Akhanda2: ఆగిపోతే పండుగ చేసుకుంటున్న జనసేన, వైసీపీ!
నందమూరి బాలకృష్ణ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘అఖండ 2’ విడుదల ఆగిపోవడం వెనుక అసలు కథ వేరే ఉంది. ఈ వార్త విని బాలయ్య వ్యతిరేక రాజకీయ శిబిరాలు, ముఖ్యంగా వైసీపీ, జనసేన శ్రేణులు సంక్రాంతి ముందే వచ్చినట్టుగా సంబరాలు చేసుకుంటున్నాయి.
నందమూరి బాలకృష్ణ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘అఖండ 2’ విడుదల ఆగిపోవడం వెనుక అసలు కథ వేరే ఉంది. ఈ వార్త విని బాలయ్య వ్యతిరేక రాజకీయ శిబిరాలు, ముఖ్యంగా వైసీపీ, జనసేన శ్రేణులు సంక్రాంతి ముందే వచ్చినట్టుగా సంబరాలు చేసుకుంటున్నాయి. సినీ పండుగ వాయిదా పడితే, రాజకీయ పండుగ ఊపందుకుంది. ‘పగలేస్తే పండి, పాపమేస్తే పండి’ అన్నట్టుగా.. గతంలో బాలయ్య చేసిన ఘాటైన రాజకీయ విమర్శలకు, ఇప్పుడు ఈ సినిమా వాయిదా రూపంలో ‘కర్మ సిద్ధాంతం’ పనిచేసిందని హేళన చేస్తున్నారు.
రాజకీయ అగ్నికి ఆజ్యం!
గతంలో అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ‘సైకో’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ వైసీపీ శ్రేణుల గుండెల్లో ఆరేసిన కొర్రాయిలా బాధ పెడుతున్నాయి. అందుకే, దైవం శిక్ష ఆలస్యమైనా తప్పదు అంటూ సోషల్ మీడియాలో అఖండ2 తాండవం పేరుతో రచ్చ చేస్తున్నారు. అబ్యూస్ చేసినంత ఈజీ కాదురా.. సినిమా టికెట్లు తెంపడం అంటూ పరోక్షంగా బాలయ్య రాజకీయ వ్యాఖ్యలను సినిమా వాయిదాతో ముడిపెట్టి ఆనందిస్తున్నారు. ఇటు పవన్ కల్యాణ్, మెగా బ్రదర్స్‌ను బాలయ్య ఒకప్పుడు ‘మా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు’, ‘అలగా జాతి నాకొడుకులు’ అంటూ పరుష పదజాలంతో దూషించిన చరిత్ర జనసేన శ్రేణులకు గుర్తుంది. అందుకే, పైకి పవన్ కళ్యాణ్‌తో స్నేహంగా ఉన్నా, లోపల ఉన్న కత్తి ఇప్పుడు బయటపడిందని, మింగ మెతుకు లేదు.. మీసాలకి సంపంగి నూనె అన్న చందంగా సినిమా వాయిదాపై చురకలంటిస్తున్నారు.
నందమూరి ‘లెగసీ’ వర్సెస్ పవర్ అబ్యూస్
అయితే, ఈ విమర్శల తుపాను మధ్య నందమూరి అభిమానులు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారు నందమూరి కుటుంబానికి ఉన్న లెగసీని హైలైట్ చేస్తూ.. 1983 నుంచి నేటి వరకు ఎంత పవర్ ఉన్నా, ఒక రోజైనా సిస్టంను తమ వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకున్న చరిత్ర లేదని గర్వంగా చెబుతున్నారు. పవర్ ఉంది కానీ దుర్వినియోగం లేదు అన్న నినాదంతో, తమ కుటుంబం మాఫియా నడపలేదని, బెదిరింపులు, ఒత్తిడులు లేని శుద్ధమైన నీతి రాజకీయాలు నడిపిందని కీర్తిస్తున్నారు. ఇదే సమయంలో, కొందరు ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు విసురుతూ, ఒక సినిమా రిలీజ్ కోసం పవర్ ఎలా వాడుకున్నారో అందరం చూశాం.. మినిస్టర్ల దగ్గర నిలబడి స్టేజ్ పనులు చేయించుకున్నారు. కానీ, నందమూరి కుటుంబం ఆ స్థాయి పవర్ ఉన్నా నీచ ఆలోచన రాలేదు అంటూ పరోక్షంగా గతంలో జరిగిన కొన్ని సంఘటనలను ప్రస్తావిస్తున్నారు. పవర్ అంటే ప్రజల కోసమే తప్ప, తమ సినిమా కోసం కాదు అని నందమూరి ఫ్యాన్స్ బల్లగుద్ది చెబుతున్నారు.
అసలు కారణం ఇదే..
అఖండ 2 వాయిదాకు కారణం రాజకీయాలు, అభిమాన పోరాటాలు ఎంతమాత్రం కాదని, తెర వెనుక ఉన్న పాత బాకీల గొడవే అని సమాచారం. నిర్మాతలకు ఈరోస్ ఇంటర్నేషనల్‌కు మధ్య ఉన్న కోర్టు వివాదం ఒక పెద్ద అడ్డంకిగా మారింది. కేవలం ఇది మాత్రమే కాదు, సినిమాకు పెట్టుబడి పెట్టిన ఫైనాన్షియర్స్ నుంచి చివరి నిమిషం వరకు క్లియరెన్స్ లభించకపోవడం వాయిదాకు ప్రధాన కారణం. అప్పు చేసి పప్పు కూడు అన్నట్టుగా, ఆర్థిక లావాదేవీలు కొలిక్కి రాకపోవడం వల్లే గ్రీన్ సిగ్నల్ దొరకలేదు. ఇష్యూ ముందే తెలిసి ఉంటే, ముఖ్యమంత్రి ఒక్క ఫోన్ చేస్తే అయిపోయే విషయం అని బాలయ్య అభిమానులు భావిస్తుండగా, ఆఫ్ట్రాల్ సినిమా కోసం రూ. 60 కోట్లకు సీఎం కాల్ చేయాలా? అదేదో అరటి రైతులకి తక్షణ సహాయం కేటాయించి ఆత్మహత్యలు ఆపవచ్చుగా అని వైసీపీ శ్రేణులు కోరుకోవడం ఇక్కడ గమనించదగిన వ్యంగ్యం.
మొత్తానికి, అఖండ 2 వాయిదా కేవలం సినీ పరిశ్రమకు సంబంధించిన వార్తగా కాకుండా, తెలుగు రాజకీయాల్లో ఉన్న పాత పగలు, కొత్త సవాళ్లకు నిదర్శనంగా నిలిచింది. ఈ సినిమా ఎప్పుడొచ్చినా బాక్సాఫీస్‌ను దుమ్ము లేపుతుందని నందమూరి ఫ్యాన్స్ ధీమాగా ఉన్నా, ప్రస్తుతం మాత్రం తాంబూలం ఇచ్చినంత ఈజీ కాదు.. తాళి కట్టడం అన్నట్టుగా, బాలయ్య సినిమాలకు రాజకీయంగా కూడా సవాళ్లు ఎదురవుతున్నాయి.
ప్రజావాణి చీదిరాల