Politics

AP News: రాజధానికి బిల్లుకు లోక్‌సభ గ్రీన్ సిగ్నల్.. ఏపీ చరిత్రలో లిఖించిదగిన రోజిది..

ఏపీకి రాజధాని అనేది పన్నెండేళ్ల అక్కడి ప్రజల కల. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే తరువాత వచ్చిన వైసీపీ మూడు రాజధానుల పాట అందుకుంది. దీంతో ఏపీకి రాజధాని అనేదే లేకుండా పోయింది.

AP News: రాజధానికి బిల్లుకు లోక్‌సభ గ్రీన్ సిగ్నల్.. ఏపీ చరిత్రలో లిఖించిదగిన రోజిది..

ఏపీకి రాజధాని అనేది పన్నెండేళ్ల అక్కడి ప్రజల కల. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే తరువాత వచ్చిన వైసీపీ మూడు రాజధానుల పాట అందుకుంది. దీంతో ఏపీకి రాజధాని అనేదే లేకుండా పోయింది. సీన్ కట్ చేస్తే ఇన్నాళ్లకు ఏపీ ప్రజల కల నెరవేరుతోంది. లోక్‌సభ ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లుకు ఆమోదం తెలిపింది. రేపు రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అక్కడ కూడా ఆమోదం పొందడం ఖాయం. వాస్తవానికి ఏపీ చరిత్రలో లిఖించదగిన రోజిది.

2014లో తెలంగాణ.. ఏపీ విడిపోయాయి. తెలంగాణకు అది చాలా ప్లస్ అయితే ఏపీకి మైనస్. ఆ సమయంలో ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. అప్పట్లో అమరావతిని రాజధానిగా ప్రకటించారు. రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీని అప్పటి సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. మోదీ వచ్చి ఏదో చేస్తారనుకున్నారు. కానీ చెంబుడు నీళ్లు.. పిడికెడు మట్టితో సరిపెట్టి వెళ్లారు. అమరావతి నిర్మాణం కొంతమేర పూర్తైంది. కట్ చేస్తే నెక్ట్స్ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. మూడు రాజధానుల పేరు చెప్పి ఏపీకి రాజధాని అనేదే లేకుండా చేసింది.

ఇంద్ర భవనాన్ని తలదన్నేలా..

వైసీపీ వచ్చి అమరావతికి తిలోదకాలు వదిలి.. మూడు రాజధానుల పాట అందుకుంది. ఊహల్లోనే సౌధాలు నిర్మించింది. నెక్ట్స్ అంటే 2024 ఎన్నికల్లో కూడా తామే అధికారంలోకి వస్తామని ఏపీ మూడు రాజధానుల్లో ఒకటైన వైజాగ్‌లోని రుషికొండపై ఇంద్ర భవనాన్ని తలదన్నేలా ప్యాలెస్‌ను అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించుకున్నారు. కానీ తరువాతి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టీడీపీ కేంద్రంలో కీలక భూమిక పోషించాయి. అంతే ఏ మోదీ అయితే పిడికెడు మట్టి, చెంబెడు నీళ్లతో 2014లో సరిపెట్టారో.. ఆయన చేతే అమరావతికి ఆమోద ముద్ర వేయించేలా చేశారు సీఎం చంద్రబాబు. ఇది ఆయన ఒక్కరి ఘనతే కాదు.. ఆ క్రెడిట్‌లో జనసేన కూడా భాగస్వామ్యం పంచుకుంది. మొత్తానికి ఏపీ ప్రజల కల దాదాపుగా నెరవేరింది.

రెండు గంటల పాటు చర్చ..

ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ లోక్‌సభలో ఏపీ పునర్విభజన చట్ట సవరణ పేరుతో ఏపీ రాజధాని అమరావతి బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం సుమారు రెండు గంటలపాటు దీనిపై చర్చ జరిగింది. ఈ చర్చలో కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీతో పాటు కాంగ్రెస్, వైసీపీ, సమాజ్‌వాదీ సహా పలు పార్టీలు పాల్గొన్నాయి. అనంతరం బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. స్పీకర్‌ స్థానంలో ఉన్న తెన్నేటి కృష్ణప్రసాద్‌ బిల్లు ఆమోదం పొందినట్టుగా ప్రకటించారు. ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది.

రాజధాని లేని రాష్ట్రంగా..

బిల్లు ఆమోద సమయంలో విభజనపై ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన ప్రక్రియ అరాచకంగా జరిగిందని.. ఎలాంటి చర్చ లేకుండానే రాష్ట్ర విభజన చేశారన్నారు. పార్లమెంట్‌లో లైట్లు, కెమెరాలు ఆపి బిల్లు పాస్‌ చేశారని.. చట్టాన్ని గౌరవించి విభజనను ప్రజలు అంగీకరించాల్సి వచ్చిందని పురందేశ్వరి పేర్కొన్నారు. ఆ తర్వాత ఏపీకి రాజధాని అవసరం వచ్చిందన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ పాలన ప్రారంభమైందని.. ఆ సమయంలో ఏపీ రాజధానిగా అమరావతి పుట్టిందన్నారు. రాజధానికి 29వేల మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములిచ్చారన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అమరావతి భవితవ్యం అంధకారంలో పడిందని.. త్యాగం చేసిన రైతుల పట్ల గత ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించిందని పురందేశ్వరి పేర్కొన్నారు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
April 1, 2026 11:03 AM