సమస్యల సునామీలో కవిత.. బయటకు వచ్చేదెలా?
అన్నతో వైరం.. పార్టీ నేతలతో గలాటా.. అది చాలదన్నట్టు తండ్రి మౌనం.. అధికారపక్షం మాటల దాడులు.. ఎటు చూసినా సమస్యలే..

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితకు గత కొంతకాలంగా టైమ్ ఏమాత్రం బాగోలేదని తెలంగాణ వాసులు అంటున్నారు. లిక్కర్ స్కాం కేసు నుంచి బయటకు వచ్చేశారు.. ఇక అంతా మంచి రోజులే అనుకున్న కొద్ది రోజులుగా కూడా నిలవలేదా మంచి క్షణాలు. అన్నతో వైరం.. పార్టీ నేతలతో గలాటా.. అది చాలదన్నట్టు తండ్రి మౌనం.. అధికారపక్షం మాటల దాడులు.. ఎటు చూసినా సమస్యలే..
ఎందుకింత అహంకారం?
కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా తయారైంది మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిస్థితి. ఒకవైపు కొడుకు.. మరోవైపు కూతురు.. ఎవరిని అంటే ఎవరికి కోపం వస్తుందోనని పెద్దాయన మౌనమునిలా మారిపోయారు. ఇక కవిత అయితే ఒకడుగు ముందుకు వేసి అన్నకు రాఖీ కట్టేందుకు రెడీ అయిపోయారు. వాస్తవానికి ప్రతి ఏటా చాలా ఆనందంగా అన్నాచెల్లెళ్లు రాఖీ కట్టుకుంటారు. గతేడాది జైలులో ఉన్న కారణంగా కవిత తన అన్నకు రాఖీ కట్టలేకపోయారు. ఈ ఏడాది కడతానంటే అన్న ఏమో తాను అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పి బెంగుళూరుకు చెక్కేశారు. అన్నాచెల్లెళ్ల మధ్య వార్ అయితే నడుస్తూనే ఉంటోందని కొన్ని పరిణామాలు చూస్తే ఇట్లే అర్థమైపోతుంది. దీనికి కారణమైతే రెండే రెండు ఉంటాయి.. అవి అధికారం, అర్థం. సరే.. కారణమేదైతేనేం మొత్తానికి కోల్డ్ వార్ అయితే గట్టిగానే నడుస్తోందని సొంత పార్టీ కార్యకర్తలే నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఇంట ఎలాగూ గెలవలేకపోతున్నా అనుకున్నారో ఏమో కానీ.. రచ్చ అయినా గెలుద్దామని బీసీ రిజర్వేషన్ల అంశాన్ని భుజానికెత్తుకున్నారు కవిత.
మాటల తూటాలు..
ఇటీవల బీసీ నేతలతో సమావేశమై.. కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్న బీసీలకు 42% రిజర్వేషన్లు కేవలం కంటితుడుపు చర్యగా అభివర్ణించారు. అది చాలదన్నట్టుగా అసలు ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాతే రిజర్వేషన్లు ఇస్తామని ఎందుకు చెప్పలేదంటూ ప్రశ్నించారు. ఇంతలా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తే ఆ పార్టీ నాయకులు ఊరుకుంటారా? మాటల తూటాలను గురి చూసి మరీ వదులుతున్నారు. బీసీల కోసం ఉద్యమించే కవిత.. తొలుత తన జాగృతి నుంచే మొదలుపెట్టవచ్చు కదా అని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. బీసీ రిజర్వేషన్లపై పోరాడుతానని ప్రకటించిన కవితకు చిత్తశుద్ధి ఏముందంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. అదంతా కాదు కానీ.. ముందు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్ష పదవిని బీసీకి ఇచ్చి మాట్లాడాలంటూ సవాళ్లు విసురుతున్నారు.
ఎటు చూసినా బీసీ రాగమే..
వచ్చే ఎన్నికల్లో అయితే బీసీ రిజర్వేషన్ల అంశం కీలకం కానుందనడంలో సందేహమే లేదు. ఈ విషయాన్ని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. అంతెందుకు? గత ఎన్నికల్లోనే ప్రధాన పార్టీలన్నీ బీసీ అంశాన్ని ముఖ్య అజెండాగా తీసుకున్నాయి. రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉన్న బీసీలను మెప్పించకుంటే ఏ పార్టీకి మనుగడే ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో పరిస్థితులు వేరు.. ఇప్పుడు వేరు. బీసీలు రాజకీయంగా స్ట్రాంగ్ అవుతున్నారు. ఎక్కడికక్కడ బీసీలు సంఘటితమవుతున్నారు. ఈ క్రమంలోనే కవిత ముందుగా బీసీల అంశాన్ని భుజానికెత్తుకున్నారు. మొత్తానికి ప్రస్తుతం పార్టీలన్నీ కూడా తాము బీసీల పక్షపాతులమని గట్టిగా చెప్పుకునే ప్రయత్నమైతే చేస్తున్నాయి. కవిత వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్య జరుగుతున్న పోరులో బీసీలు ఎవరికి అండగా నిలుస్తారో చూడాలి.
ప్రజావాణి చీదిరాల