Weekly Horoscope: వామ్మో.. ఈ రాశి వారు మాత్రం ఆచి తూచి అడుగేయాల్సిందే..
ఈ వారం అంటే జనవరి 11వ తేదీ నుంచి జనవరి 17వ తేదీ వరకూ మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉంటే.. కొన్ని రాశుల వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు.. మరికొన్ని రాశుల వారికి ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఈ వారం అంటే జనవరి 11వ తేదీ నుంచి జనవరి 17వ తేదీ వరకూ మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉంటే.. కొన్ని రాశుల వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు.. మరికొన్ని రాశుల వారికి ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మేషం (Aries)
మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండనున్నాయి. అయితే ఉద్యోగులకు మాత్రం ఈ వారం చాలా బాగుంటుంది. ఉన్నత పదవులు, అధికార పరిధి విస్తరణ.. ఉద్యోగంలో గుర్తింపు, పదోన్నతి లభించే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. వ్యాపారులకు ఈ వారం అంత ఆశాజనకంగా అయితే లేదు. సమిష్టి నిర్ణయాలకు ప్రాధాన్యం ఇస్తూ భాగస్వాములతో కలిసికట్టుగా పనిచేస్తే విజయంతో పాటు ఆర్థిక స్థితిగతులు బాగుండే అవకాశం ఉంది. నూతన ఆదాయ మార్గాల ద్వారా ధనలాభంతో ఆర్థికంగా బలోపేతం అవుతారు. ప్రేమ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి.. కుటుంబం వ్యవహారాల్లో.. వైవాహిక జీవితంలో సమస్యలు రాకుండా జీవిత భాగస్వామితో సంయమనంతో వ్యవహరించాలి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు సైతం ఈ వారం కొంత ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉంటే విజయం సాధిస్తారు. ఈ రాశి వారంతా తప్పనిసరిగా ఈ వారం ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. శివ సహస్రనామాలు చదువుకుంటే మంచి జరుగుతుంది.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలుంటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా వ్యాపారులకు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనువైన సమయం. అలాగే కీలక ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. ఉద్యోగులకు కూడా చాలా బాగుంటుంది. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోయి.. అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పదోన్నతులకు సైతం మెండుగానే అవకాశం కనిపిస్తోంది. ఆర్థికంగా కూడా ఈ రాశి వారికి బాగుంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడి తద్వారా రుణభారం తొలగుతుంది. ఖర్చులు తెలివిగా నిర్వహించాలి. ప్రేమ వ్యవహారాల్లో స్పష్టత.. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. కుటుంబ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. విద్యార్థులు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం స్వల్పంగా ఇబ్బంది పెడుతుంది. ఈ రాశి వారు సూర్యారాధన చేస్తే మరింత బాగుంటుంది.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. పెట్టుబడులు, లాభాలు గణనీయంగా పెరగడంతో పాటు సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు గడిస్తారు. ఉద్యోగులకు సైతం చాలా అనుకూలంగా ఉంటుంది. పదోన్నతులు, జీతాల పెంపునకు సంబంధించిన శుభవార్తలతో పాటు స్థానచలనం సూచన కూడా ఉంది. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టడం వలన ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుంది. ప్రేమ వ్యవహారాల్లో కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు. వైవాహిక జీవితం సాఫీగా సాగడంతో పాటు జీవిత భాగస్వామితో విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. ఈ రాశి వారు శివారాధన చేస్తే చాలా బాగుంటుంది.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రంగం ఏదైనా సత్ఫలితాలు సాధించాలంటే శ్రమించాల్సి ఉంటుంది. వ్యాపారులకు మంచి లాభాలుంటాయి కానీ భాగస్వాములతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు తప్పవు. అధికారుల మెప్పు పొందాలంటే తీవ్రంగా శ్రమించాలి. పనిభారం, ఒత్తిడి పెరుగుతాయి. ఆర్థికంగా మాత్రం బాగానే ఉంటుంది. కుటుంబంలో ఘర్షణలు కలహాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కుటుంబ పెద్దల పట్ల గౌరవభావంతో ఉండాలి. విహారయాత్రలు, విందు వినోదాలలో పాల్గొంటారు. విద్యార్థులు శ్రమిస్తే ఫలితం బాగుంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాల్సిందే. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ వారం బాగుంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తి రంగంలో కొనుగోళ్లు, అమ్మకాలు ఊపందుకుంటాయి. అన్ని రకాల వ్యాపారాలు లాభాలు తెచ్చిపెడతాయి. ఉద్యోగంలో స్థిరత్వం.. పదోన్నతులకు అవకాశాలు.. ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఐటీ, మెకానికల్, ఇంజనీరింగ్ రంగాల వారికి ఈ వారం చాలా బాగుంటుంది. ఆర్థికంగా ధన ప్రవాహంతో పాత పెట్టుబడుల నుంచి కూడా లాభాలు.. వారసత్వపు ఆస్తుల ద్వారా ప్రయోజనం .. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత వంటివి ఉన్నాయి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలున్నా ఇబ్బంది అయితే ఉండదు. విద్యార్థులు మాత్రం చదువులో రాణించడానికి మరింత కష్టపడాలి. ఈ రాశి వారికి శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.
కన్య (Virgo)
కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు అనుకూలంగా ఉండటంతో కొత్త పనులు, కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగులకు మాత్రం అంత సానుకూలంగా లేదు. ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు... ప్రారంభించిన పనుల్లో తరచూ ఆటంకాలు చికాకు పెడతాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. ఆర్థికంగా హెచ్చుతగ్గులుంటాయి. ప్రేమ వ్యవహారాల్లో ఆచి తూచి అడుగేస్తే మంచిది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు చదువులో వెనుకబడే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం విషయంలోనూ నిర్లక్ష్యం పనికి రాదు. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే మంచి జరుగుతుంది.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాల కోసం కృషి చేయాల్సి ఉంటుంది. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉండవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలలో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. వ్యాపారంలో నెలకొన్న పోటీ కారణంగా లాభాలు కూడా తగ్గవచ్చు. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. పట్టుదల, ఏకాగ్రతతో మంచి గుర్తింపు లభిస్తుంది. స్వస్థానప్రాప్తి ఉండవచ్చు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల అవసరాల కోసం అధిక ధనవ్యయం ఉంటుంది. ప్రేమ బంధాల్లో అనవసర వాదనలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. జీవిత భాగస్వామితో ఘర్షణలకు దూరంగా ఉంటే మంచిది. విద్యార్థులు చదువుపై పూర్తిగా దృష్టి సారించాలి. పాత అనారోగ్య సమస్యలు తిరగబెట్టే ప్రమాదం ఉన్నందున ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. వృత్తి పరంగా అనుకూలత.. ముఖ్యంగా వ్యాపారులకు కలిసొస్తుంది. వ్యాపారంలో విజయం కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. చక్కని ప్రణాళికతో, ముందుచూపుతో లాభాలు పెరుగుతాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులు పనిపట్ల శ్రద్ధ పెంచాలి. అనవసర విషయాల్లో, ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చడం మంచిపని కాదు. ఆర్థికంగా బాగానే ఉన్నప్పటికీ కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున, ఆర్థిక సమస్యలు రాకుండా ఖర్చులు నియంత్రించుకోవాలి. ప్రేమ బంధాలు బలపడతాయి. వైవాహిక జీవితం అన్యోన్యంగా ఉంటుంది. విద్యార్థులు కృషికి తగిన ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు చేస్తుంది.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని ఊహించని సవాళ్లు.. వ్యాపారంలో అనేక హెచ్చుతగ్గులు.. పెట్టిన పెట్టుబడి కూడా నష్టపోయే అవకాశం ఉంది. ప్రతి అడుగు ఆచి తూచి వేస్తే మంచిది. ఉద్యోగులకు సైతం అంత ఆశాజనకంగా లేదు. స్థిరత్వం లోపించడం.. ఉద్యోగ మార్పు గురించి ఆలోచించే అవకాశం ఉంది. ఆర్థిక స్థితి స్థిరంగానే ఉన్నప్పటికీ డబ్బు రాకలో అడ్డంకులు.. ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలు ఆలస్యం కావచ్చు. వైవాహిక జీవితంలో సామరస్యం కోసం చేసే ప్రయత్నాలు సైతం సత్ఫలితాన్నిచ్చే అవకాశం లేదు.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా శ్రమించాలి. వ్యాపారంలో ధనయోగం.. వ్యాపార విస్తరణకు అవసరమైన ధనం సమకూరుతుంది. ఉద్యోగులకు మాత్రం పనిఒత్తిడి.. ఉద్యోగ విషయంలో అభద్రత వంటివి ఉంటాయి. ఎంత కష్టపడినా పనులు పూర్తి కావు. కుటుంబ ఖర్చులు పెరగడంతో పాటు ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు ఈ వారం అనుకూలం. చదువులో మంచి పురోగతి సాధిస్తారు. అయితే ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. ముఖ్యంగా వ్యాపారులు నూతన వ్యూహాలతో లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు ఉద్యోగంలో ఆశించిన ఫలితాలతో పాటు కొంతకాలంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు సైతం తొలగిపోతాయి. ఆర్థికంగా బాగుంటుంది. తీర్థ యాత్రల నిమిత్తం అధిక ఖర్చులు.. ప్రేమ వ్యహారాల్లో సర్దుబాటు ధోరణి.. కుటుంబంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నా కూడా జీవిత భాగస్వామి సహకారంలో సమస్యలు అధిగమిస్తారు. విద్యార్థులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. శని ధ్యానం సత్ఫలితాన్నిస్తుంది.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలుంటాయి. ఉద్యోగ, వ్యాపారంలో సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారులకు బాగా కలిసొస్తుంది. పెట్టుబడులు, లాభాల రూపంలో ధనప్రవాహం.. విదేశీ వ్యాపారాలు కలిసి రావడంతో పాటు అధిక ఆదాయాలు.. వ్యాపార నిమిత్తం చేసే దూర ప్రయాణాలు కలిసొస్తాయి. ఉద్యోగులకు పనిప్రదేశంలో ఒత్తిడి తగ్గడంతో పాటు పదోన్నతులకు మార్గం సుగమమవుతుంది. ఆర్థికంగా ఈ వారం చాలా బాగుంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో, కుటుంబ సభ్యులతో విహారయాత్రలు చేస్తారు. విద్యార్థులు పట్టుదల, ఏకాగ్రతతో చదివి విజయం సాధిస్తారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇష్ట దేవతారాధన చేస్తే మరింత అద్భుతంగా ఉంటుంది.