Kavithakka Updates: 15 రోజుల సిరీస్.. ఎవరి బాగోతాలు బయటికి రాబోతున్నాయి?
కల్వకుంట్ల కుటుంబ కథా చిత్రం రోజుకో మలుపు తిరుగుతోంది. మొత్తానికి కేసీఆర్ అయితే తన కూతురు కవితను పార్టీ నుంచి బయటకు పంపించేశారు. దీని వెనుక రెండు కథనాలు అయితే వినిపిస్తున్నాయి.

కల్వకుంట్ల కుటుంబ (Kalvakuntla Family) కథా చిత్రం రోజుకో మలుపు తిరుగుతోంది. మొత్తానికి కేసీఆర్ (KCR) అయితే తన కూతురు కవితను పార్టీ (BRS Party) నుంచి బయటకు పంపించేశారు. దీని వెనుక రెండు కథనాలు అయితే వినిపిస్తున్నాయి. ఒకటేంటంటే.. ఒకసారి కవిత ఆరోపణల సైడ్ నుంచి కేసీఆర్ ఆలోచించి ఉంటే బాగుండేది.. ఆ కోణంలో ఒక ఎంక్వైరీ కమిటీ కూడా వేసి ఉంటే బాగుండేదని కొందరు అంటున్నారు. మరికొందరేమో.. ఒకవేళ కాళేశ్వరం (Kaleswaram) విషయంలో హరీష్ రావు (Harish Rao) తప్పిదం ఏమైనా ఉంటే అది కేసీఆర్‌కు తెలియకుండా జరిగే అవకాశం లేదు కదా.. ఇద్దరూ తోడు దొంగలేనని అంటున్నారు. మరికొందరు కవిత విషయంలో కేసీఆర్ ఎప్పటి నుంచో అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam)లో జైలు పాలైన తర్వాత కేసీఆర్ ఎంక్వైరీ చేయగా.. ఆమె ఏమేం చేసిందనే విషయాలు చాలా బయటకు వచ్చాయని టాక్ నడుస్తోంది. ఆ తరువాత కవిత ఏకంగా పార్టీకే నష్టం చేకూర్చేలా వ్యాఖ్యలు చేయడంతో ఇక ఛాన్స్ తీసుకుంటే అసలుకే ఎసరు వచ్చేలా ఉందని ఆమెను పార్టీ నుంచి కేసీఆర్ బయటకు పంపించారని ప్రచారం జరుగుతోంది.
హ్యాపీరావు కొత్త డ్రామా షరూ..
మరోవైపు కవితను చూస్తుంటే ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు. కవితక్క అప్‌డేట్స్ (Kavithakka Updates) పేరిట ఓ ట్విటర్ (Twitter) అకౌంట్‌ను ప్రారంభించి మరీ దానిలో 15 రోజుల సిరీస్ పేరిట పోస్టులను పెట్టడం ఆరంభించారు. దీనిలో భాగంగా తొలుత హ్యాపీరావు (Happy Rao) కొత్త డ్రామా పేరిట ఓ భారీ పోస్టే పెట్టారు. అప్పట్లో మహాత్మాగాంధీ స్ఫూర్తితో కేసీఆర్ పల్లె ప్రగతి (Palle Pragathi) అనే అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని.. అది తెలుసుకున్న హ్యాపీరావు సంతోషంగా గ్రీన్ ఇండియా (Green India) పేరిట కొత్త డ్రామా షురూ చేశారని ఎక్స్ (X)లో పేర్కొన్నారు. అప్పుడు హ్యాపీరావు కన్ను ప్రతి గ్రామ పంచాయతీకి ఇచ్చే ట్రాక్టర్ల (Tractors) మీద పడటంతో తన బినామీ అయిన వరికోలు వాసి, కోడి పందాలు వేసే తన దోస్తుతో కలిసి హ్యాపీరావు రూ.120 కోట్ల కమీషన్ కోసం స్కెచ్ వేశాడని కవితక్క అప్‌డేట్స్ అకౌంట్‌లో పేర్కొన్నారు.
కొంత కాలం పాటు మాటల్లేవట..
ఈ స్కెచ్‌లో భాగంగానే అప్పటికే ఆ పిస్సార్ ట్రాక్టర్‌కి సంబంధించిన బిజినెస్ చేసి ఉండటం వల్ల బెంగుళూరులో ట్రాక్టర్ కంపెనీలతో డీల్ చేసుకున్నారని ఎక్స్‌లో పేర్కొనడం జరిగింది. ఒక్కో ట్రాక్టర్‌కు లక్ష రూపాయలు ఇవ్వాలనే డీల్ చేసుకుని దీనిలో భాగంగా అప్పటి సంబంధిత మంత్రిని సైతం వాటా ఇవ్వకుండా పక్కనబెట్టేశారన్నారు. ఆ తరువాత ఆ మంత్రి తనకు వాటా ఇవ్వాలని గట్టిగా అడగటంతో ఒక ఖరీదైన కారును ఈఎంఐ (EMI) బేసిస్‌లో తీసుకుని ఆయన ఇంటికి పంపించారట. కనీసం దానికి ఆ తరువాత ఈఎంఐ కూడా కట్టకపోవడంతో సదరు మంత్రే తనకు అవసరం లేని కారుకు ఈఎంఐ కట్టుకోవాల్సిన దుస్థితి వచ్చిందని వెల్లడించారు. ఇక ఆ 120 కోట్లను ఇద్దరూ పంచుకుని మంత్రికి మాత్రం హ్యాండ్ ఇచ్చారట. ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ ఇద్దరు నాయకులకు కొంత కాలం పాటు మాటలు లేకుండా పోయాయని.. ఈ మధ్యనే కుట్టు మిషన్లు పంచుతున్నారని కవితక్క అప్‌డేట్స్‌లో చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ డిఫెండ్ చేసుకుంటుందా?
మొత్తానికి తాజాగా కవితక్క అప్‌డేట్స్‌లో సిరీస్ 1.. హ్యాపీరావు గురించి చెప్పుకొచ్చారు. మరి ఇంకా 14 రోజుల పాటు ఏమేం విషయాలు బయటకు రానున్నాయో.. ఎవరెవరి గురించి కవితక్క అప్‌డేట్స్ సిరీస్ బయటపెట్టనుందో తెలియాల్సి ఉంది. అసలు ఈ విషయాలన్నీ అవాస్తవమని కొట్టిపడేయడానికి కూడా లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క విషయం గురించి పూర్తిగా వివరిస్తున్నారు. నిప్పు లేనిదే పొగరాదన్నట్టుగా ఇంత వివరణ వెనుక సత్యం ఉండి ఉండవచ్చు కదా.. కవితక్క అప్‌డేట్స్ అయితే పెను సంచలనంగా మారుతోంది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవకతవకలన్నీ బయటపెట్టే అవకాశం ఉందని చాలా మంది చెప్పుకుంటున్నారు. ఇప్పుడు పార్టీ నుంచి బయటకు పంపించేశారు కాబట్టి కేసీఆర్ సైతం ఆమె అప్‌డేట్స్‌కి కళ్లాలేసే ఛాన్సే లేదు. మరి ఈ పోస్టులను బీఆర్ఎస్ డిఫెండ్ చేసుకుంటుందా? లేదంటే సైలెంట్‌గా ఊరుకుంటుందా? ఏం చేసినా అసలుకే ఎసరొస్తుంది. మొత్తానికి కవితక్క అయితే బీఆర్ఎస్‌ను ఇరుకున పెడుతున్నారనడంలో సందేహం లేదు.
ప్రజావాణి చీదిరాల