TVK Vijay: తమిళనాడులో ఘోర విషాదం.. ఎవరి తప్పిదమిది?
కొన్ని సంఘటనలు ఆలోచింపజేయాలి. మనకో గొప్ప పాఠాన్ని నేర్పాలి. కానీ ఇవి రెండూ జరగవు. మనకు ఇష్టమైన నటుడు కనిపిస్తే అంతే.. మైమరచిపోతాం. దాని పర్యావసానాలు పట్టవు.

కొన్ని సంఘటనలు ఆలోచింపజేయాలి. మనకో గొప్ప పాఠాన్ని నేర్పాలి. కానీ ఇవి రెండూ జరగవు. మనకు ఇష్టమైన నటుడు కనిపిస్తే అంతే.. మైమరచిపోతాం. దాని పర్యావసానాలు పట్టవు. ఫలానా రోజే భగవంతుడిని దర్శించుకోవాలంటే అంతే విచక్షణ మరచిపోతాం. భగవంతుడి దర్శనానికైనా.. ఇష్టమైన నటుడి దగ్గరి నుంచి చూడాలన్నా మనం ఉండాలి కదా. పైగా కొందరి తొందరపాటుకు అమాయకులు కూడా బలైపోతుంటారు. ప్రస్తుతం తమిళనాడులో జరిగిందిదే..
తమిళనాడు (Tamilnadu)లోని కరూర్‌లో సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ (TVK President Vijay) సభ నిర్వహించారు. అది పెను విషాదానికి దారి తీసింది. విజయ్‌ను దగ్గర నుంచి చూడాలన్న అత్యుత్యాహం.. 8 మంది చిన్నారులు సహా 39 మందిని పొట్టనబెట్టుకుంది. ఎవరి తప్పిదమిది? సభ నిర్వహించిన వారిదా? లేదంటే అత్యుత్సాహం చూపించిన వారిదా? ఒక వ్యక్తి రాజకీయాల్లో (Politics)కి వచ్చాడు అంటే జనంలోకి రావాల్సిందే. ఇవాళ కాకపోతే రేపు వస్తాడు. దానికోసం తోసుకుంటూ వెళ్లాల్సిన అవసరం లేదుగా.. పైగా విజయ్ సింప్లిసిటీ (Vijay Simplicity)కి చాలా దగ్గరగా ఉంటాడు. ఆయన్ను కలవాలంటే ఎలాగైనా కలవొచ్చు. కొందరిని తొక్కుకుంటూ వెళ్లాల్సిన అవసరమే లేదు. తమిళనాడు వాసులకు అభిమానం చాలా ఎక్కువ. పైగా సినీ నటులపై అంతులేని ప్రేమను కురిపిస్తారు. ఇబ్బందేం లేదు కానీ అభిమానం వెర్రితలలు వేస్తేనే ఇబ్బంది. అది వారి ప్రాణాలను బలిగొనవచ్చు.. పక్కనున్నవారి ప్రాణాలను సైతం బలిగొనవచ్చు.
చేయి దాటిన పరిస్థితి..
వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు (Tamilnadu Assembly Elections) జరుగనున్నాయి. వీటికోసం అక్కడి నేతలంతా సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే టీవీకే (TVK Party) సైతం రాష్ట్ర వ్యాప్త ప్రచార యాత్రను ప్రారంభించింది. ప్రతి శనివారం రెండేసి జిల్లాలో ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం నామక్కల్‌లో ప్రచారం నిర్వహించిన మీదట ఆయన సాయంత్రానికి కరూర్ చేసుకున్నారు. రాత్రి 7.30 గంటలకు వేలుసామిపురంలో విజయ్ ప్రసంగిస్తుండగా (Vijay Meeting).. కొందరు ఆయనకు సమీపానికి వచ్చేందుకు యత్నించే క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామంతో అంతా ఖంగుతిన్నారు. పరిస్థితిని అర్థం చేసుకుని విజయ్ తన ప్రసంగాన్ని నిలిపివేసి వారించేందుకు యత్నించాడు. కానీ పరిస్థితి అప్పటికే చేయి దాటిపోయింది. వృద్ధులు, చిన్నారులు, మహిళలు తొక్కిసలాటలో కిందపడిపోయారు. కనీసం వారిని హాస్పిటల్‌కు తరలించాలన్నా జన సందోహం నడుమ సాధ్యం కాలేదు. అంబులెన్స్ (Ambulance)లు లోపలికి వెళ్లే పరిస్థితి కూడా లేదు. చేతులపై మోసుకుంటూ బయటకు అయితే తీసుకెళ్లారు కానీ అప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇంకా కొన్ని ప్రాణాలు కొన ఊపిరితో కొట్టుకుంటున్నాయి.
బాధను మాటల్లో వర్ణించలేను..
ఈ ఘటనపై విజయ్ సైతం ట్విటర్ వేదికగా స్పందించారు. ఈ ఘటనతో తన హృదయం ముక్కలైందని.. భరించలేని బాధను అనుభవిస్తున్నట్టు తెలిపారు. తన బాధను మాటల్లో వర్ణించలేనని.. కరూర్‌లో ప్రాణాలు కోల్పోయిన తన ప్రియమైన సోదరులు, సోదరీమణుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు విజయ్ పేర్కొన్నారు. ఈ తప్పిదమంతా ఎవరిది? చనిపోయిన వారి కుటుంబాలకు ఎంతో కొంత ఎక్స్‌గ్రేషియా అయితే అందవచ్చేమో కానీ ఆ కుటుంబ సభ్యుల బాధను తీర్చేదెవరు? చివరకు అభం శుభం తెలియని పసివాళ్లు కూడా మరణించారు కదా. కొందరు చేసిన ఈ పని వల్ల వారి అభిమాన నేతకే కదా ఇబ్బంది. ఆమాత్రం ఇంగితం లేకుంటే ఎలా? ఇక్కడే కాదు.. కొంతకాలం క్రితం తిరుమల (Tirumala)లోనూ ఇలాంటి పరిస్థితే చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు గానూ టోకెన్స్ కోసం జరిగిన తొక్కిసలాలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతి విషయంలోనూ ఇదే అత్యుత్సాహం.
ప్రజావాణి చీదిరాల