Telangana News: పురపాలక సమరంలో కీలక ఘట్టం.. కళ్లు తెరవకుంటే ఖతమే..
తెలంగాణలో పురపాలక ఎన్నికలకు తరుణం ఆసన్నమైంది. ఈ క్రమంలోనే ఇవాళ మరో కీలక ఘట్టం పూర్తి కానుంది. ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియకు ఇవాళ్టితో చెక్ పెట్టనున్నారు.
తెలంగాణలో పురపాలక ఎన్నికలకు తరుణం ఆసన్నమైంది. ఈ క్రమంలోనే ఇవాళ మరో కీలక ఘట్టం పూర్తి కానుంది. ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియకు ఇవాళ్టితో చెక్ పెట్టనున్నారు. దీనికి సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియను ఇప్పటికే పురపాలక శాఖ పూర్తి చేసింది. నేడు ప్రకటనుంది. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం, బీసీలకు డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల మేరకు రిజర్వేషన్లను ఖరారు చేయడం జరిగింది.
ఇక రిజర్వేషన్లను ప్రకటించారంటే అభ్యర్థుల ఎంపిక.. నామినేషన్స్.. ఆపై ఎలక్షన్ ప్రచారం.. ఎన్నిక శరవేగంగా జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకైతే అంతగా సన్నద్ధమవ్వాల్సిన అవసరమైతే లేదు. ఎందుకంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి తెలంగాణలో ఏ ఎన్నికలొచ్చినా ఆ పార్టీదే పైచేయి. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ హవానే ఎక్కువగా ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యమే. కానీ ప్రతిపక్ష పార్టీలు గట్టి పోటీ ఇవ్వకుంటే మాత్రం ఆ పార్టీల పరిస్థితి మరింత దిగజారుతుంది.
కేసీఆర్ బయటకు రాకుంటే ఎలా?
మధ్యలో కేసీఆర్ వచ్చారు.. ఇవాళ్టి వరకూ ఒక లెక్క.. రేపటి నుంచి మరో లెక్క అంటూ హడావుడి చేశారు.. ఖతమ్ తిరిగి బ్యాక్ టు ఫామ్‌హౌస్. ఇలా ఎప్పుడో ఒకసారి వచ్చి ఏవో డైలాగ్స్ వదిలేసి వెళ్లి కలుగులో కూర్చుంటే అవుతుందా? అవతల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నానా తంటాలు పడినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండట్లే. ఈ సమయంలో కేసీఆర్ బయటకు రాకుంటే ఎలా? కొద్ది రోజుల క్రితం ఆయన బయటకు వస్తే ఇంకేముంది? బీఆర్ఎస్ గతిని మార్చబోతున్నారంటూ నానా హడావుడి జరిగింది. ఏదో కార్యకర్తల్లో కాస్త ఊపు వస్తోందనగానే తనకు సంబంధం లేదన్నట్టుగా ఉంటే.. ఇక ఆ తరువాత ఏం చేసినా ప్రయోజనం ఉండదు. కేసీఆర్ బయటకు వచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. ఒకసారి నమ్మకాన్ని పోగొట్టుకున్నాక తిరిగి పొందడమనేది చాలా కష్టం. గులాబీ బాస్ కళ్లు తెరవాల్సిన సమయం ఆసన్నమైంది. లేదంటే పార్టీ పని ఖతమే.
రాష్ట్రంలో రెండవ స్థానానికి..
ఇదిలా ఉండగా.. బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రంగంలోకి దిగినా కూడా తెలంగాణలో బీజేపీ పరిస్థితి దారుణంగా ఉంది. నానా ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఆ పార్టీ ప్రజా బలాన్ని కూడగట్టుకోలేకపోతోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చాలా విషయాలను స్పష్టం చేసింది. ఇది మాత్రమే కాదు.. అంతకు ముందు కంటోన్మెంట్ సైతం కాంగ్రెస్‌ను ఎదుర్కొనే సత్తా ప్రస్తుతం ఏ పార్టీకి లేదని తేల్చాయి. గతంలో బీజేపీ రాష్ట్రంలో రెండవ స్థానానికి ఎదిగింది. అలాంటి పార్టీ ప్రస్తుతం ఇంతటి దుర్భల స్థితిని ఎదుర్కొంటుందని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీల పరిస్థితి ఒకేలా ఉంది. మున్ముందు కూడా పరిస్థితులు ఇలాగే ఉంటే ఆ పార్టీల మనుగడకే కష్టంగా మారిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ప్రజావాణి చీదిరాల