Nara Lokesh: నారా లోకేష్ వర్సెస్ బొత్స.. ఎంతమాటనేశారు.. బొత్స వంటి పెద్దలకు న్యాయమేనా?
ఆటకైనా.. పాటకైనా.. మాటకైనా.. దేనికైనా సమవుజ్జీ ఉంటేనే అది ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా ఎక్కడైనా సరే.. అసెంబ్లీ లేదంటే శాసనసభా సమావేశాలు జరుగుతున్నాయంటే..

ఆటకైనా.. పాటకైనా.. మాటకైనా.. దేనికైనా సమవుజ్జీ ఉంటేనే అది ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా ఎక్కడైనా సరే.. అసెంబ్లీ లేదంటే శాసనసభా సమావేశాలు జరుగుతున్నాయంటే అధికారపక్షంతో పాటు ఇతర పార్టీలూ సభలో ఉండాలి. ఉంటేనే సభ ఆసక్తికరంగా ఉంటుంది. లేదంటే ఏదో జరిగాయంటే జరిగాయన్నట్టుగా తయారువుతుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇదే జరుగుతోంది. శాసనమండలి కాస్త ఇంట్రస్టింగ్‌గానే ఉంటుంది కానీ ఇవాళ మాత్రం మంటలు రేగాయి.
బొత్స సత్యనారాయణ.. రాజకీయాల్లో తలపండిన నేత.. ఏది పడితే అది మాట్లాడకూడదు.. బూమరాంగ్ అయితే తట్టుకోవడం కష్టం. ఇవాళ అదే జరిగింది. కూటమి ప్రభుత్వం మహిళలను అవమానించిందని వ్యాఖ్యానించారు. దీనిపై నారా లోకేష్ మండిపడ్డారు. తన తల్లిని నిండు సభ సాక్షిగా అవమానించారంటూ ఫైర్ అయ్యారు. మహిళలను ఎలా గౌరవించాలో తనకు తెలుసని.. తన తల్లి తనకు నేర్పించారని పేర్కొన్నారు. తాను చాలా మర్యాదగా మహిళల పట్ల నడుచుకుంటానన్నారు. అయితే నారా లోకేష్ సైతం నోరు జారారనే చెప్పాలి. ఫీజు రీఎంబర్స్‌మెంట్ విషయమై జరిగిన చర్చలో ఐదేళ్లలో ‘మీరేం పీకారు’ అంటూ ఫైర్ అయ్యారు. ఆవేశంలో అయినా శాసనమండలిలో ఈ పదం వాడటం సరికాదు.
పయ్యావుల వర్సెస్ బొత్స..
ఇక ఫీజు రీఎంబర్స్‌మెంట్ (Fee reimbursement) విషయంలోనూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వైసీపీ గత కొంతకాలంగా విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంటు విషయంలో అన్యాయం జరుగుతోందంటూ నానా రచ్చ చేస్తోంది. తాజాగా వైసీపీ శాసన మండలిని దీనికి వేదికగా చేసుకుంది. ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు. ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీఎంబర్స్‌మెంట్ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదనీ.. ఈ కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేనా? ప్రభుత్వానికి ఈ విషయంలో కనీసం చింత లేదని.. పైగా ఫీజు రీఎంబర్స్‌మెంట్ సొమ్ములను ఇతర పథకాలకు మళ్లిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే తొలుత మంత్రి పయ్యావుల కేశవ్ వర్సెస్ బొత్సల మధ్య వాగ్వాదం జరిగింది.
వాగ్యుద్ధాలకు ఆస్కారమే లేదు..
ఆ తరువాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌పై ఎప్పుడు కావాలంటే అప్పుడు చర్చలకు సిద్ధమని.. అదొక్కటే కాదు.. ఏ విషయమైనా చర్చకు సిద్ధమని అన్నారు. మీరు సిద్ధమా? అంటూ వైసీపీ (YCP)కి సవాల్ విసిరారు. మొత్తానికి ఆరోపణలు, ప్రత్యారోపణలతో శాసనమండలిలో మంటలు రేగాయి. విషయం ఏదైనా కూడా ఇలా చర్చ జరిగితేనే బాగుంటుంది. వన్ సైడెడ్‌గా ఉంటే దానిని ఎవరూ పట్టించుకోరు కూడా. అంతెందుకు తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)పై పెట్టిన శ్రద్ధను ప్రజానీకం ఏపీ అసెంబ్లీపై పెట్టరు. ఎందుకంటే.. అక్కడ విపక్షం లేదు. వాగ్యుద్ధాలు.. చర్చల వంటి వాటికి పెద్దగా ఆస్కారమే లేదు. మొత్తానికి ఇన్నాళ్లకు ఏపీలో శాసనమండలి అయినా కాస్త సందడిగా నడిచింది.
ఇద్దరి మధ్యా మాటల యుద్ధం..
సభలో చర్చ జరిగితేనే దానికి అందం. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)కి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అలిగి రోడ్డున కూర్చోలేదండోయ్ ప్యాలెస్‌లో కూర్చొన్నారు. పైగా అసెంబ్లీ (AP Assembly) దిక్కే చూడవద్దని తన పార్టీ ఎమ్మెల్యేలకు హుకుం జారీ చేశారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు.. దద్దరిల్లుతుంది. ఏపీలో అయితే చప్పగా సాగుతున్నాయి. ఎందుకంటే విపక్షం లేదు కదా. ఇక అసెంబ్లీకైతే జగన్ (Jagan) ఆంక్షలు విధించారు కానీ శాసనమండలి (AP Legislative Council)కి మాత్రం నో ఆంక్షలు. దీంతో ఆ పార్టీ నేతలు శాసనమండలికి హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ నారా లోకేష్ (Nara Lokesh), సీనియర్ నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇది విన్నాక ఏపీ ప్రజానీకం ఖుషీ. విషయం ఏదైనా కాస్త శాసనమండలి ఆసక్తికరంగా కొనసాగింది కదా అని ఏపీ ప్రజలు అంటున్నారు.
ప్రజావాణి చీదిరాల