Politics

‘మాబ్‌స్టర్’, ‘ఫ్రాడ్‌స్టర్’.. అసలు జగన్‌కు ఏమైంది?

ముఖ్యమంత్రిగా ఉన్నావు.. నీ జీవితానికి బహుశా ఇవి ఆఖరి ఎలక్షన్స్ కావొచ్చు.. రామా.. కృష్ణా అనుకునే వయసులో కనీసం ఆ మాటలు అనుకున్నా పుణ్యమైనా వస్తుంది.

‘మాబ్‌స్టర్’, ‘ఫ్రాడ్‌స్టర్’.. అసలు జగన్‌కు ఏమైంది?

‘ముఖ్యమంత్రిగా ఉన్నావు.. నీ జీవితానికి బహుశా ఇవి ఆఖరి ఎలక్షన్స్ కావొచ్చు.. రామా.. కృష్ణా అనుకునే వయసులో కనీసం ఆ మాటలు అనుకున్నా పుణ్యమైనా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ఇప్పటికైనా కొంత మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా..’ ఇవి ఎవరో అన్న మాటలు కాదు.. సాక్షాత్తు ఒక పార్టీ అధినేత అన్న మాటలు.. ఒక పార్టీ ఏముందిలే సాక్షాత్తు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న మాటలివి.

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి తాజాగా జగన్ (YS Jagan) మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తమ పార్టీ ఏజెంట్లను పోలింగ్ బూతుల్లోకి వెళ్లనివ్వలేదని వాపోయారు. అక్కడి వరకూ బాగానే ఉంది. ఒకవేళ నిజంగా వైసీపీ పోలింగ్ ఏజెంట్స్‌ను పోలింగ్ బూతుల్లోకి వెళ్లనివ్వకుంటే ఆయన ఆవేదన కూడా సమంజసమే..  తన వైపు నిజం ఉంటే న్యాయబద్దంగా వెళ్లాలి.. అంతేకానీ ఈ రకమైన వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ (TDP) కేడర్ మండిపడుతోంది. వాస్తవానికి జగనే కాదు.. వ్యక్తిగత వ్యాఖ్యలు ఎవరు చేసినా తప్పే. విధానపరమైన విమర్శలు ఎన్నైనా చేసుకోవచ్చు.. కానీ ఇంత దారుణమైన వ్యక్తిగత విమర్శలు మాత్రం సీఎం చంద్రబాబు చేసినా తప్పే అవుతుంది. ‘ప్రజాస్వామ్యం కదాని ఏది పడితే అది మాట్లాడటం ఒక స్థాయిలో ఉన్న వ్యక్తికి అస్సలు సరికాదు. ఒక పార్టీకి అధినేత అయ్యుండి ఇలాంటి వ్యాఖ్యలా?’ అని జనం కూడా ఆశ్చర్యపోతున్నారు. గతంలో ఆయన పార్టీ నేతలు ఇలా ఇష్టానుసారంగా నోరు పారేసుకునేవారు.. జగన్ కూడా అప్పుడప్పుడు వ్యక్తిగత విమర్శలు చేసేవారు.. కానీ ఈసారి గీత దాటేశారు. అప్పట్లో అడ్డగోలుగా మాట్లాడిన నేతలంతా కామ్ అయిపోయారు. వారి బదులు కూడా ప్రస్తుతం జగనే మాట్లాడుతున్నారని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు.

హాట్‌ లైన్‌లో టచ్‌లో ఉన్నారా?

పైగా ‘మాబ్‌స్టర్’.. ‘ఫ్రాడ్‌స్టర్’ అనే వ్యాఖ్యలేంటి? ఎంతైనా చంద్రబాబు (CM Chandrababu) ఒక సీఎం కదా.. ఇది మాత్రమే కాదండోయ్.. ‘రాహుల్ గాంధీ (Rahul Gandhi) అనే వ్యక్తి ఆంధ్రా గురించి ఎందుకు మాట్లాడటం లేదంటే.. చంద్రబాబునాయుడు (AP CM Chandrababu Naidu)తో హాట్‌ లైన్‌లో టచ్‌లో ఉన్నాడు కాబట్టి మాట్లాడటం లేదు. ఆంధ్రా ఇన్‌చార్జి.. మాణిక్యం ఠాకూర్ (Manikyam Tagore).. వాడు ఏ పొద్దైనా చంద్రబాబు గురించి మాట్లాడినాడా?’ అంటూ జగన్ మాటలు జారారు. అసలు బీజేపీతో పొత్తులో ఉన్న పార్టీ అధినేత.. రాహుల్‌తో ఎందుకు హాట్‌లైన్‌లో టచ్‌లో ఉంటారు? పోనీ ఉంటే ప్రధాని మోదీ చూస్తూ ఊరుకుంటారా? మాణిక్యం ఠాకూర్ గురించి వాడు.. వీడు అంటూ కామెంట్స్ ఏంటి? అసలు ఈ భాషను సొంత పార్టీ కేడర్ అయినా హర్షిస్తుందా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy), రాహుల్, చంద్రబాబు కలిసి ఉన్నారట. చంద్రబాబు శిష్యుడు రేవంత్ కాబట్టి.. వారిద్దరి మధ్య గురుశిష్యుల అనుబంధం ఉంది కాబట్టి కలిసినప్పుడు ఆప్యాయంగా మాట్లాడుకోవచ్చు.. అవసరమొస్తే రెండు తెలుగు రాష్ట్రాలు ఒకదానికొకటి సహకరించుకోవచ్చు. వీటిని కారణాలుగా చూపి ఆరోపణలు, అభ్యంతర కామెంట్స్ చేయడం ఒక పార్టీ అధ్యక్షుడికి ఎంతవరకూ సమంజసం?

ఇవి ఆఖరి ఎలక్షన్స్ కావొచ్చా?

అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ యంత్రాంగాన్ని జగన్ వాడినట్టుగా మరెవరూ వాడలేదని ఏపీ ప్రజానీకం చెబుతోంది. అప్పట్లో టీడీపీ, జనసేన నేతలు ఎంతలా మొత్తుకున్నారో ఎవరికీ తెలియనిది కాదు.. అప్పట్లో జగన్ మోపిన జే ట్యాక్స్‌ల గురించి.. సొంత లిక్కర్ బ్రాండ్ల గురించి ఏపీ ప్రజానీకం ఇప్పటికీ చర్చించుకుంటూనే ఉన్నారు. మరి ఇంతటి ఘన చరిత్ర కలిగిన పార్టీ అధ్యక్షుడు మా పార్టీ అధినేతను విమర్శించడమేంటని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. నీ జీవితానికి బహుశా ఇవి ఆఖరి ఎలక్షన్స్ కావొచ్చా? మరీ ఇంత దారుణమైన వ్యాఖ్యలా? కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోయేసరికి జగన్‌లో అసహనం ఇలా మాట్లాడిస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అసలు ఒక పార్టీ అధినేతగా హూందాతనమేదని ప్రశ్నిస్తున్నారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
August 13, 2025 4:06 PM