Politics

ఇంకెంత కాలం గోపిలా.. పోరాడు జగనన్న!

జగన్ కానీ.. ఊ అంటే ఆ అంటే నోరేసుకుని పడిపోయే ఆయన పార్టీ నేతలు కానీ ఒక్కరంటే ఒక్కరూ ఎందుకో నేరుగా రంగంలోకి దిగట్లేదు. బీజేపీ వ్యతిరేకంగా రాహుల్‌తో కలిసి స్టెప్ తీసుకోవచ్చుగా.. తీసుకోలేదేం?

ఇంకెంత కాలం గోపిలా.. పోరాడు జగనన్న!

అవును.. ఇంకా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గోపియేనట.. అంటే అదేనబ్బా గోడ మీద పిల్లేనట.. ఇది మాత్రమే కాదండోయ్.. ఆడలేక మద్దెల ఓడు అన్నాడట జగన్ లాంటి వ్యక్తొకడు. ఇవన్నీ నేనంటున్న మాటలు కాదండోయ్.. ఏపీ ప్రజానీకం అంటున్న మాట. ఎందుకో తెలుసుకుందాం..

 

ఏపీ సాధారణ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ నాటి నుంచి నేటి వరకూ వైసీపీ అధినేత సహా కొందరు ముఖ్య నేతలు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఓట్ల గోల్‌మాల్ చేస్తున్నారంటూ ధ్వజమెత్తితే.. మా ఏపీలోనూ జరిగాయి కానీ మా రాష్ట్రాన్ని పట్టించుకోలేదు. దీని వలన ఆయన క్రెడిబులిటీ శాతంలో కొంత తగ్గిపోయిందంటూ తెగ కలత చెందుతున్నారు. ఎవరో ఏదో చేయాలని ఆశించే బదులు స్వయంగా జగనే రంగంలోకి దిగి మా రాష్ట్రంలోనూ అన్యాయం జరిగిందని పోరాడవచ్చు కదా?ఒకప్పుడు బీజేపీతో అంటకాగిన జగన్‌ను ఇప్పుడు ఆ పార్టీ దేకట్లేదని సొంత పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్న పరిస్థితి. ఏ పార్టీకైనా స్వప్రయోజనాలు ముఖ్యం కదా. అదే పని ఇప్పుడే కాదు.. ఎప్పుడూ బీజేపీ చేస్తూనే ఉంటుంది. ఆ మాటకొస్తే వైసీపీ ఏమైనా తక్కువ తిన్నదా? ఆ పార్టీ స్వప్రయోజనాలను పక్కనబెట్టింది ఏనాడూ లేదు. ఇప్పుడూ అదే చేస్తోంది. బీజేపీకి ఎదురెళ్లాలంటే.. ఎక్కడ తను విచారణను ఎదుర్కొంటున్న కేసుల్లో జైలుకు పంపిస్తుందోనన్న భయంతో వణికిపోయారనే ఆరోపణలు కోకొల్లలు. అందుకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అడ్డుపెట్టుకుని జగన్ గేమ్స్ ఆడేందుకు ట్రై చేస్తున్నారు. 

ఇదీ అసలు సంగతి..

ఎవరో వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నమే జగన్ తప్ప.. తను మాత్రం రంగంలోకి దిగరు. ఇప్పుడు ఆయనేం చేశారంటారా? రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్‌పై చేసే వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. ఏపీని రాహుల్ ఉదాహరణగా తీసుకుంటే బాగుండేదంటూ తన మీడియా సంస్థ, వైసీపీ కార్యకర్తలతో చిలక పలుకులు పలికిస్తున్నారు. ఏపీలో పెద్ద ఎత్తున సాధారణ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆరోపిస్తూనే ఉంది. 49 లక్షల ఓట్లు ఏపీలో అదనంగా పోలయ్యాయంటూ లెక్కలతో సహా వెల్లడిస్తోంది. కానీ వీటిని రాహుల్ పరిగణలోకి తీసుకోలేదట. ఆయన క్రెడిబిలిటీ తగ్గిపోయిందట. అదే ఏపీని కూడా కలుపుకుని ఉంటే అమాంతం క్రెడిబిలిటీ పెరిగేదట.

పోరాటమేదీ?

హవ్వా.. నవ్విపోదురుగాక. మీకు ఓట్ల గల్లంతు జరిగాయని అంతగా అనిపిస్తే రాహుల్‌తో కలిసి ఆంధ్రాలో కూడా సాధారణ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ పోరాడాలి కదా.. పోరాటమెక్కడ? పైగా మహారాష్ట్ర, కర్ణాటక ఎన్నికలను పరిగణలోకి తీసుకుని ఏపీని వదిలేశారని.. ఆయన క్రెడిబిలిటీ కోల్పోయారంటూ ఆరోపణలెందుకు? జగన్ కానీ.. ఊ అంటే ఆ అంటే నోరేసుకుని పడిపోయే ఆయన పార్టీ నేతలు కానీ ఒక్కరంటే ఒక్కరూ ఎందుకో నేరుగా రంగంలోకి దిగట్లేదు. బీజేపీ వ్యతిరేకంగా రాహుల్‌తో కలిసి స్టెప్ తీసుకోవచ్చుగా.. తీసుకోలేదేం? అనే ప్రశ్నలు వైసీపీ నుంచే వస్తున్నాయి. ఎందుకంటే బీజేపీతో పెట్టుకుంటే ఓట్ల గల్లంతేమో కానీ తానెక్కడ గల్లంతవుతానోనన్న భయమని విమర్శలు, అంతకుమించి సైటైర్లు పేలుతున్నాయి. అందుకే నేరుగా ఆరోపణలు చేయలేక.. రాహుల్‌ క్రెడిబిలిటీ గురించి చింతించడమెందుకు? పైగా ఏపీ సీఎం చంద్రబాబుతో ఉన్న సంబంధాల రీత్యా రాహుల్‌ పట్టించుకోలేదా? లేదంటే కాంగ్రెస్‌కు పట్టు లేదని రాహుల్ ఏపీని వదిలేశారేమోనంటూ డౌటానుమానాలు వ్యక్తం చేస్తోంది. అంత సందేహముంటే రాహుల్ ఎందుకు వదులుతారు? చంద్రబాబుతో రాహుల్‌కు సత్సంబంధాలేంటి? వినడానికే విడ్డూరంగా లేదూ.. పోరాడు జగనన్న.. పోరాడితే పోయేదేం లేదు... సందేహాల నివృత్తి మినహా అంతేగా..!

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
August 12, 2025 1:23 PM