BRS-YCP: బాబు ఏపీ.. మరి జగన్ ఏంటి? మీది మైత్రి.. ఎదుటివారిదేంటి?
దుష్ట సాంగత్యం ఎప్పటికీ మంచిది కాదని అంటారు. కానీ దాన్ని పదే పదే రిపీట్ చేస్తే కష్టం కదా. ప్రస్తుతం తెలంగాణలో అదే జరుగుతోందని అనలేం కానీ.. బీఆర్ఎస్ మాత్రం తన గొయ్యి తనే తవ్వుకుంటోందని చెప్పాలి. అసలు ఏం చేయాలో బీఆర్ఎస్ (BRS)కు పాలుపోవట్లేదా?
దుష్ట సాంగత్యం ఎప్పటికీ మంచిది కాదని అంటారు. కానీ దాన్ని పదే పదే రిపీట్ చేస్తే కష్టం కదా. ప్రస్తుతం తెలంగాణలో అదే జరుగుతోందని అనలేం కానీ.. బీఆర్ఎస్ మాత్రం తన గొయ్యి తనే తవ్వుకుంటోందని చెప్పాలి. అసలు ఏం చేయాలో బీఆర్ఎస్ (BRS)కు పాలుపోవట్లేదా? లేదంటే పరిస్థితుల నుంచి గట్టెక్కించేందుకు తరుణోపాయంగా వైసీపీ (YCP)ని ఎంచుకుంటోందా? అర్థం కాని పరిస్థితి.
రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీల్లో బీఆర్ఎస్ (BRS), వైసీపీ (YCP) అధికారంలో ఉన్నప్పుడు వీరిద్దరిదీ ఫెవికాల్ బంధం. కట్ చేస్తే పరిస్థితులు మారాయి. రెండు పార్టీలు తమ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) అధికారాన్ని కోల్పోయాయి. అప్పటి నుంచి మైత్రి లోలోపల ఉందేమో కానీ పైకి మాత్రం కనిపించలేదు. దీనికి కారణం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఫామ్‌హౌస్‌కి పరిమితమైతే.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి (YS Jaganmohan Reddy) బెంగుళూరు ప్యాలెస్‌కి పరిమితమయ్యారు. ఇద్దరూ ఇప్పుడిప్పుడే జనాల్లోకి వస్తున్నారు. దీంతో బంధాన్ని తిరిగి అతికించే పనిలో ఉన్నట్టుగా టాక్.
బీఆర్ఎస్ ర్యాలీలో జగన్ నినాదాలు..
ఇటీవల తాడేపల్లిలోని ఏపీ మాజీ సీఎం జగన్మోహనరెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ సమయంలో జగన్ ఇంటి వద్ద ఆయనతో పాటు కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో కూడిన ప్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ మరో ఆసక్తికర ఘటన జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థుల అభినందన సభకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు నిర్వహించిన వాహన కాన్వాయ్‌లో వైసీపీ జెండాలు కనిపించాయి. పైగా ఆ ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలు జై కేటీఆర్ నినాదాలతో పాటు.. జై జగన్ నినాదాలు సైతం చేశారు. మొత్తానికి వీరివురి మైత్రిని ఇరు పార్టీల కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారనడానికి ఇదే నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
అదొక్కటే ఏపీ పార్టీనా?
ఇప్పటి వరకూ ఈ రెండు పార్టీలు ఇంత బహిరంగంగా ఒకరి కార్యక్రమంలో మరొకరు ఇలా ఫ్లెక్సీలు కట్టుకోవడం కానీ.. ఫ్లెక్సీలతో ర్యాలీలు చేయడం కానీ.. స్లోగన్స్ ఇవ్వడం కానీ చేసింది లేదు. లోపాయికారి ఒప్పందాలు ఏమైనా ఉంటే ఉండొచ్చు కానీ బయటకు మాత్రం పెద్దగా కనిపించనివ్వలేదు. కానీ తాజాగా జరుగుతున్న పరిణామాలను చూసిన జనం విస్తుబోతున్నారు. టీడీపీ అంటేనే ప్రాంతీయ భావాలను రెచ్చగొడుతున్న కేసీఆర్.. మరి వైసీపీ జెండాలను తమ జెండాలతో కలిపేసుకోవడం ఒకింత విడ్డూరమే. వైసీపీని ఏపీ పార్టీగా ఆయన భావించడం లేదా? టీడీపీ (TDP) ఒక్కటే ఏపీకి చెందిన పార్టీగా భావిస్తున్నారా? అనేది అర్థం కాకుండా ఉంది. ఇది మాత్రమే కాదండోయ్.. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరి మంచిని మరొకరు కోరుకుంటున్నారట. ఇరు పార్టీలు తిరిగి అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
జగన్ సపోర్ట్ తీసుకుంటే ఒప్పెలా?
అంతేకాకుండా కొద్దిరోజుల క్రితం జగన్, కేటీఆర్ మధ్య భేటీ కూడా జరిగింది. ఆ సమయంలో ఇరు పార్టీల సోషల్ మీడియాలు ఈ భేటీని హోరెత్తించాయి. పైగా ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ ఫోటోకు స్టిల్ ఇచ్చారు. దానిని కూడా కార్యకర్తలు తెగ వైరల్ చేశారు. మొత్తానికి మళ్లీ ఫెవికాల్ బంధం ప్రారంభమైంది. మరి ఈ మైత్రి ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో.. ఏపీ సీఎం చంద్రబాబు ఏపీకి చెందిన వ్యక్తి అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరు? టీడీపీ ఇక్కడ ఏ పార్టీకైనా సపోర్ట్ ఇస్తే అది తప్పు. మరి జగన్ సపోర్ట్ తీసుకుంటే ఒప్పెలా అవుతుంది? ఇది అధికార పక్షానికి ఛాన్స్ ఇవ్వడం కాదా? ఒకవేళ అధికారపక్షం ఇదే మాటను జనంలోకి గట్టిగా తీసుకెళితే బీఆర్ఎస్ పరిస్థితేంటి? మరింత కష్టాల్లో కూరుకుపోదా? మీరు కోరితే మైత్రి.. మేం కోరితే మరొకటా? అంటే ఏం చెబుతారు? కార్యకర్తలు కోరుకోవడం దేవుడెరుగు.. ఉన్న పంచె ఊడకుంటే చాలన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇక చూడాలి మున్ముందు ఏం జరుగనుందో.
ప్రజావాణి చీదిరాల