Politics

YS Jaganmohan Reddy: మరో డేట్ ఫిక్స్ చేసిన జగన్.. ఇదైనా ఉంటుందా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది మొదలు.. బెంగుళూరు ఎలహంక ప్యాలెస్‌లోనే ఉంటున్నారు. మధ్యలో వచ్చినా కూడా ఆయన ఒకట్రెండు రోజుల పర్యటనకే పరిమితమవుతున్నారు.

YS Jaganmohan Reddy: మరో డేట్ ఫిక్స్ చేసిన జగన్.. ఇదైనా ఉంటుందా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది మొదలు.. బెంగుళూరు ఎలహంక ప్యాలెస్‌లోనే ఉంటున్నారు. మధ్యలో వచ్చినా కూడా ఆయన ఒకట్రెండు రోజుల పర్యటనకే పరిమితమవుతున్నారు. పార్టీ ఫోకస్‌పై ఇక మీదట ఫోకస్ పెడతారంటూ ఎన్నోసార్లు వార్తలొచ్చాయి కానీ.. ఎన్నో ముహూర్తాలు పోయాయి. కానీ ఇప్పటి వరకూ ఆయన పార్టీ పటిష్టంపై ఫోకస్ పెడుతున్న దాఖలాలే లేవు.

ఇక ఇప్పుడు తాజాగా మరో వార్త తెగ ప్రచారంలో ఉంది. అదేంటంటే.. వైఎస్ జగన్ పార్టీ పటిష్టంపై ఫోకస్ పెట్టబోతున్నారంటూ న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది. ఇప్పటి వరకూ పార్టీ నేతలతో మీటింగ్స్ లేవు. కార్యకర్తలను కలిసిందీ లేదు. ఇక ఇప్పటి నుంచైనా పార్టీపై ఫోకస్ పెట్టకుంటే వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం మాట అటుంచితే.. మరోసారి ప్రతిపక్ష హోదాను దక్కించుకోవడం కష్టమవుతుంది. ఈ క్రమంలోనే జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని టాక్.

ఇన్‌చార్జుల నియామకం..

ప్రస్తుతం జగన్ బెంగుళూరులో ఉన్నారు. అక్కడి నుంచే రాజకీయ వ్యూహాలను రచిస్తున్నారని టాక్. ఇక మీదట జనంలోకి పార్టీని తీసుకెళ్లాలని.. పార్టీ కేడర్‌లో ఉత్సాహం తీసుకురావాలని భావిస్తున్నారట. దీనికి ముందు పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పూర్తి చేయాలనే యోచనలో ఉన్నారట. ఈ క్రమంలోనే బెంగుళూరుకే పరిమితం కాకుండా ఏపీకి వెళ్లి అక్కడ పర్యటనలు ప్రారంభించాలని భావిస్తున్నారట. ఇప్పటికే వైసీపీ ఏపీలోని మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ ఇన్‌చార్జిలను నియమించింది. ఇక మీదట బూత్ లెవల్‌లో కమిటీలను వేయాలని భావిస్తున్నారట. ఈ మేరకు నియోజకవర్గ ఇన్‌చార్జిలకు జగన్ ఆదేశాలు సైతం జారీ చేశారట. ఈ క్రమంలోనే పార్టీ ప్రధాన కార్యవర్గాలను వేయడమే కాకుండా అనుబంధ కమిటీలను సైతం వేయాలని సూచించడంతో ఈ పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయని టాక్.

ఉగాదిలోగా పూర్తి చేసి..

ఇదంతా ఓకే కానీ జగన్ జనాల్లోకి వచ్చేదెప్పుడు? గతంలోనూ ఎన్నోసార్లు జనాల్లోకి వచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టుగా ప్రచారం జరిగింది కానీ ఆయన వచ్చిందే లేదు. అసలు జనాల్లోకి రావడానికి ముహూర్తాలెందుకో.. అయినా సరే.. ఈసారి కూడా జగన్ ముహూర్తం అయితే ఫిక్స్ చేసుకున్నారట. అది మరెప్పుడో కాదు.. ఉగాది నుంచే. మార్చి 19న ఉగాది పండుగ రానుంది. ఆ రోజు నుంచి జగన్ జనాల్లోకి వచ్చేస్తారట. అప్పటి నుంచి జిల్లాల నుంచి చుట్టేస్తారట. బూత్ లెవల్ కమిటీలను ఉగాదిలోగా పూర్తి చేసి అప్పటి నుంచి జిల్లాల పర్యటన ప్రారంభిస్తారట. ఈ పర్యటనలో జనాల్లోకి వెళ్లడంతో పాటు పార్టీ నేతలతో ఎక్కువగా గడుపుతారని అంటున్నారు. అదే జరిగితే పార్టీ నేతల్లోనూ కొత్త ఉత్సాహం వస్తుంది. పార్టీ నేతలు యాక్టివ్‌గా జనాల్లోకి వెళ్లడం జరుగుతుంది.

జిల్లాల్లో బస్సు యాత్ర

జగన్ జనాల్లోకి వెళ్లడంతో పాటు పార్టీ కేడర్‌తో భేటి అవుతారట. తద్వారా గతంలో తప్పిదాలను రిపీట్ కాకుండా చూసుకుంటారట. గ్రౌండ్ లెవల్‌లో అసలేం జరుగుతోంది? పార్టీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయాలను జగన్ తెలుసుకుంటారట. మొత్తం 26 జిల్లాల్లో 52 రోజుల పాటు అంటే జిల్లాకు రెండు రోజుల చొప్పున పర్యటన సాగిస్తారట. అయితే ఏకధాటిగా 52 రోజుల పాటు జగన్ పర్యటన ఉండదట. విడతలవారీగా ఈ ఏడాది చివరి వరకూ పర్యటిస్తారట. అలాగే ఈ పర్యటనంతా బస్సు యాత్రగా కొనసాగుతుందట. పలు జిల్లాల్లో జగన్ రాత్రిపూట కూడా బస చేయవచ్చని తెులస్తోంది. మొత్తంగా ఈ ఏడాదంతా పార్టీ కేడర్, నేతల్లో జోష్ నింపి.. వచ్చే రెండేళ్లలో ఎన్నికలపై ఫోకస్ పెడతారట. ఇక చూడాలి ఏం జరుగుతుందో..

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
February 23, 2026 9:04 AM