Politics

TCongress: టీ కాంగ్రెస్ నేతల ఫైట్.. అధిష్టానం లైట్..

తెలంగాణ (Telangana)లో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ (Congress Party) అంటే వర్గపోరు.. అంతర్గత పోరు.. కుమ్ములాటలు.. కొట్లాటలు.. ఈ పార్టీలో పీతల్లాంటి నేతలెక్కువ.. ఎవరైనా పైకి ఎదుగుతుంటే కాలు పట్టి లాగేస్తారనే టాక్ ఉండేది.

TCongress: టీ కాంగ్రెస్ నేతల ఫైట్.. అధిష్టానం లైట్..

తెలంగాణ (Telangana)లో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ (Congress Party) అంటే వర్గపోరు.. అంతర్గత పోరు.. కుమ్ములాటలు.. కొట్లాటలు.. ఈ పార్టీలో పీతల్లాంటి నేతలెక్కువ.. ఎవరైనా పైకి ఎదుగుతుంటే కాలు పట్టి లాగేస్తారనే టాక్ ఉండేది. ఆ తరువాత వాటన్నింటికీ చెక్ పెడుతూ కలిసికట్టుగా పోరాడి అధికారం అయితే దక్కించుకున్నారు. ఏడాదిన్నర గడిచింది. పాలన సవ్యంగానే సాగుతోందనుకుంటున్న తరుణంలో పరిస్థితులు మొదటికొచ్చాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. విపక్షాలు ఆరోపించడమేంటిలే చూస్తున్నవారికెవరికైనా తెలుస్తుంది. పైన పటారం.. లోన లొటారం అని..

మంత్రులు.. పదవులు పొందిన వారు.. ఒకరేంటి? సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సహా ఏదో ఒక ఆరోపణను మోస్తూనే ఉన్నారు. ఎప్పుడైనా ఆది నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నవారి కారణంగా ఎలాంటి ఇబ్బందీ ఉండదు.. ఎన్నికలకు ముందు వచ్చిన వారే పార్టీని దెబ్బతీసేది. ప్రస్తుతం అలాంటి వారే ఎక్కువగా పార్టీలో పదవులు పొంది ఆ తరువాత పొలిటిక్స్ ప్లే చేస్తున్నారనేది టాక్. ఇటీవలి కాలంలో ఎన్నో సంఘటనలు దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మంత్రుల (Telangana Ministers) మధ్యే కాదు.. ఏకంగా సీఎం వర్సెస్ మంత్రులు కూడా గొడవలు జరుగుతున్నాయంటూ టాక్ నడుస్తోంది. వీరి కుమ్ములాటల కారణంగా అధికారులు నలిగిపోతున్నారనే టాక్ కూడా నడుస్తోంది. తెలంగాణలోని ఐఏఎస్ అధికారులపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ ఏకంగా మంత్రులు.. చీఫ్ సెక్రటరీకి లేఖలు రాయడం వంటివి తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారాయి. అసలేం జరుగుతోంది. ఎందుకింత దారుణంగా పరిస్థితులు తయారయ్యాయి?

ముఖ్యమంత్రి వర్సెస్ ఎక్సైజ్ శాఖ మంత్రి..

అసలు తెలంగాణలో ఇంత జరుగుతున్నా ఎందుకు అధిష్టానానికి తెలియడం లేదు. కొండా సురేఖ (Konda Surekha) వర్సెస్ పొంగులేటి వివాదం (Ponguleti Srinivasa Reddy).. కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిపైనే దారుణమైన ఆరోపణలు గుప్పించారు. రెడ్డి వర్సెస్ బీసీ నడుస్తోందంటూ ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పూర్వం ఎన్నో హామీలిచ్చారు. అగ్రనేతలంతా ఒక్కొక్కరు వచ్చి ఒక్కో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ నేతలంతా ఏమయ్యారు? కనీసం ఎందుకు ఇంత జరుగుతున్నా అధిష్టానం పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి వర్సెస్ ఎక్సైజ్ శాఖ మంత్రి (Telangana Excise Minister) మధ్య ఓ కాంట్రాక్ట్ వ్యవహారం విషయమై గొడవ జరిగినట్టుగా పలు పత్రికల్లో పతాక శీర్షికన వార్తలొచ్చాయి. వాస్తవానికి ఈ పోరాటం మంత్రి కుమారుడు వర్సెస్ ముఖ్యమంత్రి అల్లుడి మధ్య జరిగిందంటూ ప్రచారం జరిగింది. దీంతో అటు మంత్రి.. ఇటు ముఖ్యమంత్రి రంగంలోకి దిగారని టాక్. ఈ వ్యవహారంలో సీఎం గెలిచారని తెలుస్తోంది. ఈ వివాదంలో ఒక ఐఏఎస్ అధికారి నలిగిపోయి రిజైన్ చేశారు.

మీరు మీరు కొట్టుకోండి.. మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయండి

వాస్తవానికి మిగిలిన అంశాలన్నీ అభూత కల్పనలని కొట్టివేసినా కూడా ఐఏఎస్ అధికారి వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకోవడం నిజం. ఆయన వీఆర్ఎస్‌ను అంగీకరించవద్దని సీఎస్‌కు ఒక మంత్రి లేఖ రాయడం వాస్తవం. ఆ లేఖ కూడా బయటకు వచ్చింది. ఇవన్నీ తెలంగాణలో హాట్ టాపిక్‌గా కొనసాగుతున్నాయి. మరి ఆ వార్తలు కూడా అధిష్టానానికి చేరలేదా? లేదంటే ‘మీరు మీరు కొట్టుకోండి.. మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయండి’ అన్నట్టుగా ఉన్నారా? అనేది తెలియకుండా ఉంది. ఇవి మాత్రమే కాదు.. చాలా విషయాలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తున్నాయి. తెలంగాణలో అధికార పార్టీ వేధింపుల కారణంగా అధికారులు వీఆర్ఎస్ తీసుకుని వెళ్లిపోవడమంటే ఎంత దారుణం? ఇది చాలదన్నట్టుగా ఒక మంత్రి కుమార్తె ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడుతున్నారంటూ విమర్శించడం నిజం.. అలాగే గన్ పెట్టి బెదిరించి మరీ సెటిల్‌మెంట్స్‌కు పాల్పడుతున్నారంటూ చెప్పడం కూడా వాస్తవమే. ఇవన్నీ జరుగుతుంటే.. అసలు అధిష్టానం ఏం చేస్తుందో వారికే తెలియాలి.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 25, 2025 5:35 AM