YS Jagan: ఇక మీనమేషాలు లెక్కించరట.. రంగంలోకి ఆమెను దింపుతారట..
ఏపీలో వైసీపీ మేల్కోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇప్పటికే టీడీపీ జగన్ కంచుకోటను సైతం టచ్ చేసింది. ఈ తరుణంలో కూడా ఈవీఎంలు, బ్యాలెట్లు అంటూ నిందిస్తూ కూర్చొంటే అక్కడే ఉండిపోతారు.

ఏపీలో వైసీపీ మేల్కోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇప్పటికే టీడీపీ జగన్ కంచుకోటను సైతం టచ్ చేసింది. ఈ తరుణంలో కూడా ఈవీఎంలు, బ్యాలెట్లు అంటూ నిందిస్తూ కూర్చొంటే అక్కడే ఉండిపోతారు. పులివెందులలో జడ్పీటీసీని టీడీపీ కైవసం చేసుకుంది. ఇంకా జగన్ మీనమేషాలు లెక్కబెడితే ఆయన సీటునే గల్లంతు చేసే అవకాశం లేకపోలేదు. అందుకే జగన్ ఇక మీదట ఛాన్స్ తీసుకోకూడదని డిసైడ్ అయినట్టు టాక్.
ఇప్పటికే ఏపీలో కూటమి ప్రభుత్వం బలంగా నాటుకుపోతోంది. పరదాల మాటున కాకుండా నేరుగా జనంలోకి వచ్చేస్తోంది. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రులకే నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)ని కలుసుకునే అవకాశం ఉండేది కాదు. కానీ నేటి కూటమి ప్రభుత్వం కార్యకర్తలతో టచ్‌లో ఉంటోంది. ఇప్పటికే జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కార్యకర్తల రక్షణ కోసం త్రిశూల్ పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నట్టు వెల్లడించారు. అటు సీఎం చంద్రబాబు (CM Chandrababu) కావొచ్చు.. మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కావొచ్చు.. చక్కగా జనాల్లోకి అయితే వెళుతున్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల్లోనూ మంచి ఆదరణ ఉంది. ముఖ్యంగా మహిళల కోసం పలు పథకాలను ప్రవేశపెడుతూ.. పార్టీ పట్ల భరోసాను పెంచుతున్నారు. కూటమి ప్రభుత్వం తమ నీడను ఏపీ అంతటా విస్తరిస్తోంది. దీనిలో జగన్ అసలు ఏమాత్రం కనిపించకుండా పోతున్నారు. ఆయన పార్టీ పరిస్థితి నానాటికీ దారుణంగా మారుతోంది.
ఆ నేతలెక్కడ?
ఇప్పుడు జగన్ ముందు రెండు సమస్యలున్నాయి. పులివెందుల (Pulivendula)నే కాదు.. రాష్ట్రాన్ని సైతం చూసుకోవాలి. మరి అదెలా సాధ్యం? అంటే పులివెందుల బాధ్యతను తన సతీమణి భారతీరెడ్డి (Bharathi Reddy)కి అప్పగిస్తారని టాక్. రాష్ట్రాన్ని తాను చూసుకుంటారట. పార్టీ అధికారంలో ఉండగా ప్రతి దానికీ తగుదునమ్మా అంటూ రంగంలోకి దిగిన నేతలెవరూ కూడా ఇప్పుడు కనిపించకుండా పోయారు. ఒకరిద్దరు మాత్రమే పార్టీ తరుఫున మాట్లాడుతున్నారు. ఈ సమయంలో జగన్ రాష్ట్ర బాధ్యతలు తీసుకోకుంటే ఒకప్పుడు ఏపీలో వైసీపీ (YCP) అనే పార్టీ ఉండేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. అసలే పులివెందులలో అడుగు పెట్టామన్న ఆనందం టీడీపీ (TDP)లో చాలా ఎక్కువగా ఉంది. అదే స్ఫూర్తితో ఈ సారి పుటివెందుల అసెంబ్లీని గెలవాలన్న ఉత్సాహంతో ఉంది. జగన్‌కు పరిస్థితులు అర్థమైనట్టుగానే ఉన్నాయి.
అవినాష్ రెడ్డి హవా అంతంత మాత్రమే..
తాజాగా జగన్ పులివెందులకు వెళ్లి అక్కడి పార్టీ నాయకులతో మాట్లాడి.. ప్రజా దర్భార్ నిర్వహించి అందరి సమస్యలూ తెలుసుకున్నారని టాక్. ఈ క్రమంలోనే పులివెందుల బాధ్యతలను భారతీరెడ్డికి అప్పగించాలనే యోచనలో ఉన్నారట. వైఎస్ రాజారెడ్డి (YS Rajareddy) నుంచి మొదలు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy), ఆ తరువాత వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) చక్కగా పులివెందులను ఒక్క తాటిపై నడిపించారు. అవినాష్ రెడ్డి (Avinash Reddy) ఉన్నా కూడా పులివెందులలో ఆయన హవా అంతంత మాత్రమే. భారతీ రెడ్డి అయితే జనాలతో మమేకమవగలరు. గతంలో జగన్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సైతం ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ అందరితో కలుపుగోలుగా వ్యవహరించారు. అవన్నీ చూశాకే జగన్ ఆమెకు పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నట్టు టాక్.