AP News: వామ్మో ఏపీ.. ఇలాగైతే కష్టమే..
ఏపీలో కుల జాడ్యం బాగా ఎక్కువ. రాజకీయాలు సైతం కులాన్ని అంటిపెట్టుకునే ఉంటాయి. ప్రతి ప్రాంతంలోనూ రెండు, మూడు కులాలదే ఆధిపత్యం. ఆ కులాలే.. పదవుల కోసం పాకులాడుతూ ఉంటాయి. మొత్తంగా చూస్తే కమ్మ, కాపు, రెడ్డిలదే ఆధిపత్యం.
ఏపీలో కుల జాడ్యం బాగా ఎక్కువ. రాజకీయాలు సైతం కులాన్ని అంటిపెట్టుకునే ఉంటాయి. ప్రతి ప్రాంతంలోనూ రెండు, మూడు కులాలదే ఆధిపత్యం. ఆ కులాలే.. పదవుల కోసం పాకులాడుతూ ఉంటాయి. మొత్తంగా చూస్తే కమ్మ, కాపు, రెడ్డిలదే ఆధిపత్యం. అయితే శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే కాస్త డిఫరెంట్. ఇక్కడ మూడు బలమైన సామాజిక వర్గాలున్నాయి. రాజకీయంగా కూడా వారిదే ఆధిపత్యం. వారిలో కాపు సామాజిక వర్గం వచ్చేసి రాజకీయంగా వరి కాస్త ఎక్కువగా బలంగా ఉంది. కొప్పుల వెలమ, కాళింగ సామాజిక వర్గాలు.. కాపులతో పోలిస్తే కాస్త వెనుకబడి ఉన్నాయి. ఈ సామాజిక వర్గాలకు చెందిన నాయకులే అధికార పార్టీల్లో కీలక పదవులు దక్కించుకుంటున్నారు. అయితే అసలిక్కడ బలమైన సామాజిక వర్గంగా కొనసాగుతున్న తూర్పు కాపులకు మాత్రం రాజకీయంగా అన్యాయం జరుగుతోందనే టాక్ ప్రస్తుతం నడుస్తోంది.
ఇన్నాళ్లూ వాళ్లలో వాళ్లే కుమిలిపోతున్న కాపు సామాజిక వర్గ నేతలు ఇప్పుడు రోడ్డెక్కారు. తమకు జరుగుతున్న అన్యాయంపై పెదవి విప్పారు. తమకు న్యాయం చేస్తారా? లేదా? అని ప్రధాన పార్టీలను నిలదీస్తున్నారు. దీనికి కారణం బలంగా ఉన్న తమ సామాజిక వర్గంవైపు ప్రభుత్వాలు చూడకపోవడమే. ఇతర సామాజిక వర్గాలకు పెద్ద పీట వేస్తూ తమ సామాజిక వర్గాన్ని చిన్నచూపు చూడటమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కాళింగ సామాజికవర్గానికి చెందిన తమ్మినేని సీతారాం స్పీకర్‌గా ఉన్నారు. ఇక ప్రస్తుతం వెలమ సామాజిక వర్గానికి చెందిన అచ్చెన్నాయుడు మంత్రిగా ఉండగా.. రామ్మోహన్ నాయుడు ఏకంగా కేంద్రంలో మంత్రి పదవిని దక్కించుకున్నారు. మొత్తంగా రెండు సామాజిక వర్గాలు రాజకీయంగా అధికారాన్ని చెలాయిస్తుండగా.. తూర్పు కాపుల సామాజిక వర్గానికి చెందిన నాయకులు మాత్రం ఏ పదవికీ నోచుకోలేదు. బలమైన సామాజిక వర్గంగా ఉన్నా..తమకు రాజకీయ పదవులు దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తూర్పు కాపులంతా రాజకీయ న్యాయం పేరిట పెద్ద ఎత్తున నిరసనకు దిగుతున్నారు. ఈ నిరసన సెగలు ఒక్క పార్టీకే పరిమితం కాలేదు.. అన్ని పార్టీలకూ వ్యాపించింది. టీడీపీ, జనసేన, వైసీపీ మూడు ప్రధాన పార్టీలూ ఈ నిరసన సెగలకు విలవిల్లాడుతున్నాయి. అసలు ఏపీలో ఎందుకింత కుల పిచ్చి? కులాన్ని బట్టి పదవులేంటి? తెలంగాణలోనూ అంతో ఇంతో కులపిచ్చి ఉంటుంది కానీ ఇలా మా సామాజిక వర్గానికి రాజకీయ ప్రాధాన్యం దక్కడం లేదంటూ నిరసనకు దిగడమనేది దాదాపుగా లేదనే చెప్పాలి. కానీ ఏపీలో అలా కాదు.. రాజకీయాలను కులాలు శాసిస్తూ ఉంటాయి. ఎన్నికల్లో సీట్లను డిమాండ్ చేస్తూ ఉంటారు. రాజకీయ పార్టీలకు సైతం కులాలను కాదని రాజకీయం చేసే పరిస్థితి లేదు. ఇలా రాజకీయాలు, కులాలు ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నాయి. ఇలాగే ఉంటే ఏపీకి ఇబ్బందే. ప్రపంచమంతా మారుతున్నా ఏపీలో కుల పిచ్చి తగ్గకుంటే.. పరిస్థితి మున్ముందు దారుణంగా మారుతుంది.