KCR: ఇప్పుడే కేసీఆర్‌కు అసలైన పరీక్ష..!
అధికారంలో లేనప్పుడు ఎలా ఉన్నా ఎవరూ పట్టించుకోరు కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. కానీ కొందరు నేతలు ఎందుకోగానీ రివర్స్‌లో ఉంటారు.

అధికారంలో లేనప్పుడు ఎలా ఉన్నా ఎవరూ పట్టించుకోరు కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. కానీ కొందరు నేతలు ఎందుకోగానీ రివర్స్‌లో ఉంటారు. ఇక ఎప్పటికీ మనదే అధికారం అనుకుంటారో లేదంటే మరో కారణమో కానీ కొన్ని తప్పులు మాత్రం చేస్తుంటారు. అధికారం కోల్పోయాక అవే పార్టీని మరింత పతనం అంచుకు తీసుకెళతాయి. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి అదే.
తెలంగాణ (Telangana) ఉద్యమ బిడ్డగా అప్పట్లో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) ఆవిర్భవించింది. కేసీఆర్ (KCR) ఈ పార్టీని స్థాపించి ఉద్యమాన్ని ఉవ్వెత్తుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఈ పార్టీ నేతలు ఎన్ని సార్లు రాజీనామా చేసినా కూడా ప్రజలు వెన్నంటి ఉండి గెలిపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ (Congress)ను పక్కనబెట్టి రెండు పర్యాయాలు టీఆర్ఎస్‌ను గెలిపించారు. ఇలా పదే పదే గెలవడంతో ఇక తమకు తిరుగులేదనుకున్నారో ఏమో కానీ ఆ పార్టీకి చెందిన అధినేత సహా కొందరు నేతలు ఇష్టానుసారంగా వ్యవహరించారనే భావన ప్రజల్లో వచ్చేసింది. అహంకారం బాగా పెరిగిపోయిందనేది ప్రధాన అభియోగం.. అసలు ప్రజల్లో తమ పార్టీ పట్ల ఎలాంటి భావన ఉందనేది గ్రహించకుండానే జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించాలని టీఆర్ఎస్‌ను కాస్త బీఆర్ఎస్ (BRS)గా మార్చారు. కనీసం కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram Project) విషయంలో జాగ్రత్త వహించినా కూడా పార్టీ ఇంతటి అప్రదిష్టను మూటకట్టుకుని ఉండేది కాదేమో.. అదే ఇప్పుడు పార్టీకి ఉరితాడులా మారింది.
కొడుకా? మేనల్లుడా?
స్వయానా కేసీఆర్ కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam)లో జైలు పాలైనప్పుడు ముందు అదేదో తేల్చుకుని రమ్మని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉంటే కేసీఆర్‌కు క్రెడిబులిటీ దక్కేది.. అదీ చేయలేదు. పార్టీ ఓటమి పాలైన తర్వాత ఆయన నిత్యం జనాల్లో ఉండి ఉంటే పెద్దగా డ్యామేజ్ జరిగి ఉండేది కాదు. ఆయన ఫామ్ హౌస్ (Farm House)కే పరిమితమయ్యారు. ఇప్పుడు కొడుకా? కూతురా? అనే డైలమాలో కొడుకు పక్కనే నిలిచారు. ఆయన కారణాలు ఆయనకు ఉండి ఉండొచ్చు. కూతురిలో అసంతృప్తి పెరిగింది. ప్రస్తుతం ఆమె పార్టీ ముఖ్యులను కార్నర్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో పార్టీ మరింత సంక్షోభంలో కూరుకుపోతోంది. జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీదటైనా పార్టీని మరింత పటిష్టం చేసుకుందామా? అంటే ఇప్పుడే ఆయనకు అసలైన పరీక్ష ప్రారంభమైంది. ఇప్పుడు కొడుకు కేటీఆరా (KTR).. మేనల్లుడు హరీష్ రావా (Harish Rao) అనేది కీలకంగా మారిపోయింది. కొడుకా? కూతురా? అంటే ఈజీగా తేల్చేసుకున్న కేసీఆర్ కొడుకు, మేనల్లుడు విషయానికి వస్తే తేల్చుకోవడం అంత ఈజీ ఏమీ కాదు.
అడకత్తెరలో పోకచెక్కలా..
గతంలో కొంతకాలం పాటు మేనల్లుడు హరీష్ రావుకి మంత్రి పదవి ఇవ్వకుండా నిలిపివేస్తేనే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. జనాల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఇక ఇప్పుడు అది మరింత కష్టం. పార్టీలో జరుగుతున్న నంబర్ గేమ్ (Number Game)లోనూ కేసీఆర్ దారుణంగా ఓడిపోతున్నారు. కొడుకు కేటీఆర్ అంటే హరీష్ రావు మద్దతుదారులకు ఆగ్రహం తెప్పించినట్టవుతుంది. కేటీఆర్ కంటే హరీష్ రావుకు ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఆయన తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెన్నంటి ఉన్నారు. ఇప్పుడు పక్కనబెడితే అంతకు మించిన ద్రోహం మరొకటి ఉండదనేది రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్న మాట. మరి ఈ తరుణంలో కేసీఆర్ ఏం చేస్తారు? సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ పోతారా? లేదంటే ధైర్యంగా ఏదో ఒక స్టెప్ తీసుకుంటారా? మొత్తానికి కేసీఆర్ అయితే అడకత్తెరలో పోకచెక్కలా మారిపోయారు. మరోవైపు పార్టీ నేతలంతా సందిగ్దంలో ఉండిపోయారు. పార్టీ మరింత సంక్షోభంలో కూరుకుపోతున్న తరుణంలో పార్టీలోనే ఉండాలా? లేదంటే మరో పార్టీలోకి జంప్ చేయాలా? అని తెగ ఆలోచిస్తున్నట్టు టాక్.
ప్రజావాణి చీదిరాల