Politics

‘మీదో పార్టీ... మీరొక నాయకుడు’ ఎంత పెద్ద మాటన్నా అది..?

మాణిక్యం ఠాగూర్ సవాల్‌పై చర్చ పెట్టనప్పుడే జగన్‌కు దమ్ము లేదని అర్థమైందని.. మోదీకి హాట్‌లైన్‌లో ఉన్నాడు కాబట్టి జగన్ దత్తపుత్రుడు అయ్యాడు. జగన్ మాదిరిగా బలప్రదర్శన యాత్రలు చేసి..

‘మీదో పార్టీ... మీరొక నాయకుడు’ ఎంత పెద్ద మాటన్నా అది..?

శత్రువులకు ఎక్కడో ఉండరు.. కూతుళ్ల రూపంలోనో చెల్లెళ్ల రూపంలోనో మన పక్కనే ఉంటారు.. అలాగని అన్నయ్య పుణ్యాత్ముడైతే చెల్లెలు ఎందుకు శత్రువుగా మారుతుందిలే.. ఏదైనా దెబ్బ తగిలితేనే కదా.. అదేమైనా చిన్న దెబ్బా? గట్టి దెబ్బే తగిలింది.. అందుకే అన్నయ్య నోటి నుంచి మాటొస్తే చాలు.. చెల్లెలు తోక తొక్కిన త్రాచులా సర్రున లేస్తోంది. ’మీదో పార్టీ...మీరొక నాయకుడు’ అంటూ మండిపడుతోంది. ఇంతకీ ఆ చెల్లెవరో అర్థమయ్యింది కదా.. అది అర్థమైతే అన్న ఎవరో కూడా అర్థమయ్యే ఉంటుంది.

వైఎస్ఆర్‌సీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)  గురించే ఇదంతా. ఆయన నిన్న జడ్పీటీసీ (ZPTC) ఉపఎన్నికల్లో పులివెందుల (Pulivendula), ఒంటిమిట్టలలో వైసీపీ (YCP) దారుణ పరాజయం పాలైంది. ముఖ్యంగా జగన్ (Jagan) కంచుకోట అయినా పులివెందులలో అయితే వైసీపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. ఆ బాధో.. ఆవేదనో.. లేదంటే రెండూ కలిసి వచ్చాయో కానీ ఆయన కాస్త టంగ్ స్లిప్ అయ్యారని ప్రతి ఒక్కరూ అంటున్న మాటే. ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu)ని వ్యక్తిగతంగా తూలనాడారంటూ టీడీపీ (TDP) నేతలంతా మండిపడ్డారు. వాస్తవానికి ఒక వ్యక్తి శక్తిని నిర్ణయించేది వయసు కాదు.. కానీ పదే పదే.. చంద్రబాబు ఏజ్ గురించి మాట్లాడుతూ.. జగన్ తనను తానే దిగజార్చుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు. సరే.. ఇప్పుడిదంతా పక్కనబెడితే ఆయన సోదరి షర్మిల (Sharmila)కు ఎందుకు కోపం వచ్చిందో ముందు తెలుసుకుందాం.

తెర వెనుక పొత్తులకు జగనే బ్రాండ్..

ప్రస్తుతం షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలన్న విషయం తెలిసిందే. మరి తమ పార్టీ అగ్రనేతను పట్టుకుని హాట్‌లైన్ (Hotline) అంటే ఆమె ఊరుకుంటారా? విల్లు తీసి మాటల బాణాలను ఎక్కుపెట్టి మరీ సంధిస్తారు. ఇప్పుడు ఆమె అదే పని చేశారు. తెర వెనుక పొత్తులకు జగనే బ్రాండ్ అంటూ ఫైర్ అయ్యారు. అలాంటి జగన్.. తమ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)ని హాట్‌లైన్ అంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మోదీ (PM Modi), అమిత్‌షా (Amith Shah)తో జగనే హాట్ లైన్ టచ్‌లో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. జగన్ మాదిరిగా బలప్రదర్శన యాత్రలు చేసి కార్లను రోడ్లపై కాకుండా జనాలపైకి ఎక్కించడం రాహుల్‌కు తెలియదన్నారు. ఈ మాత్రం అనేసి ఊరుకుంటే ఓకే.. ఆయన చరిత్రంతా బయటకు తీసి మరీ షర్మిల ఏకి పారేశారు. అలాగే పనిలో పనిగా జగన్‌కు ఓ సవాల్ కూడా విసిరారు.

జగన్‌కు దమ్ము లేదని అర్థమైంది..

ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu)తో రాహుల్ హాట్‌లైన్ టచ్‌ లేదని నిరూపిస్తాం.. దమ్ముంటే సవాల్ స్వీకరిస్తావా? అని జగన్‌ను షర్మిల ప్రశ్నించారు. పచ్చ కామెర్లు వచ్చినవాడి మాదరిగా ఉంది జగన్ తీరు అంటూ విమర్శించారు. మోదీకి వంగి వంగి దండాలు పెట్టిన జగన్‌ది నీతి మాలిన రాజకీయమని.. బీజేపీ తీసుకొచ్చిన బిల్లులన్నింటికీ మద్దతు ఇచ్చారంటూ విమర్శించారు. మాణిక్యం ఠాగూర్‌ (Manikyam Tagore)ను విమర్శించిన తీరుతో జగన్‌కు సభ్యత, సంస్కారం లేదని తేలిపోయిందన్నారు. మాణిక్యం ఠాగూర్ సవాల్‌పై చర్చ పెట్టనప్పుడే జగన్‌కు దమ్ము లేదని అర్థమైందని.. మోదీకి హాట్‌లైన్‌లో ఉన్నాడు కాబట్టి జగన్ దత్తపుత్రుడు అయ్యాడని షర్మిల విమర్శించారు. ఓట్ల చోరీపై నోరు మెదపవు కానీ.. రాహుల్‌ పోరాటంపై విమర్శలు గుప్పిస్తావా? అంటూ ఫైర్ అయ్యారు. టోటల్‌గా ‘మీదో పార్టీ.. మీరొక నాయకుడు’ అని ముగించారు. ఎంత పెద్ద మాట జగనన్నా అది అంటూ కార్యకర్తలు మొత్తుకుంటున్నారు.. మొత్తానికి పరిణామాలు ఊహించకుండా జగన్ రాహుల్ పేరు తీసి తేనె తుట్టెపై రాయి వేసినట్టున్నారు కదా..

ప్రజావాణి చీదిరాల

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
August 15, 2025 6:16 AM