AP News: ఒకవైపు 3.. మరోవైపు 7 గ్రామాలు.. కర్రల యుద్ధం.. అధికారుల్లో టెన్షన్..
ఒకవైపు మూడు గ్రామాలు.. మరోవైపు ఏడు గ్రామాలు.. కర్రలతో తలపడితే ఎలా ఉంటుంది? రక్తం ఏరులై పారుతున్నా వెనుకడుగు వేసేదే లేదు. పగులుతున్న తలలు.. ఒంటిపై గాయాలు చూస్తుంటే అధికారుల్లో టెన్షన్ పెరిగిపోతుంది.

ఒకవైపు మూడు గ్రామాలు.. మరోవైపు ఏడు గ్రామాలు.. కర్రలతో తలపడితే ఎలా ఉంటుంది? రక్తం ఏరులై పారుతున్నా వెనుకడుగు వేసేదే లేదు. పగులుతున్న తలలు.. ఒంటిపై గాయాలు చూస్తుంటే అధికారుల్లో టెన్షన్ పెరిగిపోతుంది. ప్రాణ నష్టం జరిగితే పరిస్థితి ఏంటనే ఆందోళన.. కానీ దీనిని చూసేందుకు ఊళ్లన్నీ సంతోషంగా ఎదురు చూస్తున్నాయి. ఇవాళ అర్ధరాత్రే ఈ కర్రల యుద్ధం ప్రారంభం కానుంది. దీనినే బన్ని యాత్ర (Banny Yatra) అని అంటారు.
కర్నూలు జిల్లా హొళగుంద మండలంలోని దేవరగట్టు (Devaragattu)లో దసరా (Dussehra) రోజు రాత్రి ఈ కర్రల సమరం జరుగనుంది. దీనిని బన్ని ఉత్సవం (Banny Utsav)గా పిలుస్తారు. ఇది వస్తోందంటేనే అక్కడి వారి ఆనందానికి అవధులుండవు. కొత్తగా చూసేవారికైతే వెన్నులో వణుకు పుడుతుంది. అసలెందుకు వీరంతా ఇలా కర్రలతో కొట్టుకుంటారు.. అంటారా? దీనికో స్టోరీ ఉంది. దేవరగట్టులో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండపై మాళ మల్లేశ్వరస్వామి కొలువుదీరాడు. ఇక్కడ జరిగే దసరా బన్ని ఉత్సవం తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచింది. ఈ బన్ని ఉత్సవం వెనుక అందరి ఉద్దేశం ఒకటే. స్వామి దేవతామూర్తులను కాపాడుకోవడమే.
దీనికోసం హోళగుంద మండలంలోని నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఒకవైపు.. అరికెర, అరికెరతండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం తదితర గ్రామాలు మరోవైపు తలపడతాయి. వీరంతా కర్రలతో దారుణంగా కొట్టుకుంటారు. కర్రల సమరంలో గాయాలు కావా? అంటే ఎందుకు కావు.. తలలు పగులుతాయి. కొందరికి ఒళ్లంతా గాయాలవుతాయి. అయినా సరే.. తీవ్రంగా గాయపడితే అధికారులు వారిని హాస్పిటల్‌కు తీసుకెళతారు. ఇక మిగిలిన వారు మాత్రం అక్కడ దొరికే బండారు అంటే మరేదో కాదు.. పసుపు గాయాలపై రాసుకుని వెళ్లిపోతారు. ముందుగా ఇవాళ రాత్రి స్వామివారి కల్యాణం జరిపిస్తారు.
అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకిలో మోసుకుని కొండ కిందకు తీసుకొస్తారు. కల్యాణకట్ట వద్దకు తీసుకొచ్చిన వెంటనే పూజలు నిర్వహించి ఉత్సవమూర్తుల ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ ఊరేగింపు బసవన్నగుడి వద్దకు రాగానే కర్రల సమరం ప్రారంభమై బసవన్న గుడి వద్దకు చేరుకోగానే ముగుస్తుంది. కొందరు కర్రల సమరంలో గాయడితే.. మరికొందరు కాగడాల నుంచి నిప్పు పడి గాయపడతారు. అయితే ఊరేగింపు రాక్షసపడ వద్దకు చేరుకుంటుంది. అక్కడ గొరవయ్య తన తొడ నుంచి రాక్షసులకు రక్తాన్ని ధారపోస్తాడు. తిరిగి పల్లకి బసవన్న గుడికి చేరుతుంది. అక్కడ పూజారి భవిష్యవాణి వినిపిస్తాడు. ఉత్సవమూర్తులను తిరిగి కల్యాణ కట్టకు చేర్చడంతో ఉత్సవం ముగుస్తుంది.