Hyderabad: అర్ధరాత్రి హైదరాబాద్ అల్లకల్లోలం..
మూసీ శుక్రవారం అర్ధరాత్రి ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా ఉప్పొంగింది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలు జలదిగ్భంధంలో మునిగిపోయాయి. షాకింగ్ స్థాయిలో వరద..

అర్ధరాత్రి హైదరాబాద్ అల్లకల్లోలంగా మారింది. జోరు వానలకు జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్ (Himayatsagar), ఉస్మాన్‌సాగర్(గండిపేట) (Osmansagar) గేట్లను ఎత్తి భారీగా వరదను 13,500 క్యూసెక్యుల నీటిని దిగువకు వదలడంతో మూసీ (Musi River) శుక్రవారం అర్ధరాత్రి ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా ఉప్పొంగింది. హైదరాబాద్ (Hyderabad)లోని కొన్ని ప్రాంతాలు జలదిగ్భంధంలో మునిగిపోయాయి. షాకింగ్ స్థాయిలో వరద చాదర్‌ఘాట్ (Chadarghat) లోలెవల్ వంతెనపై నుంచి ఆరడుగుల మేర, మూసారాంబాగ్ (Moosarambagh) వంతెనపై నుంచి 10 అడుగుల మేర వరద పారింది. దీంతో మూసీ వరద ఎంజీబీఎస్ బస్టాండ్ (MGBS Bus Stand)లోకి చేరింది. వందల మంది ప్రయాణికులు బస్టాండ్‌లో చిక్కుకుపోవడంతో పోలీసులు, హైడ్రా (HYDRA), జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు రంగంలోకి దిగాల్సి సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సైతం ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించారు.
మూసీ నదికి ఇరువైపులా ఉన్న చాలా కాలనీలు నీట మునగడంతో హుటాహుటిన ఆయా కాలనీవాసులందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ రెండు వంతెనలపై నుంచి రాకపోకలు నిలిపివేయడంతో దిల్‌సుఖ్‌నగర్ (Dilsukhnagar), కోఠి మధ్య ట్రాఫిక్ (Traffic) సమస్య తలెత్తింది. హైటెక్ సిటీ (Hitech City)లో రహదారులపై పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయింది. అధికారులు మోటార్లతో వరదను దారి మళ్లించారు. హైదరాబాద్‌లోని ప్రతి ఏరియాలోనూ వరద నీరు రోడ్లను ముంచెత్తింది. శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport)లోనూ సైతం పరిస్థితులు అనుకూలంగా లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవ్వాల్సిన విమానాలను శుక్రవారం విజయవాడకు తరలించారు. ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.
ప్రజావాణి చీదిరాల