Nara Lokesh: మోదీతో లోకేష్ భేటీ.. ఆసక్తికర విషయం ఏంటంటే..
ఒకప్పుడు తన అపాయింట్‌మెంట్ ఇవ్వడానికే ఆలోచించిన వ్యక్తి.. కొంతకాలం తర్వాత నా దగ్గరికే రావడం లేదేంటని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది? సక్సెస్ అంటే ఇది కదా అనిపిస్తుంది.

ఒకప్పుడు తన అపాయింట్‌మెంట్ ఇవ్వడానికే ఆలోచించిన వ్యక్తి.. కొంతకాలం తర్వాత నా దగ్గరికే రావడం లేదేంటని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది? సక్సెస్ అంటే ఇది కదా అనిపిస్తుంది. రాజకీయాల్లో అయితే ఇదొక సక్సెస్ మంత్ర ఏమీ కాదు.. అవసరాలే పరమావధి. ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) జైల్లో ఉన్న సమయంలో ఆయన తనయుడు, మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఎప్పుడూ ఢిల్లీలో ఉంటూ సుప్రీంకోర్టు (Supreme Court) న్యాయవాదుల సలహా తీసుకుంటూ ఉండేవారు. అదే తరుణంలో ప్రధాని మోదీ (PM Modi)ని కలిసేందుకు సైతం యత్నించేవారు. కానీ చాలా కాలం పాటు ఆయనకు మోదీ అపాయింట్‌మెంట్ దొరికిందే లేదు. సీన్ కట్ చేస్తే కొంత కాలం క్రితం ఫ్యామిలీతో ఢిల్లీ రావాలని ఎన్నిసార్లు పిలవాలి? అంటూ విశాఖ (Visakha) టూర్‌లో లోకేశ్‌ను మోదీ ప్రశ్నించారు.
ఆ తరువాత అంటే నాలుగు నెలల క్రితం నారా లోకేష్ తన ఫ్యామిలీతో కలిసి వెళ్లి మోదీత భేటి అయ్యారు. ఇక ప్రస్తుతం నారాలోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అక్కడ నేడు (శుక్రవారం) మరోసారి 45 నిమిషాల పాటు మోదీతో ఆయన భేటీ అయ్యారు. నాలుగు నెలల వ్యవధిలో ఆయన మోదీతో భేటీ అవడం ఇది రెండోసారి. ఈ భేటీకి సంబంధించిన కొన్ని విజువల్స్ బయటకు వచ్చాయి. ఏపీలో సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు మోదీకి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు సహకారం అందించాలని కోరారు. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకు చేయూత అందించాలని సైతం విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే మోదీకి నారా లోకేష్ యోగాంధ్ర నిర్వహణపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను బహూకరించారు.
మొత్తానికి మోదీతో నారా లోకేష్ భేటీ ఆశాజనకంగా ముగిసింది. సాధారణంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)ని ఎవరు కలిసినా.. ఏదో కరచాలనం చేస్తున్న ఫోటోనో.. పుష్ప గుచ్చం అందిస్తున్న దానికి సంబంధించిన ఫోటోలు బయటకు వస్తాయి. కానీ నారా లోకేష్, మోదీకి సంబంధించిన పిక్స్ కొన్ని బయటకు వచ్చాయి. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏపీలో మంచి మెజారిటీతో కూటమి ప్రభుత్వం విజయం సాధించడం.. ఆపై ఎన్డీఏ గవర్నమెంటు (NDA Goverment)లో టీడీపీ కీలకమవడంతో ఆ పార్టీకి ప్రయారిటీ బాగా పెరిగిపోయింది. టీడీపీ (TDP) అవసరం ఉంది కాబట్టి మోదీ సైతం సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌లతో సఖ్యత మెయిన్‌టైన్ చేస్తున్నారనేది ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట.
ప్రజావాణి చీదిరాల