Buggana Rajendranath Reddy: ఒట్టు.. వైసీపీ గెలిస్తేనే తాడేపల్లికి అంటున్న బుగ్గన..!
ఇటీవల బేవరేజెస్ బాండ్ల మీద అప్పులు తెచ్చింది అంటూ తనదైన శైలిలో బుగ్గన మాస్టారు లెక్కల క్లాస్ మొదలుపెట్టారు. అప్పట్లో వైసీపీ (YCP) అప్పులు తేవాలనుకుంటే అప్పు కిక్కు అని ఆడిపోసుకున్నారని, ఇప్పుడు ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదో? అని బుగ్గన ప్రశ్నించారు.
వైసీపీ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy)కి ‘హైదరాబాద్’ అంటే ఎందుకంత ప్రేమ? ఏపీ రాజకీయాలు (AP Politics), ప్రభుత్వ అప్పులపై విమర్శలు చేయాలంటే, ఆ విమర్శలకు వేయిటేజీ రావాలంటే తాడేపల్లిలోని పార్టీ ఆఫీసు లేదా విజయవాడకు రావాలన్న కనీస ‘లాజిక్’ను ఆయన ఎందుకు పట్టించుకోవడం లేదు? హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన నిర్వహిస్తున్న మీడియా సమావేశాల వెనుక ఏదో రహస్య ఒప్పందం దాగి ఉందన్న సైటైర్లు ఇప్పుడు ఆంధ్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
తాజాగా ఆయన హైదరాబాద్ నుంచి మీడియా ముందుకు వచ్చి, ఏపీ ప్రభుత్వం (AP Government) అప్పులు చేస్తోంది, ఇటీవల బేవరేజెస్ బాండ్ల మీద అప్పులు తెచ్చింది అంటూ తనదైన శైలిలో బుగ్గన మాస్టారు లెక్కల క్లాస్ మొదలుపెట్టారు. అప్పట్లో వైసీపీ (YCP) అప్పులు తేవాలనుకుంటే అప్పు కిక్కు అని ఆడిపోసుకున్నారని, ఇప్పుడు ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదో? అని బుగ్గన ప్రశ్నించారు. అయితే, గతంలో మధ్యనిషేధం చేస్తామని చెప్పింది మీరే కదా మాస్టారూ! అందుకే అందరూ అడిగారు అన్న చిన్న లాజిక్‌ను బుగ్గన గుర్రుపెట్టి మరీ మరిచిపోవడం ఇక్కడ గమనార్హం.
అటు మెటీరియల్.. ఇటు ప్రింట్లు!
పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న శ్యామల లాంటి నేతలు కూడా విమర్శలు చేయాలంటే విజయవాడ వచ్చి, పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం పెడతారు. కానీ, బుగ్గన మాత్రం హైదరాబాద్ నుంచి తాడేపల్లికి రావడం సమయం వృథా అనుకుంటున్నట్టున్నారు. విమర్శలు చేయాలంటే చాదస్తం ఎందుకు? తట్టెడు బురద చల్లడానికి తూర్పు నుంచి రావాలా? అన్నట్టుగా కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఆఫీస్ నుంచి వచ్చే మెటీరియల్‌ను హైదరాబాద్‌లోనే ప్రింట్లు తీసుకుని, అక్కడే పాఠం పూర్తి చేస్తున్నారన్న వ్యంగ్యాలు వినిపిస్తున్నాయి. సీనియర్ నేతగా ఉన్న ఆయన.. అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)ని ఎక్కడ డామినేట్ చేస్తారోనని పెద్దగా మాట్లాడే అవకాశం ఇవ్వరనే పాత అపవాదు ఎలాగూ ఉంది. దానికి తోడు, ఎప్పుడో ఒకసారి ఆర్థిక అంశాలపై మాట్లాడే అవకాశం ఇస్తే, ఆ పని హైదరాబాద్‌లోనే ముగించేస్తున్నారు.
అసలు ట్విస్ట్ అదేనా?
మరి, బుగ్గన (Buggana) తాడేపల్లి వైపు కన్నెత్తి చూడకపోవడానికి కారణం ఏమిటి? ఆయన్ను పార్టీ అధినేత జగనే (Jagan) రావొద్దని ఆదేశించారా? లేక, పార్టీ గెలిచిన తర్వాతే అసెంబ్లీ (AP Assembly)తో పాటు తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో అడుగుపెడతానని ఒట్టు వేశారా? అన్న ఆసక్తికర చర్చ నడుస్తోంది. పట్టు సడలితే పాతాళమే అన్నట్టుగా.. లెక్కల మాస్టారు ఈ తాడేపల్లి ఒట్టు మిస్టరీని వీడితే బాగుంటుంది. అప్పుడే ఆయన విమర్శలకు మరింత వేడి, వాడి వస్తుంది! మరోవైపు వైసీపీలోనే అంతర్గతంగా సైటైర్లు వినిపిస్తున్నాయి. బుగ్గన .. వైసీపీ ఆఫీసుకు రానని ఒట్టేసుకున్నారా? అని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. కుంచంలో ఉంటేనే కదా గంజి అన్నట్టుగా, పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే మాట్లాడితే వచ్చే గౌరవం, వేయిటేజీ హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో దక్కుతుందా? అన్నది ఆయన ఆలోచించుకోవాలి! లేదంటే, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఆయన వ్యయప్రయాసలు పార్టీ ఖాతాలో పడతాయా? అన్నది చూడాలి మరి.
ప్రజావాణి చీదిరాల