Ambati Rambabu: టైం మనది కానప్పుడు తగ్గి ఉండాలి.. రెచ్చిపోతే వీపునకు చేటే..!
నోరా తేకే వీపునకు చేటు అని అంటారు. అంటే నోరు అదుపులో పెట్టుకోకుంటే.. ఆ దెబ్బ వీపునకు తగులుతుంది. నాలుక ఉంది కదాని ఇష్టమొచ్చినట్టు ఆడిస్తే ఎదురయ్య పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
నోరా తేకే వీపునకు చేటు అని అంటారు. అంటే నోరు అదుపులో పెట్టుకోకుంటే.. ఆ దెబ్బ వీపునకు తగులుతుంది. నాలుక ఉంది కదాని ఇష్టమొచ్చినట్టు ఆడిస్తే ఎదురయ్య పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. దీనికి ఏపీలో వైసీపీ నేత సంబరాల రాంబాబు.. అదే మన అంబటి రాంబాబే నిదర్శనం. ఎగతాళిగా మాట్లాడటం.. ఇష్టానుసారంగా అవాస్తవాలకు రంగులు జోడించి కలర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేయడంలో అంబటి దిట్ట. ఇప్పుడవే ఆయనకు తలనొప్పిగా పరిణమించాయి. వైసీపీ హయాంలో చాలా మంది నేతలు, నాయకురాళ్లు నోటికి పనిజెప్పారు. అవతలి పార్టీ వారిని ఇష్టానుసారంగా దూషించారు. పర్సనల్ అబ్యూజ్‌కు కూడా వెనుకాడలేదు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయిన తర్వాత కొందరు నేతల నోళ్లకు తాళాలు పడ్డాయి.
కానీ రోజా, అంబటి రాంబాబు వంటి నేతలు మాత్రం అడపా, దడపా మాటలు పేలుతూనే ఉన్నారు. ఇక అంబటి వ్యాఖ్యలైతే శృతిమించాయి. టీడీపీ నేతలపై వ్యక్తిగత దూషణలు చేయడం ప్రారంభించారు. దీంతో టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. చివరకు తమ పార్టీ అధినేతను తీవ్ర పదజాలంతో దూషించడాన్ని సహించలేకపోయారు. అంబటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. వైసీపీ మద్దతుదారులు అంబటి ఏదో ఘనకార్యం చేసినట్టుగా ఆయన వ్యాఖ్యలను వైరల్ చేశారు. దీంతో టీడీపీకి చెందిన మహిళలు, దివ్యాంగులు సహా టీడీపీ శ్రేణులు అంబటి నివాసానికి భారీగా రావడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. గతంలోనూ అనేక సార్లు ఆయన వైఖరి వివాదాస్పదమైంది.
అంబటి రాంబాబుపై రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కేసులు నమోదయ్యాయి. అంబటిని శనివారం రాత్రి 10.45 గంటల సమయంలో పోలీసులు అరెస్టు చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని అంటారు. అంబటి రాంబాబు నోటికి పనిజెప్పకుండా ఉండి ఉంటే ఆయన్నెవరూ పెద్దగా పట్టించుకునేవారే కాదు. కానీ టీడీపీ అంటేనే ద్వేషం పెంచుకున్న అంబటి సమయం, సందర్భం లేకుండా రెచ్చిపోవడం ఆయనకే ఇబ్బందికరంగా మారింది. టైం మనది కానప్పుడు తగ్గి ఉండటంలో తప్పేమీ లేదు. ఆయన తోటి నేతలు చేస్తున్నది కూడా అదే. అంబటికే ఎందుకో అది అర్థం కాలేదు. గుడ్డెద్దు చేలో పడ్డ చందంగా ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ప్రతీ నేతకూ అంబటి ఒక గుణపాఠం కావాలి. అది అధికారపక్షమైనా.. ప్రతిపక్షమైనా..
ప్రజావాణి చీదిరాల