Politics

AP Politics: ఏపీ రాజకీయం 2.0.. వైసీపీ, టీడీపీలో భూకంపం!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరుగుతున్నాయి. రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలలో ఒకప్పుడు కీలక స్థానంలో ఉన్న ఇద్దరు ఫైర్‌బ్రాండ్లు..

AP Politics: ఏపీ రాజకీయం 2.0.. వైసీపీ, టీడీపీలో భూకంపం!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరుగుతున్నాయి. రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలలో ఒకప్పుడు కీలక స్థానంలో ఉన్న ఇద్దరు ఫైర్‌బ్రాండ్లు.. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏవీబీ) ఇప్పుడు తమ సొంత అస్తిత్వం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరి క్రియాశీలక కదలికలు ప్రస్తుత రాజకీయ సమీకరణాలను చెదరగొట్టడమే కాకుండా, రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేయనున్నాయనే బలమైన సంకేతాలు వెలువడుతున్నాయి.

రెడ్డి ఓటు చీలికకు సాయి స్కెచ్!

వైసీపీలో నంబర్ 2గా ఒక వెలుగు వెలిగిన సాయిరెడ్డి, అధికారం కోల్పోయాక పార్టీకి దూరమై, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించారు కూడా. వ్యవసాయం చేసుకుంటానని చెప్పినప్పటికీ, ఆరేడు నెలల్లోనే మళ్లీ క్రియాశీలకం కావాలని భావిస్తున్నారు. ఈ నిర్ణయం వెనుక లోతైన రాజకీయ వ్యూహం దాగి ఉంది. రాష్ట్ర సమస్యలపై గళం విప్పేందుకు డిసెంబర్ చివరికల్లా ఒక ఫోరమ్ ఏర్పాటు చేయాలని ఆయన ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా సీనియర్ నేతలు, వివిధ రంగాల ప్రముఖులతో అల్పాహారం/భోజన సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ శూన్యతను ఈ ఫోరం భర్తీ చేస్తుందని చెబుతున్న సాయిరెడ్డి, తదనంతరం ఈ ఫోరం కాస్త కొత్త రాజకీయ పార్టీకి శ్రీకారం చుట్టే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా, సాయిరెడ్డి ప్రధాన లక్ష్యం రెడ్డి వర్గాన్ని ఆకర్షించడం, వైఎస్ రాజశేఖర రెడ్డి సిద్ధాంతాలను తిరిగి తీసుకురావడం, అధికార కూటమి, వైసీపీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్న పార్టీ వర్గానికి కొత్త గొంతుకగా మారడమే ఈ ఫోరం ఏర్పాటు వెనుక అసలు ఉద్దేశమని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అంతేకాక, బీజేపీ మద్దతున్న ఒక బీసీ పార్టీ అధినేతతో కలిసి అడుగులు వేయాలని నిర్ణయించుకోవడం ఈ వ్యూహంలో కీలక భాగం. అంటే, రెడ్డి-బీసీ వర్గాలను ఏకం చేసి, వైసీపీ సంప్రదాయ ఓటు బ్యాంకును చీల్చేందుకే సాయిరెడ్డి ఈ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారని స్పష్టమవుతోంది.

ఏబీవీ పంథా.. టీడీపీకి దెబ్బ!

మరోవైపు, కృష్ణా జిల్లా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఏవీబీ కూడా సొంత రాజకీయ అస్తిత్వం కోసం గట్టిగానే పావులు కదుపుతున్నారు. ఒకప్పుడు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిన ఏవీబీ, ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు కానీ, ఇటీవల ఆ పార్టీపై కూడా వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నారు. కొత్త పార్టీ ఆవిష్కరణపై దృష్టి సారించిన ఏవీబీ, మేధావులు, నిపుణులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులతో చర్చలు జరుపుతున్నారు. టీడీపీపై అసంతృప్తితో ఉన్న కమ్మ సామాజిక వర్గం నుంచి మద్దతు పొందడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు పెట్టిన తర్వాత ఎంవీ భాస్కర్ రావు, నాదెండ్ల భాస్కరరావు, జయప్రకాష్ నారాయణ, చిరంజీవి వంటివారు ఎక్కువ కాలం సొంత పార్టీని నడపలేక మూసివేయడం/విలీనం చేయడం జరిగింది. ఐతే డబ్బు, అంగబలం ఉన్న టీడీపీ, వైసీపీ వంటి పార్టీలను ఏబీవీ తన కొత్త పార్టీతో ఎదుర్కోగలరా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఐతే ఇప్పటివరకు ఏబీవీకి దన్నుగా నిలిచిన కమ్మ సామాజికవర్గం, టీడీపీ సానుభూతిపరులు కొత్త పార్టీకి మద్దతిస్తే అది టీడీపీ ఆశించే సంప్రదాయ ఓటు బ్యాంకుపై తీవ్ర ప్రభావం చూపి, కూటమికి నష్టం కలిగించే అవకాశం ఉంది.

రెండు తుఫాన్లు వస్తున్నాయా?

సాయిరెడ్డి ఫోరం/పార్టీ ప్రయత్నం వైసీపీ నుంచి రెడ్డి వర్గంలోని ముఖ్యమైన ఓటు బ్యాంకు చీలిపోయే ప్రమాదాన్ని సృష్టిస్తుందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇది వైసీపీకి తీవ్ర నష్టాన్ని కలిగించవచ్చు. అదే సమయంలో, ఏవీబీ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే, అది టీడీపీ ఆశించే సంప్రదాయ ఓటు బ్యాంకును ప్రభావితం చేయనుంది. ఈ ఇద్దరి దిగ్గజాల కదలికలు కేవలం వ్యక్తిగత అస్తిత్వం కోసమేనా?, లేక రాష్ట్ర రాజకీయాల దిశను మార్చడానికి ఉద్దేశించిన వ్యూహాత్మక అడుగులా? అనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. ఏదేమైనా, ఒకే సమయంలో రెండు ప్రధాన పార్టీల నుంచి ఇంతటి కీలకమైన నాయకులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, కొత్త వేదికల వైపు అడుగులు వేయడం మాత్రం... రాబోయే రాజకీయ యుద్ధంలో పెద్ద మలుపు తప్పదనే బలమైన సంకేతాలను ఇస్తోంది.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
December 10, 2025 7:46 AM