Balakrishna Vs Chiranjeevi: ఇంతటితో ఆగుతుందా? లేదంటే దహనమేనా?
ఏపీ అసెంబ్లీ సాక్షిగా రచ్చ ప్రారంభమైంది. మొన్నటి వరకూ చప్పగా సాగిన అసెంబ్లీ సమావేశాలు నిన్న మాత్రం ఘాటెక్కాయి. నాడు శ్రీకృష్ణుడు ఒక పర్సస్‌తో ఖాండవ దహనం చేయిస్తే..

ఏపీ అసెంబ్లీ సాక్షిగా రచ్చ ప్రారంభమైంది. మొన్నటి వరకూ చప్పగా సాగిన అసెంబ్లీ సమావేశాలు నిన్న మాత్రం ఘాటెక్కాయి. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణల మధ్య చెలరేగిన మంటలు మూమూలుగా రాజుకోలేదు. నాడు శ్రీకృష్ణుడు ఒక పర్సస్‌తో ఖాండవ దహనం చేయిస్తే.. నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ ఏ పర్సస్ లేకుండానే మంటలు రాజేశారు. ముఖ్యంగా బాలయ్య మాట్లాడిన మాటలు పెను విధ్వంసానికే దారితీస్తున్నట్టుగా పరిస్థితులను చూస్తుంటే అనిపిస్తోంది.
అధికార పక్షమైనా.. విపక్షమైనా తప్పు మాట్లాడితే అది తప్పేనని చెప్పాలి. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మాట్లాడిన మాటలు కూడా కరెక్ట్ అయ్యుండేవేమో.. ఆయన గౌరవంగా మాట్లాడి ఉంటే.. కానీ ఆయన ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడారు. మనం ఏదైనా చెప్పే విధానంలోనే ఉంటుంది. బాలయ్య చెప్పిన విధానం చాలా రాంగ్. అందులో ఎలాంటి సందేహమూ లేదు. సినిమా వాళ్లు ఆ సైకో గాడిని కలిసేందుకు వెళ్లారన్న మాటలోనే రాంగ్ ఉంది. అసెంబ్లీ సాక్షిగా ఒక ప్రజా ప్రతినిధిని సైకోగాడు అనడమే తప్పు. ఇక ఆ తరువాత.. చిరంజీవి (Chiranjeevi) గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడన్నది అబద్ధమనడంలో తప్పు లేదు కానీ.. అక్కడ ఎవడూ గట్టిగా అడగలేదనడమే తప్పు. ఎవడూ ఏంటి? చిరును ఉద్దేశించి అలాంటి మాటా? పైగా ఆ తరువాత కూడా ఎవడడిగాడు గట్టిగా? అంటూ బాలయ్య మరింత గుచ్చుకునేలా మాట్లాడారు. దీనిపై చిరంజీవి స్పందించారు.
నేను ప్రయత్నించా.. బాలయ్యే అందుబాటులోకి రాలే..
అసలు ఆ రోజున ఏం జరిగిందనేది చిరు ఒక ప్రకటనలో వెల్లడించారు. సినిమా టికెట్ల ధరల పెంపు కోరుతూ తెలుగు సినీ పరిశ్రమ (Cine Industry)కు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, చలన చిత్ర వాణిజ్య మండలి ప్రతినిధులు తన దగ్గరకు వచ్చారని చిరు తెలిపారు. ఈ క్రమంలోనే టికెట్ల ధరల పెంపు కోసం అప్పటి వైసీపీ (YCP) రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుటుందని తనన కోరడంతో.. అప్పటి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని (Perni Nani)తో మాట్లాడానన్నారు. ఆయన అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)తో తేదీని ఫిక్స్ చేసి భోజనానికి రావాలని పిలిచారట. ఈ క్రమంలోనే వెళ్లిన తమను ముఖ్యమంత్రి నివాసానికి సాదరంగా ఆహ్వానించారని.. భోజన సమయంలో చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించినట్టు చిరు తెలిపారు. సమయం ఇస్తే సినీ పరిశ్రమ నుంచి అందరం వచ్చి కలుస్తామని తెలియజేసి వచ్చేశారట. ఆ తరువాత పేర్ని నాని డేట్ ఫిక్స్ చేసి చెప్పగా.. బాలకృష్ణను సైతం తాను సంప్రదించేందుకు యత్నించానని కానీ ఆయన అందుబాటులోకి రాలేదని చిరు తెలిపారు. నిర్మాత జెమినీ కిరణ్ సైతం యత్నించారని కానీ బాలయ్య అందుబాటులోకి రాలేదని చిరు వెల్లడించారు. అప్పుడు ఆర్.నారాయణమూర్తి సహా కొంతమందిమి వెళ్లి జగన్‌ను కలిసినట్టు తెలిపారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని కోరామని చిరు వెల్లడించారు.
ఎవరితోనైనా గౌరవంగానే మాట్లాడుతా..
తాను తీసుకున్న చొరవ కారణంగానే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం సినిమా టికెట్ల (Movie Tickets) ధరల పెంపునకు అంగీకారం తెలిపిందని.. అది సినీ పరిశ్రమకు కొంత మేర మేలు చేసిందని చిరు తెలిపారు. ఈ క్రమంలోనే ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి సినిమా టికెట్ల ధరలను పెంచడం జరిగిందన్నారు. తాను ముఖ్యమంత్రితోనైనా, సామాన్యుడితోనైనా సహజసిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చి పుచ్చుకునే విధానంలో మాట్లాడతానని చిరు తెలిపారు. ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నందువల్ల ప్రకటన ద్వారా ఈ విషయంపై స్పందిస్తున్నట్టు వెల్లడించారు. మొత్తానికి అగ్గి అయితే రాజుకుంది. ఈ విషయంపై బాలయ్య స్పందించకుండా కూల్‌గా ఉంటే ఓకే.. ఏదైనా తిరిగి మాట్లాడారంటే ఆయన మాటల కారణంగా ప్రభుత్వం ఇబ్బందుల్లో పడాల్సి వస్తుందనడంలో సందేహమే లేదు. ఇప్పటికి ప్రభుత్వ వ్యతిరేక మీడియా దీనిని పెద్ద రాద్దాంతం చేస్తోంది. ఏది ఏమైనా బాలయ్యకు చిరు చాలా గౌరవంగా కౌంటర్ ఇచ్చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నడుస్తోంది. ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు.. ఇరు పార్టీల మధ్య సఖ్యతను దెబ్బతీసినా ఆశ్చర్యపోవాల్సి అవసరం లేదు. మరి ఈ పరిణామం ఇంతటితో సమసిపోతుందో.. లేదో చూడాలి.
ప్రజావాణి చీదిరాల