రాహుల్ ‘ఓటర్ అధికార్ యాత్ర’లో ఆసక్తికర ఘటన.. నెట్టింట ఇదే చర్చ..
ఓటర్ అధికార్ యాత్రలో భాగంగా రాహుల్ ఇవాళ (శుక్రవారం) ఉదయం జమాల్‌పూర్‌లోని మసీదుకు వెళ్లారు. దీనిలో వింతేముంది? అనిపించవచ్చు. కానీ ఇదే మసీదుకు అప్పట్లో..

ఈ ఏడాది అక్టోబర్ లేదంటే నవంబర్ నెలలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు (Bihar Assembly Elections) జరగనున్నాయి. ఈ ఎన్నికలను ఎన్డీఏ (NDA) కూటమితో పాటు ఇండియా (INDIA) కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఓట్లు కోల్పోకూడదని ఇండియా కూటమి స్ట్రాంగ్‌గా డిసైడ్ అయిపోయింది. దీనికోసం సర్వేలు నిర్వహించి మరీ కాంగ్రెస్ పార్టీ (Congress Party) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) రంగంలోకి దిగారు. ఓట్ల గల్లంతు ఎలా జరిగిందో సాక్షాలతో సహా బయటపెట్టి ఈసీ (EC)ని సైతం బోనెక్కించినంత పని చేశారు. ఈ క్రమంలోనే రాహుల్ బీహార్‌లో 'ఓటర్ అధికార యాత్ర'లో నిర్వహిస్తున్నారు ఈ యాత్రలో రాహుల్ గాంధీకి బీహార్‌లో పెద్ద ఎత్తున ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. రాహుల్‌కు అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
ఇవన్నీ సర్వసాధారణమే కానీ..
ఇదిలా ఉండగా.. బిహార్‌లో ‘ఓటర్ అధికార్ యాత్ర’లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓటర్ అధికార్ యాత్రలో భాగంగా రాహుల్ ఇవాళ (శుక్రవారం) ఉదయం జమాల్‌పూర్‌లోని మసీదుకు వెళ్లారు. దీనిలో వింతేముంది? అనిపించవచ్చు. కానీ ఇదే మసీదుకు అప్పట్లో రాహుల్ తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) సైతం వెళ్లారు. ఇప్పుడు రాహుల్, అప్పటి రాజీవ్ ఫోటోలను పోల్చుతూ సోషల్ మీడియా (Social Media)లో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. రాహుల్ గాంధీ.. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (Tejaswi Yadav)తో కలిసి ఖాన్కా రెహమానీ మసీదును సందర్శించి అక్కడ ఉన్న మసీదు పెద్ద మౌలాను సైతం కలిశారు. ఇవన్నీ సర్వసాధారణమే కానీ 1985లో మాజీ ప్రధాని, రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ ఈ మసీదును సందర్శించినప్పుడు ఎక్కడైతే కూర్చున్నారో ఇప్పుడు రాహుల్ అక్కడే కూర్చొని మౌలానాతో ముచ్చటించడం అనేది యాదృచ్చికంగా జరిగినా కూడా ఆసక్తికరంగా మారింది. దీంతో ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. రెండు పోటోలను జత చేసి మరీ నెట్టింట ఆసక్తికర చర్చను నెటిజన్లు నిర్వహిస్తున్నారు.
ఆధార్‌ను సైతం ఓటర్లు చేర్చాల్సిందే..
మరోవైపు రాహుల్ తన ఓట్ల గల్లంతుకు సంబంధించిన పోరాటంలో విజయం దిశగా సాగుతున్నారు. ఒక్క బిహార్‌లోనే 65 లక్షల ఓట్లు తొలగించారని.. అధికార పార్టీకి తొత్తుగా కేంద్ర ఎన్నికల సంఘం పని చేస్తోందంటూ రాహుల్ ఆరోపించారు. ఈ అంశంపై తాజాగా విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు (Supreme Court).. బిహార్‌లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సమయంలో ఆధార్ (Adhar)ను సైతం ఓటర్లు సమర్పించే 11 పత్రాల్లో చేర్చాలని ఈసీకి తెలిపింది. ఇక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో తొలగించబడిన ఓటర్ల పేర్లను సరిదిద్దే అంశాన్ని సైతం సుప్రీంకోర్టు ప్రస్తావించింది. దీనికి రాజకీయ పార్టీలు ముందుకు రాకపోవడంపై ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వాస్తవానికి స్థానికుల గురించి అవగాహన బూత్-లెవల్ ఏజెంట్లకు ఉంటుందని అభిప్రాయపడింది. సెప్టెంబర్‌లో తుది ఓటర్ జాబితా విడుదల అనంతరం ఎన్నికల సంఘం బిహార్ ఎన్నికల నోటిఫికేషన్ (Election Notification)ను విడుదల చేయనుంది.
ప్రజావాణి చీదిరాల