YS Jaganmohan Reddy: అధికారం ఉన్నప్పుడేనా కార్యకర్తలు.. జగన్‌పై ఫైర్
అధికారంలో ఉండగా ఒక్కరూ కుదురుగా ఉన్నది లేదు. రెచ్చిపోయి మరీ నోటికి, చేతులకు పని చెప్పారు. ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందోనని భయపడిపోతున్నారు.

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (Andhrapradesh Assembly Elections) వైఎస్సార్‌సీపీ (YSRCP) ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రశాంతత కరువైంది! ఎన్నికల ఫలితాలు వెలువడి నెలలు గడుస్తున్నా, అధికార టీడీపీ-జనసేన-బీజేపీ (TDP-Janasena-BJP) కూటమి నుంచి తమపై వేధింపులు, కేసుల్లో ఎక్కడ ఇరుక్కోవలిసి వస్తుందోనని వైసీపీ (YCP) శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అధికారంలో ఉండగా ఒక్కరూ కుదురుగా ఉన్నది లేదు. రెచ్చిపోయి మరీ నోటికి, చేతులకు పని చెప్పారు. ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందోనని భయపడిపోతున్నారు. ‘అన్నా ఎక్కడ కేసుల్లో ఇరుక్కోవల్సి వస్తుందో.. ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. మమ్మల్ని మీరే కాపాడాలి’ అని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM Jaganmohan Reddy)కి ముఖ్య కార్యకర్తలు, ద్వితియ శ్రేణి నేతలు మొరపెట్టుకుంటున్నారట. ఈ నేపథ్యంలో ‘ప్రాణాలు కాపాడుకోండి.. అధికారంలోకి వచ్చాక అన్నీ చూసుకుంటా’ అంటూ అధినేత అభయం ఇస్తున్నారట. ఇప్పుడీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీస్తున్నది.
అది అయ్యే పనేనా?
పార్టీ అధికారంలో ఉండగా అడ్డగోలుగా నేతలు మాట్లాడుతుంటే ఎంజాయ్ చేసిన జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు పార్టీ నేతలను, కార్యకర్తలను కాచుకోవల్సిన అవసరం ఉంది కదాని ఏపీ ప్రజానీకం అంటున్న మాట. ఇప్పటికైనా.. అంటే తమ పార్టీ నేతలు, కార్యకర్తలు మొరపెట్టుకున్న తర్వాత అయినా కూడా ఆయనేమైనా చేస్తున్నారా? అంటే అధికారంలోకి వచ్చాక చూసుకుంటారట. వచ్చేదెన్నడు? చూసుకునేదెన్నడు? అది అయ్యే పనేనా? ఒకవైపు కూటమి నేతలు పట్టుసడలకుండా పట్టుకుని కూర్చొన్నారు. మరోవైపు జనాల్లో నానాటికీ కూటమి ప్రభుత్వం పట్ల ఆదరణ పెరుగుతోంది. ప్రజలు కోరుకున్న రాజధాని సిద్ధమవుతోంది. సంక్షేమ పథకాలూ ఎలాంటి లోటూ లేకుండా గత ప్రభుత్వం అమలు చేసిన దానికి మించి చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) అందజేస్తోంది. తరలిపోయిన కంపెనీలన్నీ తిరిగి ఏపీకి వచ్చేస్తున్నాయి. అక్కడి యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఇంకేం కావాలి.. ప్రజలకు? ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టకుండా ఎలా ఉంటారు? పైగా ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) అయినా.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan).. ఇతర మంత్రులు జనాలతోనే ఉంటున్నారు.. జనంలోనే ఉంటున్నారు.
ఆయనే రాష్ట్రం వదిలేస్తే..
అలాంటప్పుడు.. అధికారంలోకి వస్తామని అప్పుడు చూసుకుంటానని జగన్ తన పార్టీ కార్యకర్తలు, నేతలకు చెప్పడం ఎంతవరకూ కరెక్ట్? ఇంకా వారిని మభ్య పెడుతున్నట్టే కదా? వాస్తవానికి అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు.. అధికారంలో ఉన్నాం కదాని రెచ్చిపోతే ఇబ్బంది పడేది చివరికి వారే.. కానీ అప్పటి ప్రభుత్వం తమ స్వార్థం కోసం నేతలు, కార్యకర్తలను రెచ్చగొట్టిందనేది టీడీపీ నేతలు (TDP Leaders) అంటున్న మాట. అది తెలుసుకోకుండా రెచ్చిపోయారు. ఇప్పుడు తమను ఎక్కడ కేసులో వెంటాడుతాయోనని భయపడి కొందరు నేతలైతే ఏకంగా రాష్ట్రాన్ని వదిలేశారు. అనారోగ్యం పేరిట పక్క రాష్ట్రంలో తలదాచుకుంటున్నారు. ఇక కార్యకర్తలు ఆందోళన చెందుడంలో వింతేముంది? కానీ కాచుకోవాల్సిన బాధ్యత అధినేతదే కదా.. ఆయనే రాష్ట్రం వదిలి బెంగుళూరుకు కుటుంబంతో తరలివెళితే కార్యకర్తల పరిస్థితేంటి? పైగా అది చాలదన్నట్టుగా అధికారంలోకి వస్తాం.. అప్పుడు చూసుకుంటానని చెప్పడమేంటని కార్యకర్తలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు అధికారంలోకి వచ్చాక చూసుకునేదేముంది? అప్పుడు వారికి ఇబ్బంది ఏముంది? కష్టంలో ఉన్నప్పుడు కదా చూసుకోవాల్సింది? అదే నిజమైన నేత లక్షణం కదా అని సొంత పార్టీ నేతలే అనుకుంటున్నట్టు సమాచారం.
పోనీ జగన్ వచ్చి ఆదుకుంటారా?
గతంలో కేసులు పెట్టి ఇష్టానుసారంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు.. ఆ మాటకొస్తే అధినేత చంద్రబాబునే జైలు పాలు చేసిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. మరి అలాంటప్పుడు ఇప్పుడు వైసీపీ నేతలు, కార్యకర్తలు భయపడటంలో తప్పేముంది? అంతేకాకుండా అధికారంలో ఉన్నాం కదాని సోషల్ మీడియా వేదికగా అప్పట్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇష్టానుసారంగా పోస్టులు పెట్టారు. వ్యక్తిగత దూషణలకు సైతం వెనుకాడలేదు. ఇప్పుడు అవన్నీ మెడకు చుట్టుకుని ఊపిరి ఆడదోనని వారంతా ఆందోళనకు గురవుతున్నారు. పోనీ జగన్ వచ్చి ఆదుకుంటారా? అంటే ఆయన కూడా ఒక గెస్ట్‌లా రాష్ట్రానికి వచ్చి వెళుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమకు అండగా నిలిచిన నాయకులు ఇప్పుడు అందుబాటులో ఉండటం లేదని, కష్టకాలంలో అండగా నిలబడేవారు కరువయ్యారని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకరకంగా అధినేత జగన్ అయితే చేతులెత్తేసిన పరిస్థితి.
కార్యకర్తలు, నేతలు గుర్తొస్తారా?
‘అధికారంలో ఉన్నప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా పార్టీ నాయకులు వెంటనే స్పందించేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కనీసం ఫోన్ చేసినా స్పందన కరువవుతోంది’ అని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు వాపోతున్న పరిస్థితి. ఇది వైసీపీ శ్రేణుల్లో ఒక విధమైన నిరాశ, నిస్పృహకు దారితీసింది. అంటే అధికారం ఉన్నప్పుడే కార్యకర్తలు, నేతలు గుర్తొస్తారా? అని ముఖ్యనేతలు, ఆ మాటకొస్తే అధినేతపై కన్నెర్రజేస్తున్న పరిస్థితి. జగన్ మాత్రం యాప్ తీసుకొస్తున్నాం.. డైరీ రాయండి.. చూస్కుందాం.. తేల్చుకుందాం అని రెండ్రోజులకోసారి మీడియా మీట్‌లలో హెచ్చరికలకే పరిమితం అవుతున్న పరిస్థితి. ఇది చాలదన్నట్టుగా.. ‘అధికారం మళ్లీ మనదే. వచ్చాక అన్నీ చూసుకుంటా’ అనే మాటలు.. ఇప్పుడు ఇబ్బంది అంటే అధికారంలోకి వచ్చాక చూసుకునేదేముంటుంది? ఇక ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఈ సంక్షోభాన్ని ఎలా అధిగమిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో, ఈ పరిణామాలు రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయనేది వేచి చూడాలి.
ప్రజావాణి చీదిరాల