PJR: ‘పండిత పుత్ర’ శాపం.. పీజేఆర్ వారసత్వం ముగిసినట్టేనా?
జూబ్లీహిల్స్ నుంచి పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి, కుమార్తె విజయారెడ్డి ఈ ఉపఎన్నికలో ఏ ప్రధాన పార్టీ పరిశీలనలోకి కూడా రాకపోవడంతో, వారి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఒకప్పుడు పేదల పక్షపాతిగా, ‘తోపు’ నేతగా, ఏకంగా ముఖ్యమంత్రి స్థాయిని అందుకునే సత్తా ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్న దివంగత పి. జనార్ధన్ రెడ్డి (పీజేఆర్) రాజకీయ వారసత్వం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల నుంచి దూరమవుతోందా? అంటే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా జరుగుతున్న పరిణామాలు 'అవును' అనే సమాధానాన్నే సూచిస్తున్నాయి. పీజేఆర్ లేకపోయినా, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో ఆయన అభిమానుల మాస్ ఫాలోయింగ్, ఆయన పేరిట జరిగే కార్యక్రమాలు ఇప్పటికీ కనిపిస్తాయి. అయితే, జూబ్లీహిల్స్ నుంచి పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి, కుమార్తె విజయారెడ్డి ఈ ఉపఎన్నికలో ఏ ప్రధాన పార్టీ పరిశీలనలోకి కూడా రాకపోవడంతో, వారి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
గెలుపునకు పనికిరాదా?
పీజేఆర్ రాజకీయాలు (PJR Politics) ఒక బ్రాండ్. ఆయన ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లిన తీరు, కింది స్థాయి నుంచి ఎదిగిన విధానం అసాధారణమైనది. అయితే, ఆయన వారసులు, వారసుడు ఆ స్థాయిలో ప్రజలతో అనుబంధాన్ని ఏర్పరుచుకోలేక, రాజకీయంగా వెనకబడిపోయారన్న విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి, 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జూబ్లీహిల్స్ (Jubleehills) ఏర్పడింది. అంతకుముందు ఖైరతాబాద్ పరిధిలో ఉన్న ఈ స్థానం నుంచి 2009లో కాంగ్రెస్ తరఫున విష్ణువర్ధన్ రెడ్డి గెలిచారు. అయితే, ఆ తర్వాత వరుసగా 2014, 2018 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. పీజేఆర్ పేరు మీద ఉన్న మాస్ ఫాలోయింగ్ ఎన్నికల్లో గెలిపించే ఓట్లుగా మారడంలో విష్ణు విఫలం కావడం వల్లే మూడు సార్లు వరుసగా ఓడిపోవాల్సి వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు.
బీఆర్ఎస్ 'హ్యాండ్'!
గత ఎన్నికల్లో పోటీ చేయడానికి విష్ణువర్ధన్ రెడ్డి విశ్వప్రయత్నం చేశారు. కాంగ్రెస్ (Congress)లో టికెట్ దక్కకపోవడంతో, చివరి నిమిషంలో ఆయన బీఆర్ఎస్ (BRS)లోకి మారాల్సి వచ్చింది. విష్ణు పార్టీ మారడం వల్లే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ (Azharuddin) గెలవలేకపోయారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. అయితే, 2023 ఎన్నికల్లో ప్రత్యామ్నాయం చూపుతామని హామీ ఇచ్చి బీఆర్ఎస్ విష్ణును పార్టీలోకి తీసుకున్నప్పటికీ, ఇప్పుడు ఉపఎన్నికలో కూడా ఆయనకు కనీసం టికెట్ పరిశీలన కూడా దక్కలేదు. బీఆర్ఎస్ సానుభూతి పేరుతో మాగంటి సునీతకు టికెట్ ఇవ్వగా, విష్ణువర్ధన్ రెడ్డి పేరును విస్మరించింది. పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినా, కనీసం పరిగణనలోకి తీసుకోకపోవడం పీజేఆర్ అభిమానులను కలవరపరుస్తోంది.
అగమ్యగోచరమేనా?
ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. ఇటు బీఆర్ఎస్‌లో విష్ణు, అటు కాంగ్రెస్‌లో ఆయన సోదరి విజయారెడ్డి ఉన్నప్పటికీ, వీరిద్దరినీ ప్రధాన పార్టీలు పట్టించుకోలేదు. ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పీజేఆర్ కుటుంబం ప్రాబల్యం తగ్గిపోయిందా? అనే చర్చను లేవనెత్తుతోంది. మరోవైపు, టికెట్ దక్కించుకోలేని విష్ణు ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం ఎంతవరకు కృషి చేస్తారనేది సస్పెన్స్‌గా మారింది. విష్ణు తన సన్నిహితుల వద్ద ‘నెక్స్ట్ ఎన్నికలకు అభ్యర్థిని నేనే’ అని చెబుతున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, బీఆర్ఎస్ హైకమాండ్ ఆయనకు ఎలాంటి హామీ ఇచ్చిందీ లేనిదీ మాత్రం రాజకీయ పరిశీలకులకు అంతుచిక్కడం లేదు.
పీజేఆర్ వంటి అపారమైన మాస్ లీడర్ వారసులుగా ఉన్నప్పటికీ, వారి రాజకీయ జీవితం ప్రధాన పార్టీల కటాక్షం కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడటం, జూబ్లీహిల్స్ రాజకీయాల నుంచి వారు దాదాపు ఔట్ అయినట్టే కనిపిస్తుండటం.. ఈ మొత్తం వ్యవహారం ‘పండిత పుత్రులకు’ రాజకీయ వారసత్వం మాత్రమే సరిపోదు, సొంతంగా బలమైన రాజకీయ బ్రాండ్‌ను సృష్టించుకోవాలనే పాఠాన్ని మరోసారి గుర్తుచేస్తోంది.
ప్రజావాణి చీదిరాల