అప్పుడు జోడో.. ఇప్పుడు ఓటర్.. తగ్గేదేలే..
సెప్టెంబర్ రాహుల్‌కు బాగా కలిసొచ్చినట్టుంది. ఆ నెలతో పాదయాత్రను ప్రారంభించడమో.. ముగించడమో చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా పారదర్శక ఓటర్ల జాబితా లక్ష్యంగా..

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఏమాత్రం తగ్గేలా లేరు. సెప్టెంబర్ సెంటిమెంటుతో దూసుకెళుతున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన ఏ విషయాన్నీ ఉపేక్షించేలా లేరు. అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమీ పార్టీలు ఈసారి చావో రేవో తేల్చుకునేలా ఉన్నాయి. ఈ క్రమంలోనే రాహుల్ ఓ న్యాయ పోరాటానికి శ్రీకారం చుట్టారు. ఇక తాజాగా ఆయన తలపెట్టిన యుద్ధమే.. పాదయాత్ర.
ఇప్పటికే తన పాదయాత్రకు రాహుల్ (Rahul Gandhi) రూట్ మ్యాప్‌ను సైతం సిద్ధం చేసుకున్నారు. 16 రోజులు.. 25 జిల్లాలు.. 1300 కి.మీ.. రూట్ మ్యాప్‌తో పాదయాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కు వ్యతిరేకంగా ఆయన ఈ పాదయాత్రను నిర్వహించనున్నారు. పాదయాత్రలో భాగంగా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించనున్నారు. రాహులే కాదు.. ఎవరు పాదయాత్ర చేసినా కూడా దాని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుందనేది మనం ఎన్నో ఉదాహరణలు చూశాం. అంతెందుకు గతేడాది సెప్టెంబర్‌లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర (Bharath Jodo Yatra)ను నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆయనతో యువకులు సైతం నడకలో పోటీ పడలేకపోయారు. కన్యాకుమారి (Kanyakumari) నుంచి కశ్మీర్ (Kashmir) వరకూ ఆయన పాదయాత్ర సాగింది. 3500 కి.మీ నడిచి అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోవడంలో సఫలీకృతులయ్యారు. మరోసారి రాహుల్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అయితే ఈసారి ఒక్క రాష్ట్రంలోనే..
ప్రారంభించడమో.. ముగించడమో..
తన పాదయాత్రకు రాహుల్.. ‘ఓటర్ అధికార్ యాత్ర’గా నామకరణం చేశారు. గత ఏడాది సెప్టెంబర్‌లో రాహుల్ భారత్ జోడో యాత్రను ప్రారంభిస్తే.. ఈసారి సెప్టెంబర్ 1న ఆయన తలపెట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’ ముగియనుంది. మొత్తానికి సెప్టెంబర్ రాహుల్‌కు బాగా కలిసొచ్చినట్టుంది. ఆ నెలతో పాదయాత్రను ప్రారంభించడమో.. ముగించడమో చేస్తున్నారు. ఇక రాహుల్ పాదయాత్రలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ (Tejaswi Yadav)తో పాటు ఇండియా (INDIA) కూటమి నేతలు సైతం పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ యాత్ర విషయమై రాహుల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేవలం తన యాత్ర ఎన్నికల సమస్య మాత్రమే కాదని.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తాను చేస్తున్న యుద్ధంగా ఆయన అభివర్ణించారు.
ప్రజా కోర్టులోనే ఏదైనా తేల్చుకోవాలని..
‘ఒక వ్యక్తి.. ఒక ఓటు’ అనే సూత్రాన్ని కాపాడుకోవడమే తన లక్ష్యంగా రాహుల్ పేర్కొన్నారు. తాను చేస్తున్న న్యాయపోరాటంలో భాగస్వాములు కావాలంటూ బీహార్ యువతను కూడా ఆయన ఆహ్వానించారు. దేశ వ్యాప్తంగా పారదర్శక ఓటర్ల జాబితా లక్ష్యంగా తమ యాత్ర కొనసాగుతుందని రాహుల్ వెల్లడించారు. ఓట్ల దొంగతనంపై రాహుల్ గాంధీ గత కొద్ది రోజులుగా పోరాడుతున్న విషయం తెలిసిందే. పార్లమెంటును సైతం ఆయన వణికించారు. పార్లమెంటు సాక్షిగా ర్యాలీలు నిర్వహంచారు. బీహార్ ఎన్నికల నేపథ్యంలో ప్రజా కోర్టులోనే ఏదైనా తేల్చుకోవాలని సిద్ధమయ్యారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) పేరుతో బీహార్‌లో పెద్ద కుట్రకే తెరదీసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. లక్షలాది మంది ఓట్లను జాబితా నుంచి తొలగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే రాహుల్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
ప్రజావాణి చీదిరాల