Politics

TG News: స్టానిక సంస్థల ఎన్నికలకు రూట్ క్లియర్.. కానీ సీన్ రివర్స్

సీఎం రేవంత్ రెడ్డి సైతం అధికారులతో సమావేశం నిర్వహించి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అంతా ఓకే కానీ ఒక్క విషయంలో మాత్రం సీన్ రివర్స్‌‌గా ఉంది.

TG News: స్టానిక సంస్థల ఎన్నికలకు రూట్ క్లియర్.. కానీ సీన్ రివర్స్

స్థానిక సంస్థల ఎన్నికలకు రూట్ క్లియర్ అయిపోయింది. ఇక నుంచి ఏ క్షణమైనా షెడ్యూల్ రావొచ్చు.. ఆపై ఎప్పుడైనా నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు రూట్ క్లియర్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి సైతం అధికారులతో సమావేశం నిర్వహించి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అంతా ఓకే కానీ ఒక్క విషయంలో మాత్రం సీన్ రివర్స్‌‌గా ఉంది. అదేంటో చూద్దాం.

గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ (Congress)లో ఒకరంటే ఒకరికి పడదని.. వారి మధ్య ఎన్నో విభేదాలున్నాయని బీఆర్ఎస్ (BRS) నానా రచ్చ చేసింది. ముఖ్యంగా ఆ అంశాన్నే బూచిగా చూపించి అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections)నూ.. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections)నూ ఎక్కువ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. వాస్తవానికి కాంగ్రెస్‌ (Congress)లో అప్పటి పరిస్థితులు అలాగే ఉండేవి. కాంగ్రెస్ నేతలం (Congress Leaders)తా ఎవరు పైకి ఎదుగుతున్నా లాగేందుకు సిద్ధంగా ఉండేవారు కానీ పార్టీ అధికారంలోకి వచ్చాక సీన్ మారిపోయింది. నేతలంతా ఒక్కతాటి పైకి వచ్చారు. ఇప్పుడు విభేదాలున్నా కూడా పైకి అయితే కనిపించనివ్వడం లేదు. అంతా కలిసికట్టుగా ఉన్నట్టుగానే కనిపిస్తున్నారు. అధికారం చేతిలో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా అలాగే ఉంటుంది. అందుకు కదా.. అధికారాంతమున చూడవలె అన్నారు పెద్దలు. ప్రస్తుతం ఈ పరిస్థితి బీఆర్ఎస్‌లో కనిపిస్తోంది.

మసకబారుతున్న ప్రభ..

ఒకప్పుడు కాంగ్రెస్‌ను వేలెత్తి చూపిన నేతలంతా ఇప్పుడు తమ పరిస్థితిని చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అధినేత కేసీఆర్ (KCR) తన కన్నకూతురు కవిత (Kalvakuntla Kavitha)నే పార్టీ నుంచి బయటకు పంపించారు. పార్టీ నేతల్లో కొందరు రివర్స్ అయిపోయారు. ఉన్న నేతల్లో కూడా ఎవరుంటారు.. ఎవరుండరో తెలియని పరిస్థితి. పైగా నంబర్ 2 స్థానం కోసం సొంత ఇంటిలోనే కుంపటి రాజుకుంటోంది. ఒకప్పుడు కుటుంబ పార్టీ అన్నారు. కుటుంబానికి బీటలు వారాయి. పార్టీలోనూ తెలియని అంతర్గత సంఘర్షణ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ కూడా అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్‌ను వీడి బయటకు వస్తున్నది లేదు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) యాక్టివ్‌గా ఉన్నా కూడా ఆయన ప్రభ కూడా మసకబారుతోంది. మరోవైపు హరీష్ రావు (Harish Rao) ఉన్నా.. కవిత (Kavitha) రేపిన జ్వాలల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి సమయంలో కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నంబర్ 2 స్థానంలో అయినా నిలుస్తుందా? అన్నది సందేహమే. మొత్తానికి ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయంటే ఇదేనేమో.

పూర్తైన రిజర్వేషన్ ప్రక్రియ..

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మొన్నటి వరకూ నిర్వహించాలా? సమయం తీసుకుందామా? అన్న మీమాంసలో ఉన్నారు కానీ ఇప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆదేశాలు జారీ చేశారు. బీసీ సంక్షేమ (BC Welfare), పంచాయతీరాజ్‌ (Panchayatiraj) శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా.. ఎన్నికల సంఘా (EC)నికి సైతం సమాచారం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం ఇవాళ (శనివారం) ఉదయం స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఉన్నతాధికారులంతా హాజరుకానున్నారు. ఇప్పటికే రిజర్వేషన్ల (Reservations) ఖరారు ప్రక్రియ కూడా పూర్తైంది. రాజకీయ పార్టీల (Political Parties) సమక్షంలో లాటరీ నిర్వహించి రిజర్వ్‌డ్ స్థానాల్లో 50 శాతం స్థానాలను మహిళా రిజర్వేషన్లకు అనుగుణంగా ఎంపిక చేయనున్నారు.

ప్రజావాణి చీదిరాల

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 27, 2025 7:10 AM