CM Chandrababu: సీబీఎన్.. ‘క్లాస్’ నుంచి ‘కఠిన హెచ్చరిక’..!
సీఎం చంద్రబాబు (CM Chandrababu) తన మంత్రివర్గ సహచరుల పనితీరు పట్ల మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం, వారికి కఠిన హెచ్చరికలు జారీ చేయడం ఏపీ ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

సీఎం చంద్రబాబు (CM Chandrababu) తన మంత్రివర్గ సహచరుల పనితీరు పట్ల మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం, వారికి కఠిన హెచ్చరికలు జారీ చేయడం ఏపీ ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రివర్గ సమావేశం జరిగినప్పుడల్లా మంత్రులకు క్లాస్ తీసుకోవడం పరిపాటిగా మారగా, తాజా సమీక్షలో సీఎం చేసిన వ్యాఖ్యలు మంత్రుల్లో కొత్త టెన్షన్‌ను పెంచుతున్నాయి. అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting)లో చంద్రబాబు (Chandrababu) మంత్రుల నిర్లక్ష్యంపై మరోసారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు విఫలమవుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలేం జరిగింది?
ఏళ్ల తరబడి ప్రభుత్వాలు పెంచుతూ పోయిన విద్యుత్ టారిఫ్‌లను తొలిసారిగా కూటమి ప్రభుత్వం యూనిట్‌కు 13 పైసల చొప్పున తగ్గించినా, ఆ విషయాన్ని ప్రజలకు సమర్థంగా, విస్తృతంగా వివరించడంలో ఫెయిల్ అయ్యామని సీఎం పదే పదే గుర్తు చేశారు. అంతేకాక, ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను, విమర్శలను వెంటనే, ధీటుగా తిప్పికొట్టడంలో మంత్రులు చొరవ తీసుకోవడం లేదని, ఇది రాజకీయంగా ప్రభుత్వానికి నష్టం కలిగిస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ (YSRCP) విమర్శలను తిప్పికొట్టడంలో మంత్రులు విఫలమవుతున్నారని, కూటమి పార్టీల్లో ఎవరిపై ఎలాంటి నింద పడినా, అందరూ కలిసి వాటిని తిప్పికొట్టాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
సుతిమెత్తని వార్నింగ్
మంత్రులు తమ పనితీరును మెరుగుపరుచుకోకపోతే, పదవులు పోయే అవకాశం ఉందని ముఖ్యమంత్రి సుతిమెత్తగా హెచ్చరించినట్లు సమాచారం. మంత్రుల పనితీరుపై తాను ఐవీఆర్ఎస్ (IVRS) ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నానని, అలాగే ఫైల్స్ క్లియరెన్స్‌లో తీసుకుంటున్న సమయంపైనా నిఘా ఉంచానని సీఎం స్పష్టం చేశారు. పదేపదే హెచ్చరించినా గేర్ మార్చకపోతే, వారి స్థానంలో కొత్తవారిని తీసుకురావడం తనకు క్షణాల్లో పని అని ఆయన కఠినంగా చెప్పినట్లు తెలిసింది. మంత్రులు కేవలం అజెండాలో ఉన్న అంశాలకే పరిమితం కాకుండా, రాజకీయ అంశాలపైనా దృష్టి పెట్టాలని, తరచుగా మీడియాతో మాట్లాడి ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలకు వివరించాలని ఆయన ఉద్ఘాటించారు.
అంతర్గత మథనం!
ముఖ్యమంత్రి హెచ్చరికలు, ఆదేశాలపై మంత్రుల అంతర్గత వర్గాల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. పాలనలో లోపాలు బయటపడుతున్నప్పుడు, వాటి గురించి ప్రతిపక్షం ‘సూపర్ సిక్స్ అమలు చేయకుండా కబుర్లు చెబుతున్నారని’ లేదా ‘కల్తీ మద్యం’ సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తితే వాటిని తిప్పికొట్టడం ఎలా సాధ్యమవుతుందని మంత్రులు ప్రశ్నించుకుంటున్నారు. అంతేకాక, నియోజకవర్గాల్లో కూటమి నేతలు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు (TDP MLAs) అవినీతి దందాలకు పాల్పడుతున్నారని, వారి క్రమశిక్షణారాహిత్యంపై ఇన్చార్జి మంత్రులు జోక్యం చేసుకుంటే, అధినేత మందలించినా పట్టించుకోని స్థితిలో ఉన్నవారు తమ మాట వింటారా, అనవసరంగా పరువు పోగొట్టుకోవడం తప్ప ఏం సాధించగలం? అనేది మంత్రుల మాటగా ఉందట.
మొత్తమ్మీద, ప్రభుత్వ పాలనా సంస్కరణలతో పాటు, ముఖ్యంగా ప్రభుత్వ సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో మంత్రులు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలనేది ముఖ్యమంత్రి ప్రధాన ఉద్దేశంగా ఉంది. అయితే, ఎన్నిసార్లు క్లాస్ తీసుకున్నా మంత్రుల వైఖరిలో మార్పు రాకపోవడం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ తాజా హెచ్చరికల తరువాత మంత్రుల పనితీరులో వేగం పెరుగుతుందా? లేక ఈ క్లాస్‌లు, హెచ్చరికలు కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు దారి తీస్తాయా అనేది వేచి చూడాలి.
ప్రజావాణి చీదిరాల