపారు. ముందు ఒక సోషల్ మీడియాలో పోస్ట్.. ఆ తరువాత సాక్షి, బ్లూ మీడియాలో పని గట్టుకుని విష ప్రచారం చేస్తారని చంద్రబాబు అన్నారు.
ప్రజావాణి చీదిరాల