Politics

KCR: ఉద్యమంలా ఎగిసిన బీఆర్ఎస్ పతనానికి ఆ ఇద్దరే కారకులా?

ఉద్యమ పార్టీగా పురుడు పోసుకుని, రెండు దశాబ్దాల పాటు తెలంగాణ రాజకీయాలను శాసించిన బీఆర్‌ఎస్ నేడు అధికారానికి దూరమై, అస్తిత్వంపైనే పెను ప్రశ్నలను ఎదుర్కొంటోంది.

KCR: ఉద్యమంలా ఎగిసిన బీఆర్ఎస్ పతనానికి ఆ ఇద్దరే కారకులా?

ఉద్యమ పార్టీగా పురుడు పోసుకుని, రెండు దశాబ్దాల పాటు తెలంగాణ రాజకీయాలను శాసించిన బీఆర్‌ఎస్ నేడు అధికారానికి దూరమై, అస్తిత్వంపైనే పెను ప్రశ్నలను ఎదుర్కొంటోంది. తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రాణం పోసి, దశాబ్ద కాలం పాటు పాలించిన కేసీఆర్‌ నాయకత్వంలోని బీఆర్‌ఎస్, ఇప్పుడు ఎదురవుతున్న సవాళ్లపై అధినేత ఎప్పుడు స్పందిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. నాడు ఉద్యమంలో కేసీఆర్‌కు బలమైన కుటుంబంగా నిలిచిన శక్తి.. నేడు పార్టీకి భారంగా, బలహీనతగా మారిందా అనే చర్చ బలంగా నడుస్తోంది. నాడు తన వాక్చాతుర్యంతో పొరుగు రాష్ట్రాల నాయకులను సైతం కట్టడి చేసిన కేసీఆర్, నేడు సొంత కూతురు కవిత ఎదురుదాడికి తలొగ్గినట్లు కనిపిస్తున్నారా? అలాగే, గతంలో కేసీఆర్‌కు కుడి భుజంగా కలిసి నడిచిన హరీష్ రావు వ్యవహారశైలి నేడు అధిష్టానానికి కంటికి కునుకులేకుండా చేస్తోందా? అనే ప్రశ్నలు బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ను కలవరపెడుతున్నాయి.

పగబట్టిన ప్రత్యర్థుల చేతిలో ఓటమి

గతంలో ప్రత్యర్థి పార్టీలను రాజకీయంగా అణచివేసిన కేసీఆర్ ఇప్పుడు అదే ప్రత్యర్థి కాంగ్రెస్ చేతిలో అణిచివేతకు గురయ్యారా? నాడు తన మాటే శాసనం అంటూ రాజకీయం నడిపిన నేత, నేడు సొంత కుమార్తె చేతిలోనే మాటలు పడుతున్నారా? అనే అంతర్గత చర్చలు పార్టీ భవిష్యత్తుపై అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. ఏ పార్టీ (టీడీపీ) పతనం కోసం కేసీఆర్ ఒకప్పుడు ఆరాటపడ్డారో, ఏ నాయకుడి (రేవంత్ రెడ్డి) ఓటమి కోసం ఆశపడ్డారో ఇప్పుడు ఆ ఇద్దరే బీఆర్‌ఎస్ ఓటమిని నిర్దేశించారా? అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఒకప్పుడు తెలంగాణ రాజకీయాలలోకి టీడీపీని అడుగుపెట్టనివ్వను అంటూ పంతం పట్టిన కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ నేడు రాజకీయాల నుంచి కనుమరుగై, కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌కు పరిమితం చేసింది. ప్రజాక్షేత్రానికి కేసీఆర్ దూరం కావడం పార్టీ బలహీనతకు ముఖ్య కారణంగా మారింది. ప్రస్తుతం బీఆర్‌ఎస్ క్యాడర్‌ను ముందుకు నడవకుండా ఆపుతున్న అతి పెద్ద ప్రశ్న నాయకత్వానికి సంబంధించింది. తిరిగి బీఆర్‌ఎస్ పుంజుకోవాలంటే, రాజకీయంగా ప్రత్యర్థిపై పైచేయి సాధించాలంటే, కేసీఆర్ రాజకీయంగా యాక్టివ్ అవ్వాల్సిందేనా? లేక కేటీఆర్ తన పంధా మార్చుకుని పార్టీలో అందరిని కలుపుకుని ముందుకెళ్లాలా?

హరీష్ కథేంటి?

అంతేకాకుండా, కేటీఆర్‌కు మాజీ మంత్రి హరీష్ రావు ఎంతవరకు అండగా నిలుస్తారు? పార్టీ భవిష్యత్తు కేటీఆర్ చేతిలో ఉందా?, హరీష్ రావు చేతిలో ఉందా? అనే చర్చ క్యాడర్‌లో తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. మరోవైపు, కవిత అంశం బీఆర్‌ఎస్‌కు బరువా, బలహీనతా లేక పార్టీకి ప్రత్యర్థా? అన్న ప్రశ్నలు కూడా సమాధానం దొరకని అంశాలుగా మిగిలిపోయాయి. పార్టీ ఎదుర్కొంటున్న ఈ అంతర్గత ప్రశ్నలు, నాయకత్వ సందిగ్ధతపై కేసీఆర్ పూర్తి స్పష్టత ఇస్తేనే బీఆర్‌ఎస్ తిరిగి పుంజుకునే అవకాశం ఉంటుంది. లేదంటే, ఒకప్పటి ఉద్యమ కెరటం రాజకీయాల్లో కనుమరుగైపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చివరికి ఏం జరుగుతుందో చూడాలి మరి.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
December 8, 2025 5:30 AM