others

Stock Market: ఒక్క వ్యాఖ్యతో సూచీలను నష్టాల ఊబి నుంచి లాగి లాభాల బాట పట్టించిన సెర్గియో..

స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ఉదయం భారీ నష్టాల్లో మొదలైన సూచీలు.. సడెన్‌గా యూటర్న్ తీసుకున్నాయి. అమెరికా టారిఫ్ భయాలు, విదేశీ ఇన్వెస్టర్స్ అమ్మకాలతో దాదాపు 700 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్‌..

Stock Market: ఒక్క వ్యాఖ్యతో సూచీలను నష్టాల ఊబి నుంచి లాగి లాభాల బాట పట్టించిన సెర్గియో..

స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ఉదయం భారీ నష్టాల్లో మొదలైన సూచీలు.. సడెన్‌గా యూటర్న్ తీసుకున్నాయి. అమెరికా టారిఫ్ భయాలు, విదేశీ ఇన్వెస్టర్స్ అమ్మకాలతో దాదాపు 700 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్‌.. 25,500 దిగువకు వెళ్లిన నిఫ్టీ.. అనూహ్యంగా తిరిగి లాభాల బాట పట్టాయి. కేవలం గంట వ్యవధిలోనే ఇదంతా జరగడం విశేషం. ఇదంతా భారత్‌లో అమెరికన్ అంబాసిడర్ సెర్గియో గోర్ మహిమేనని చెప్పాలి. ఒకే ఒక్క మాట చాలు.. స్టాక్ ఎక్సేంజ్‌ గతిని మార్చడానికి. అలా ఇవాళ (సోమవారం) అంబాసిడర్‌గా సోమవారం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సెర్గియో గోర్ కొన్ని వ్యాఖ్యలు చేసి నష్టాల్లో ఉన్న సూచీలను అమాంతం లాగి లాభాల బాటలో వేసేశారు.

భారత్‌- అమెరికా కీలక భాగస్వాములని.. మిత్రులన్నాక ఏవో అభిప్రాయ భేదాలు ఉంటాయని సెర్గియో వ్యాఖ్యానించారు. అలాగే జనవరి 13న ఇరు దేశాల మధ్య తదుపరి దశ వాణిజ్య చర్చలు ఉంటాయని ఆయన చెప్పిన మాటలు మార్కెట్‌కు బూస్ట్‌ ఇచ్చాయి. అంతేకాకుండా ఆయన మరో ప్రకటన కూడా చేశారు. సిలికాన్‌ సప్లై కోసం అమెరికా నేతృత్వంలో వ్యూహాత్మకంగా ఏర్పాటైన ప్యాక్స్‌ సిలికాన్‌ కూటమిలోకి భారత్‌ను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో మరో లడ్డూ కావాలా నాయనా అన్నట్టుగా ఈ వ్యాఖ్యలు సైతం పాజిటివ్‌ సెంటిమెంట్‌కు కారణమయ్యాయి. ఐదు రోజులుగా వరుసగా నష్టాల బాటలో పయనిస్తున్న మార్కెట్లు సెర్గియో వ్యాఖ్యలతో తిరిగి లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్‌ కనిష్ఠాల నుంచి దాదాపు 1100 పాయింట్ల మేర రికవర్‌ అయ్యింది.

సెన్సెక్స్‌ ఉదయం 83,435.31 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమవగా... ఇంట్రాడేలో 82,861.07 వద్ద కనిష్ఠాన్ని తాకింది. సెర్గియో గోర్‌ వ్యాఖ్యల అనంతరం లాభాల బాట పట్టిన సూచీ.. ఇంట్రాడేలో 83,962.33 వద్ద గరిష్ఠాన్ని తాకడం విశేషం. చివరికి 301.93 పాయింట్ల లాభంతో 83,878.17 వద్ద ముగిసింది. 25,473.40 వద్ద కనిష్ఠాన్ని తాకిన నిఫ్టీ.. ఇంట్రాడేలో 25,813.15 వద్ద గరిష్ఠానికి చేరి చివరికి 106.95 పాయింట్ల లాభంతో 25,790.25 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా స్టీల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ట్రెంట్‌, ఎస్‌బీఐ, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ షేర్లు ప్రధానంగా లాభపడగా.. ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బీఈఎల్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు మాత్రం నష్టాలు చవిచూశాయి.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
January 12, 2026 11:43 AM